logo

డ్రోన్లు వస్తున్నాయ్‌..

కాకినాడ జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో డ్రోన్ల వ్యవస్థ తీసుకురానున్నారు. వరి, ఇతర పంటలకు పురుగు మందుల పిచికారీకి వీటిని వినియోగించనున్నారు.

Published : 04 Feb 2023 05:25 IST

వరిచేలో డ్రోనుతో పురుగు మందు పిచికారీ

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో డ్రోన్ల వ్యవస్థ తీసుకురానున్నారు. వరి, ఇతర పంటలకు పురుగు మందుల పిచికారీకి వీటిని వినియోగించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో కిసాన్‌ డ్రోన్లను ప్రవేశపెట్టాలని ఆదేశాలిచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కిసాన్‌ డ్రోను కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలు నెలకొల్పనున్నారు. ఇప్పటికే వ్యవసాయ యాంత్రీకరణ పరకరాలతో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను రైతు బృందాలు నిర్వహిస్తున్నాయి. పురుగు మందులు, జింకు సల్ఫేట్‌ వంటి సూక్ష్మ పోషకాలు, ద్రవ రూపంలో ఉన్న యూరియాను సకాలంలో డ్రోన్ల ద్వారా పిచికారీ చేస్తారు. దీంతో సేద్యం ఖర్చు తగ్గించడం, రైతు ఆరోగ్యానికి భంగం వాటిల్లకుండా రక్షణ చర్యలు చేపట్టడానికి ఈ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు. దీనికోసం కాకినాడ జిల్లాలోని 20 మండలాల్లో ఒక్కో మండలంలో మూడు చొప్పన రైతు బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బృందంలో అయిదుగురు రైతులు ఉండేలా చూస్తున్నారు. వీరిలో ఒకరు కచ్చితంగా ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై, పైచదువులు పూర్తి చేసి ఉండాలి. మొత్తం 60 బృందాలు లక్ష్యం కాగా, ఇప్పటికి 46 నెలకొల్పారు. వీరికి గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ వర్సిటీలో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే యు.కొత్తపల్లి మండలం నుంచి ఒకరు, పిఠాపురం మండలం నుంచి ఇద్దరు శిక్షణ పూర్తి చేసుకున్నారు. శిక్షణకు ప్రైవేటుగా రూ.45వేల వరకు ఖర్చు అవుతుండగా, రైతులకు ఉచితంగా ఇస్తున్నారు. ఒక్కో రైతుకి రూ.17వేలు చొప్పున ప్రభుత్వం వెచ్చిస్తోంది.

40 శాతం  రాయితీ

రైతు బృందాలకు రాయితీ ద్వారా డ్రోన్లను సరఫరా చేయనున్నారు. గరిష్ఠంగా ఒక్కో డ్రోనుకు రూ.10లక్షలు ఖర్చవుతుందని అంచనా. దీనిలో 40 శాతం రాయితీ, 10 శాతం రైతు బృందం వాటా, 50 శాతం డీసీసీబీ ద్వారా రుణం కల్పించే విధంగా యూనిట్‌ను రూపకల్పన చేశారు. రైతు బృందంలో అగ్రికల్చరల్‌ బీఎస్సీ, వ్యవసాయ రంగ కోర్సులు పూర్తి చేసిన వారుంటే రాయితీని 50 శాతం కల్పించనున్నారు. కిసాన్‌ డ్రోన్‌ కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ద్వారా ఇతర రైతులకు అద్దె ప్రాతిపదికన డోన్లను సరఫరా చేసేలా మార్గదర్శకాలు రూపొందించారు.

పాస్‌పోర్టు మెలిక

రైతు బృందంలో ఉన్న సభ్యులకు విధిగా పాస్‌పోర్టు ఉండాలనే మెలిక పెట్టారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన బృందాల్లో అతి తక్కువ మందికే పాస్‌పోర్టులు ఉన్నాయి. మిగతా వారిలో పాస్‌పోర్టులకు దరఖాస్తు చేయిస్తున్నారు. భారత పౌరుడిగా గుర్తింపునకు ఈ విధానం అమలు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రతీ బృందంలో ఒకరు విద్యావంతుడై ఉండే, అతడిని కిసాన్‌ డ్రోన్‌ పైలెట్‌గా శిక్షణ ఇస్తున్నారు. పాస్‌పోర్టు నిబంధనలతో శిక్షణకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీలైనంత త్వరగా వీటిని సాకారం చేస్తేనే కిసాన్‌ డ్రోన్‌ పథకం విజయవంతం అయ్యే అవకాశం ఉంది.


ఎంతో ఉపయోగం

ఎన్‌.విజయ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి, కాకినాడ జిల్లా

జిల్లాలో 2లక్షల ఎకరాల వరకు వరి, ఇతర వ్యవసాయ, అనుబంధ పంటల సాగు జరుగుతోంది. పంట వేసిన తరువాత తెగుళ్ల నుంచి కాపాడుకోటానికి రైతులు పురుగు మందులు, సూక్ష్మపోషకాలను స్ప్రేయర్ల ద్వారా పిచికారీ చేస్తున్నారు. దీంతో ఒక్కోసారి ఇబ్బంది  ఏర్పడుతోంది. దీన్ని అధిగమించడానికి డ్రోన్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. 20 మండలాల పరిధిలో 60 రైతు బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. వీరిలో కొందరిని డ్రోన్‌ పైలెట్‌గా ఎంపిక చేసి, శిక్షణకు పంపుతున్నాం. పాస్‌పోర్టుల విషయంలో రైతులకు పూర్తి సహకారం అందిస్తున్నాం. త్వరలో డ్రోన్ల ద్వారా పురుగు మందుల పిచికారీ వ్యవస్థను జిల్లాలో ప్రవేశపెడతాం. ఇప్పటికే ట్రయల్‌ రన్‌ చేశాం. దశల వారీగా అన్ని గ్రామాలకు దీన్ని విస్తరిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని