logo

అమ్మఒడి సాయం.. ‘అయోమయం!’

‘అల్లవరం మండలానికి చెందిన ఓ గృహస్థుడికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు అమలాపురంలోని ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. మూడేళ్లుగా అతడికి అమ్మఒడి లబ్ధి అందింది.

Updated : 10 Jul 2023 06:49 IST

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌ : ‘అల్లవరం మండలానికి చెందిన ఓ గృహస్థుడికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు అమలాపురంలోని ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. మూడేళ్లుగా అతడికి అమ్మఒడి లబ్ధి అందింది. ఈ ఏడాది కొత్తగా మరో కొడుకు ఒకటో తరగతి పూర్తి చేయడంతో అమ్మఒడి జాబితాలో అతడి పేరుందని తల్లితో వాలంటీరు ఈ కేవైసీ పూర్తిచేశారు. పెద్ద కొడుక్కి అమ్మఒడి వస్తోందని, చిన్నకొడుకు చదివే పాఠశాలలో బ్యాంకు ఖాతా, ఆధార్‌ వివరాలు ఇవ్వలేదు. ప్రస్తుతం ఇద్దరికీ అందలేదు. ఇది కేవలం ఈ కుటుంబ పరిస్థితి మాత్రమేకాదు. జిల్లావ్యాప్తంగా అనేక మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు అమ్మఒడి సొమ్ము అందని పరిస్థితి నెలకొంది. అసలు తమ పిల్లల పేర్లు అర్హుల జాబితాలో ఉన్నాయో, లేవో కూడా తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్నారు.

ఇప్పటికీ జమకాని నిధులు

అమ్మఒడి నాలుగో విడత లబ్ధి పంపిణీని గత నెల 28న కురుపాంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. బటన్‌ నొక్కిన వెంటనే ఖాతాల్లో నగదు జమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. అదేరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లావ్యాప్తంగా 1,38,833 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.13 వేల చొప్పున రూ.180.48 కోట్లు జమ చేసినట్లు ప్రకటించారు. ఇప్పటివరకు చాలామంది తల్లుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. వారంతా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా అధికారులు స్పష్టంగా అర్హులెందరనేది పేర్లతోసహా వెల్లడించలేదు.

వివరాలు వెల్లడించేదెన్నడో..?

అనర్హుల వివరాలను వెల్లడిస్తే.. లోటుపాట్లు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు చెప్పడం లేదు. దీంతో తాము పథకానికి అర్హత సాధించామో, లేదో తెలియక చాలామంది సతమతమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలులో భాగంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధికి అర్హులను ఆర్నెళ్లకోసారి సమీక్షిస్తుంది. తొలి దశలో అనర్హులైనవారు ఆరు నెలల తరువాత అర్హత సాధిస్తే ఆయా పథకాల లబ్ధి అందిస్తున్నారు. అమ్మఒడి విషయంలో మాత్రం ఈ నిబంధన వర్తించట్లేదు. గత మూడు విడతలు పరిశీలిస్తే మొదట జాబితాలో ఉన్నవారికి మాత్రమే లబ్ధి దక్కుతోంది. ఆరు నెలల తరువాత అర్హత నిరూపించుకున్నా.. డబ్బు అందని పరిస్థితి. గతేడాది లబ్ధి పొందినవారిలో ఆరంచెల పరిశీలన దాటి ఎందరు అర్హులయ్యారో సంఖ్య మాత్రమే అధికారులు చెప్పారు.. వారి వివరాలు మాత్రం ఇవ్వడం లేదు. అర్హులు, అనర్హుల జాబితాల ప్రదర్శనతోపాటు కొత్తగా వచ్చిన దరఖాస్తులపై స్పష్టత ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కొత్తగా అర్హులనుంచి దరఖాస్తులు స్వీకరించడం లేదు. దీంతో తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది.

సచివాలయాల్లో కానరాని జాబితా

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వనుంచి లబ్ధిదారులకు అందుతున్న ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ఈ విడత అమ్మఒడికి సంబంధించిన జాబితా ఇప్పటివరకు ఏ సచివాలయంలోనూ బహిరంగపరచలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలకు వెళ్లి తమకు అమ్మఒడి అందలేదని, అసలు ఈకేవైసీకి వాలంటీరు రాలేదని ప్రధానోపాధ్యాయులను అడుగుతుంటే అమ్మఒడి లబ్ధిపై తమకు ఏ విధమైన సమాచారం లేదని, సచివాలయాలకు వెళ్లాలని చెబుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. తీరా అక్కడికి వెళ్లిచూస్తే నోటీసు బోర్డుల్లో అర్హుల జాబితా ప్రదర్శించడం లేదు. గతేడాది లబ్ధి పొందితే ఈ ఏడాది కూడా డబ్బులొస్తాయి.. కాస్త ఓపికపట్టండంటూ సచివాలయ ఉద్యోగులు అంటున్నారని, కనీసం జాబితాలో తమ పిల్లల పేరుందో, లేదో చెప్పడం లేదని తల్లిదండ్రులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

అర్హులందరికీ అందుతాయి..

ప్రస్తుతం నాలుగో విడత అమ్మఒడి సొమ్మును ప్రాధాన్య క్రమంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ అందుతాయి. అర్హత వివరాలు ఇతర శాఖల నుంచి విద్యాశాఖ అధికారులకు వస్తాయి. వీరి జాబితా ప్రదర్శన విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాం.

కమలకుమారి, జిల్లా విద్యాశాఖ అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని