logo

అనకొండలు.. అధికారం అండదండలు

కక్ష కట్టారో.. తప్పు జరగకపోయినా.. ఎలాంటి ఫిర్యాదులు అందకపోయినా కార్యాలయాల మీదకు వచ్చి  పడతారు.. బాధితులతో బలవంతంగా ఫిర్యాదులు రాయించి మరీ వెంటాడి వేధిస్తారు..

Updated : 29 Mar 2024 04:34 IST

రూ.540 కోట్ల జయలక్ష్మి సొసైటీ కుంభకోణంలో నిగ్గుతేలని నిజాలెన్నో
సీఐడీ దర్యాప్తు చేపట్టక ముందే.. చేతులు మారిన ఆస్తులు
ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, సర్పవరం జంక్షన్‌

క్ష కట్టారో.. తప్పు జరగకపోయినా.. ఎలాంటి ఫిర్యాదులు అందకపోయినా కార్యాలయాల మీదకు వచ్చి  పడతారు.. బాధితులతో బలవంతంగా ఫిర్యాదులు రాయించి మరీ వెంటాడి వేధిస్తారు.. అదే రాజకీయ దన్ను ఉంటే, అక్రమార్కులు అయినవారైతే, కళ్లెదుటే ఆర్థిక నేరాలు జరుగుతున్నా.. బాధితులు గగ్గోలు పెడుతూ ప్రాణాలు విడుస్తున్నా ఉలకరు పలకరు. చర్యలూ ఉండవు. ఆకర్షణీయమైన వడ్డీ అంటూ.. 60 నెలల్లో సొమ్ము రెట్టింపు అని ఆశ చూపి.. పొదుపరులు, ఖాతాదారుల నుంచి రూ.వందల కోట్లు వసూలుచేసి బోర్డు తిప్పేసిన జయలక్ష్మి ఎంఏఎం కో-ఆపరేటివ్‌ సొసైటీ విషయంలోనూ అచ్చం ఇదే జరిగింది. అధికారిక దన్ను దండిగా ఉండటంతో కుంభకోణం వెలుగుచూసి రెండేళ్లు గడిచినా చర్యల్లేవు. బాధితులకు న్యాయం జరగలేదు.

స్కెచ్‌ వేసి.. రూ.కోట్లు మింగేసి

కాకినాడలోని సర్పవరం జంక్షన్‌ సమీపంలో జయలక్ష్మి సొసైటీ కేంద్ర కార్యాలయం ఉంది. కొందరి ఆశీస్సులు.. ఇంకొందరి దన్ను చూసుకుని ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, ఇతర డైరెక్టర్లు చెలరేగిపోయారు. ఎన్నో ఆశలతో కష్టార్జితాన్ని జమచేసిన ఆరు జిల్లాల్లోని వేల మంది పొదుపరులు.. ఖాతాదారులను నిండా ముంచేశారు. పాలకవర్గం, కన్సల్టెంట్‌, చార్టెడ్‌ అకౌంటెంట్‌ అంతా కుమ్మక్కవడం.. అయినవారి ప్రయోజనానికి ఖాతాలు ఖాళీచేయడం.. కాలపరిమితి పూర్తయినా డిపాజిట్ల సొమ్ము వాపసు ఇవ్వకపోవడం వంటి అక్రమాలకు సంస్థ వేదికైంది. బాధితులు 2022 ఫిబ్రవరిలోనే ఫిర్యాదు చేసినా ఏప్రిల్‌ వరకు స్పందన లేదు. అక్రమార్కులు పరారయ్యారు. రూ.250 కోట్లు విలువైన ఆస్తులు చేతులు మారాయి. ఈ వ్యవహారంలో రాజకీయం చక్రం తిప్పింది. కష్టార్జితం కోల్పోయిన బాధితులు బెంగతో మృత్యువాత పడటం, ఆందోళనలు ఉద్ధృతం కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. విచారణ, పోలీసుల దర్యాప్తు కోణాల ఆధారంగా సీఐడీ అధికారులు జయలక్ష్మీ సొసైటీ కుంభకోణంలో ఏ-1గా ఉన్న ఛైర్మన్‌ రాయవరపు సీతారామాంజనేయులు, ఏ-2గా ఉన్న వైస్‌ ఛైర్మన్‌ బదరీ విశాలాక్షిలతో పాటు.. కేసులో ఏ-4గా ఉన్న వీరి కుమారుడు జయదేవమణి, పలువురు డైరెక్టర్లు, పాత్రధారులనూ అరెస్టు చేశారు. మరికొందరు సీఐడీకి చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు.

నోటీసులిచ్చినా పట్టలేదు

జయలక్ష్మి కుంభకోణం వెలుగుచూశాక 3 వేల మంది రుణ గ్రహీతలు సొసైటీకి సొమ్ము కట్టేందుకు మొండికేయడం సమస్యగా మారింది. వీరిలో 1,450 మందికి పాలకవర్గం నోటీసులు ఇచ్చినా ఉలుకూ పలుకూ లేదు. పెద్ద మొత్తంలో రుణాలు పొందిన 94 మందిని గుర్తించి సివిల్‌, క్రిమినల్‌ చర్యలకు సొసైటీ నూతన పాలకవర్గం, సీఐడీ ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినా చర్యలు లేవు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. రూ.220.94 కోట్ల రుణాలను ఎలాంటి సెక్యూరిటీ నిబంధనలు పాటించకుండా ఇచ్చేసిన యాజమాన్యం.. రూ.128.75 కోట్ల రుణాలకు సంబంధించిన రికార్డులు విచారణ సభ్యులకు చిక్కకుండా దాచిపెట్టడం గతంలో చర్చనీయాంశమైంది. ఈ అంశాలపైనా, కేసు పురోగతిపైనా దర్యాప్తు బృందం స్పష్టత ఇవ్వడం లేదు.

కుంభకోణంలో బాధ్యుల ఆస్తులు జప్తు చేస్తున్నట్లు హెచ్చరిక బోర్డు ఏర్పాటు

అక్రమార్కుల వెనుక..

  • జయలక్ష్మి సొసైటీ డిపాజిట్ల కింద సేకరించిన సొమ్ము వడ్డీతో కలిపి రూ.540 కోట్లయితే.. రుణాలు ఇచ్చిన సొమ్ము వడ్డీతో కలిసి రూ.702 కోట్లు అయింది. బినామీ రుణాలే రూ.కోట్లలో ఉండటంతో.. చేతులు మారిన 79 ఆస్తులు సీఐడీ స్వాధీనం చేసుకుంది. వాటిని వేలం వేసి బాధితులకు కొంతైనా అందిస్తే ఊరట దక్కుతుందన్న అభిప్రాయరం వినిపిస్తున్నా... ఆ దిశగా చర్యలు లేవు. ప్రస్తుతం సొసైటీ 29 బ్రాంచిల్లో నిల్వ సొమ్ము రూ.6 కోట్లు, రికవరీ సొమ్ము రూ.3.40 కోట్లు మాత్రమే ఉండటంతో నిత్యం డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్న వారికి భరోసా ఇవ్వలేని పరిస్థితి.
  • కుంభకోణంలో అక్రమార్కులకు కాకినాడకు చెందిన అధికార పార్టీ నాయకుడితో పాటు మరికొందరి దన్ను ఉందనే ఆరోపణలున్నాయి. కేసు నమోదయ్యాక సత్వర చర్యల్లో జాప్యానికి.. అక్రమార్కుల నుంచి ఆస్తులు చేతులు మారడం వెనుక వీరే చక్రం తిప్పారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పట్లో తాము దాచుకున్న సొమ్ము చేతికి అందే పరిస్థితి కనిపించడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. న్యాయం చేయకపోతే 25 వేల బాధిత కుటుంబాల ఓట్లతో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని