logo

ఏమి చూడాలి.. చేయాలి ?

ఈఏపీసెట్‌ పూర్తై విద్యార్థులకు ర్యాంకులు కేటాయించారు. విద్యార్థులు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిమిత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పరీక్ష ఫలితాలు రావడంతో ఆప్షన్ల ఎంపికతో పాటు కౌన్సెలింగ్‌కు సమయం ఆసన్నమైంది.

Published : 17 Aug 2022 05:48 IST
కౌన్సెలింగుకు సిద్ధమవుతున్న విద్యార్థులు
పొన్నూరు, వట్టిచెరుకూరు - న్యూస్‌టుడే

ఈఏపీసెట్‌ పూర్తై విద్యార్థులకు ర్యాంకులు కేటాయించారు. విద్యార్థులు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిమిత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పరీక్ష ఫలితాలు రావడంతో ఆప్షన్ల ఎంపికతో పాటు కౌన్సెలింగ్‌కు సమయం ఆసన్నమైంది. ఏఐసీటీఈ ఆదేశాలతో వచ్చే నెల నుంచి కళాశాలలు ప్రారంభం కావాలి. ఈ నేపథ్యంలో ఏ బ్రాంచి తీసుకోవాలి.. ఏ కళాశాలను ఎంపిక చేసుకోవాలన్న ప్రశ్న అటు విద్యార్థుల్లో, ఇటు తల్లిదండ్రుల్లో నెలకొంది. ఈ సమయం వారికి చాలా కీలకమైనది. ఎలాంటి విద్యాసంస్థ, బ్రాంచి ఎంపిక చేసుకోవాలనే అంశాలను దృష్టిలో ఉంచుకోవాలన్న అంశంపై ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న కథనమిది..

ఈ విద్యాసంవత్సరంలో అటు కళాశాలలతో పాటు డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో కూడా సీట్లను  ఈఏపీసెట్‌ ర్యాంకుల ఆధారంగా ఇవ్వనున్నారు. విశ్వవిద్యాలయాల సీట్లలో 30 శాతం సీట్లు ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ఇస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో చేరే విద్యార్థుల ఫీజులను కూడా ప్రభుత్వం రూ.70 వేలుగా నిర్ణయించింది. తెల్ల రేషన్‌కార్డులున్నవారు ఫీజు రీఎంబర్సుమెంటు పథకం ద్వారా ఎలాంటి ఫీజు లేకుండా వర్సిటీల్లో చేరే అవకాశం గత ఏడాది నుంచి అందుబాటులోకి వచ్చింది.

బ్రాంచీల ఎంపిక కీలకం

టాపర్స్‌ సీఎస్‌ఈకు ప్రాధాన్యత ఇస్తుండగా తర్వాతి స్థానాల్లో ఐటీ, ఈసీఈ, ఈఈఈ ఉన్నాయి.

కంప్యూటర్‌సైన్స్‌లో ఏఐ, మెషీన్‌లెర్నింగ్‌, డేటాసైన్స్‌, రోబోటిక్స్‌, సైబర్‌సెక్యూరిటీ వంటి ఆధునిక కోర్సులు గత విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చాయి.

‘ఎవర్‌ గ్రీన్‌’గా మెకానికల్‌ విభాగం విరాజిల్లుతుండగా, సివిల్‌ ఇంజినీర్లకు ఆదరణ పెరుగుతోంది.

రెండేళ్ల ప్రాంగణ ఎంపికల సరళి
ఈ విద్యాసంవత్సరం 2022లో  అమెజాన్‌, ఇన్ఫోసిస్‌, పెగా, గూగుల్‌, డెల్లాయిట్‌, టీసీఎస్‌, విప్రో, సీటీఎస్‌ వంటి ప్రఖ్యాత బహుళజాతి సంస్థలు ప్రాంగణ ఎంపికలు ప్రారంభించాయి.  వార్షిక వేతనం రూ.44 లక్షలతో ఎంపికలు జరుపుతున్నాయి. కొన్ని సంస్థలు రూ.30 లక్షలు, మరికొన్ని రూ.12 లక్షలతో కొలువులు ఇస్తున్నాయి.  ఏటా మొత్తం  విద్యార్థుల్లో 15 నుంచి 20 శాతం వరకు ఉద్యోగాలు సాధిస్తున్నారు.  2020-21 విద్యా ఏడాదికి వచ్చే సరికి 120కు పైగా బహుళజాతి సంస్థలు అమరావతి పరిధిలోని 12 వేల మందికి పైగా అవకాశాలు కల్పించాయి.  

విద్యార్థులూ చేయండిలా..

తమకు ఏ రంగంపై ఆసక్తి ఉందో విద్యార్థులు తెలుసుకొని దాన్నే ఎంచుకోవాలి. అంతే తప్ప క్రేజ్‌ బ్రాంచీలను ఎంచుకుని, వాటిపై ఆసక్తిలేక, వాటిని పూర్తి చేయలేక విద్యా ఏడాదిని వృథా చేసుకోకూడదు.  

కళాశాలలో మౌలిక సదుపాయాలు చూడాలి. వాటికి నాక్‌, అటానమస్‌, ఎన్‌బీఏ తదితర గుర్తింపులున్నాయో లేదో ప్రతి తల్లిదండ్రులు సరిచూసుకోవాలి. అధ్యాపక బృందం గురించి తెలుసుకోవాలి. వెబ్‌సైట్‌ ద్వారా కళాశాల ఉత్తీర్ణత శాతాన్ని, ప్రాంగణ ఎంపికల తీరుపై దృష్టి పెట్టడం మంచిది.

ప్రతి సబ్జెక్టుకు మరో అంశంతో సంబంధం ఉంటుంది. అందువల్ల అన్ని సబ్జెక్టులనూ చదవాలి.


నిపుణుల అభిప్రాయాలు ఇలా..

ఫలితాలు పరిశీలించాలి: కె.ఫణింద్రకుమార్‌,
ఇంజినీరింగ్‌ విద్యలో ప్రవేశించే ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ కళాశాలలో పరీక్ష ఫలితాలు, ప్రాంగణ ఎంపికల తీరును పరిశీలించుకోవాలి. ల్యాబు, అర్హులైన అధ్యాపకులు తదితరాలు  తెలుసుకోవాలి.

ఆంగ్లంపై పట్టు అవసరం:  చండ్రపాటి వెంకటరాఘవరావు
ఆంగ్లం మాటలు, వాటి వాడుక, గ్రామర్‌పై దృష్టి పెడితే మంచిది. అంతా కలిసి కూర్చున్నప్పుడు ఆంగ్లంలో చర్చించుకోవడం, మాట్లాడుకోవడంతో పాటు చదివితే ఈ భాషపై పట్టు వస్తుంది.

సాధనే ఏకైక మార్గం:  దేవిశెట్టి శ్రీనివాసకుమార్‌
కోడింగ్‌ తదితర కోర్సులపై సాధన చేయడం కూడా అంతే ముఖ్యం.  రీజనింగ్‌పై అవగాహన పెంచుకోవాలి. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, బ్లాక్‌చైన్‌ వంటి నూతన టెక్నాలజీలపై ప్రావీణ్యం ఉపకరిస్తుంది.  

సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహనుండాలి: సీహెచ్‌ అరుణ,
ఇంజినీరింగ్‌ విద్యలో మొదటి రెండు సంవత్సరాలు ఎంతో కీలకం. నాలుగేళ్ల కోర్సు అయినందున చదవచ్చులే అనే భావనతో కొందరు అశ్రద్ధ చేస్తున్నారు. మొదటి ఏడాది నుంచే ప్రణాళికతో చదవాలి.

భావ వ్యక్తీకరణే సోపానం : రంగబాబు
మొదటి సంవత్సరం ఈసీఈలో ఫిజిక్స్‌, కెమిస్ట్రి, మ్యాథ్స్‌లో కీలక సూత్రాలపై పట్టు సాధించాలి. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సాఫ్ట్‌స్కిల్స్‌ను అవగాహన చేసుకుంటే ప్రాంగణ ఎంపికల్లో బెరుకు లేకుండా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts