logo

10 నెలలుగా జీతాల్లేవు!

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ఆ ఉద్యోగులు లేకుండా రోగులకు వైద్యసేవలు అందవనడంలో అతిశయోక్తిలేదు. రక్త పరీక్షల నుంచి ఈసీజీ తీసే వరకు అన్నింటా వీరే ముందుంటారు.

Updated : 28 Nov 2022 06:54 IST

జీజీహెచ్‌లో ఆరోగ్యశ్రీ ఉద్యోగుల అవస్థలు
ఈనాడు, అమరావతి

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ఆ ఉద్యోగులు లేకుండా రోగులకు వైద్యసేవలు అందవనడంలో అతిశయోక్తిలేదు. రక్త పరీక్షల నుంచి ఈసీజీ తీసే వరకు అన్నింటా వీరే ముందుంటారు. వైద్యసేవలు అందించడంలో ఇంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వారికి జీతాలు ఇవ్వడానికి మాత్రం అధికారులకు చేతులు రావటం లేదు. నిత్యం కొన్ని వందల మందికి ఆయా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఎక్సరే టెక్నీషియన్లు, ఈసీజీ టెక్నీషియన్లు, నర్సులు, ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓ, ఫార్మాసిస్టులు ఇలా పలు రకాల ఉద్యోగులు ఉన్నారు. ఎవరైనా రోగికి సహాయకులు లేకుండా ఒంటరిగా వస్తే వారిని వార్డుల్లో చేర్పించి సపర్యలు చేసేది కూడా వీరే. మొత్తంగా వీరు ఆస్పత్రిలో రోగులకు పలు రకాలుగా సాయపడతారు. ఎంతో కీలకమైన విధులు నిర్వహించే ఈ చిరుద్యోగులకు నెలవారీ కాకపోయినా కనీసం మూడు నెలలకు ఒకసారైనా జీతమిస్తే తమకు ఎంతో కొంత ఊరట కలుగుతుందని సంబంధిత ఉద్యోగులు వేడుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమకు ఇన్నాళ్లు జీతాలు ఆపిన పరిస్థితి లేదని, జగన్‌ సర్కార్‌ వచ్చాక తమ వెతల గురించి పట్టించుకునే నాథుల్లేరని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా 10 నెలల పాటు జీతమివ్వకుండా పనిచేయమనడం ఏ మేరకు సమంజసమో ఉన్నతాధికారులే గుర్తించాలి. వీరిలో కొందరు భార్యాభర్తలు ఆస్పత్రిలోనే పనిచేస్తున్నారు. ఇద్దరికీ జీతం ఇన్నాళ్ల పాటు పెండింగ్‌ పడితే వారు నెలవారీ అద్దె, ఇతర ఇంటి వ్యయాలు ఎలా సమకూర్చుకుంటారో ఆలోచించుకోవాలి.

15-20 ఏళ్ల నుంచి..

సుమారు 200 మందికి పైగా ఆరోగ్యశ్రీ కింద నియామకమై గత 20 ఏళ్లు నుంచి పని చేస్తున్నారు. ఎక్కువ మందికి 10-12 ఏళ్ల సర్వీస్‌ ఉంటుంది. ఇన్నాళ్ల నుంచి ఇక్కడే పనిచేయడంతో వారు ఇతర ఆస్పత్రులకు వెళ్లలేకపోతున్నారు.. అలా అని తమకు జీతం ఇవ్వకుండా నెలలు తరబడి పెండింగ్‌ పెడితే ఎలా బతకాలని ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. తామిప్పుడు బయటకు వెళితే అనుభవం పోతుందని, తిరిగి తమను బయట జూనియర్లుగానే భావిస్తారని జీతాల చెల్లింపులో జాప్యం జరిగినా కొందరు బయటకు వెళ్లలేకపోతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చాలా వరకు ఆరోగ్యశ్రీ కిందే సేవలు అందిస్తున్నారు. నెలకు సగటున వందల సంఖ్యలో శస్త్రచికిత్సలు చేస్తున్నారు. రోజుకు అన్ని రకాల పరీక్షలు కలిపి సుమారు వెయ్యి నుంచి 1200 మందికి చేస్తారు. ఆరోగ్యశ్రీ ప్రోత్సాహకాలు ప్రభుత్వం నుంచి పెద్దమొత్తంలో ఆస్పత్రికి జమవుతున్నాయి. కానీ ఆరోగ్యశ్రీ కింద నియామకమైన పారామెడికల్‌ స్టాఫ్‌కు నెలలు తరబడి జీతాలు చెల్లించకుండా మీనమేషాలు లెక్కించటం ఆస్పత్రి తీరుగా మారింది. రెగ్యులర్‌ ఉద్యోగులకు ఒక నెల జీతం నాలుగైదు రోజులు ఆలస్యమైతేనే పాలు, కేబుల్‌, అద్దె, నిత్యావసరాలకు చెల్లింపులు ఎలా చేయాలని ఆందోళన చెందుతున్నారు. కానీ వీరికి మాత్రం 10 నెలలకు పైగా జీతాలు పెండింగ్‌ పడ్డాయి. ఇప్పటికైనా వీరికి జీతాల సమస్య లేకుండా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఇలాకాలోనే ఇన్నాళ్ల పాటు ఉద్యోగులకు జీతాలు పెండింగ్‌ పెట్టడం గమనార్హం. ప్రతి నెలా జీతాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు మంత్రిని కలిసి విన్నవించడానికి సమాయత్తమవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని