logo

వర్షాల హెచ్చరికలతో ఆందోళన

అగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం వల్ల గురువారం నుంచి మూడు రోజుల పాటు దక్షిణ కోస్తాంధ్రలో చాలాచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటనతో రైతులు వణికిపోతున్నారు.

Published : 07 Dec 2022 04:21 IST

ఈనాడు, నరసరావుపేట, బాపట్ల

గ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం వల్ల గురువారం నుంచి మూడు రోజుల పాటు దక్షిణ కోస్తాంధ్రలో చాలాచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటనతో రైతులు వణికిపోతున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో వరి కోతలు మొదలయ్యాయి. గుంటూరు జిల్లాల్లో ముమ్మరంగా కోతలు సాగుతుండగా బాపట్లలో ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభిస్తున్నారు. ఈనేపథ్యంలో వర్షం వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వాయుగుండం తీవ్రతతో గాలులు వీస్తే వరి పంట నేలకొరిగా నష్టం వాటిల్లుతుంది. గాలికి నేలవాలిన వరిపై ఒక మోస్తరు వర్షం పడినా ధాన్యం నాణ్యత దెబ్బతిని మొలకెత్తే ప్రమాదం ఉందని కర్షకులు వాపోతున్నారు. గతేడాది కూడా కోతల సమయంలో వచ్చిన నివర్‌ తుపాను తీవ్రనష్టం కలగజేసింది. ఈఏడాది వరి దిగుబడులు కొంత ఆశాజనకంగా ఉండటంతో రైతులు పెట్టుబడులతోపాటు కొంత మిగులు ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షం వస్తే కోలుకోలేని దెబ్బపడుతుందని ఆందోళన చెందుతున్నారు. వర్షం వల్ల ఆరబెట్టిన ధాన్యంతోపాటు కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటకు నష్టం జరుగుతుంది. వరి పంట నేలవాలితే కోతకు యంత్రాలకు వెచ్చించే ఖర్చు పెరుగుతుంది. ఒక మోస్తరు వర్షం పడినా ధాన్యం నేలరాలి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. పల్నాడులో తీతకు సిద్ధంగా ఉన్న పత్తి రైతులు వాతావరణం మారిన నేపథ్యంలో తీతలు వేగవంతం చేశారు. పల్నాడులోనూ వరి కోతలు మొదలైన నేపథ్యంలో సిద్ధమైన ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకోవడం లేదా పొలంలోనే అమ్మేయడానికి ఆసక్తి చూపుతున్నారు. డెల్టాలో ఇంకా నాలుగు నుంచి వారం రోజుల తర్వాత కోయాల్సిన వరి పంటను కూడా బుధవారం కోత కోసి ధాన్యం ఇంటికి తెచ్చుకోవడానికి రైతులు యంత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాపై వర్షం ప్రభావం ఉండకూడదని రైతులందరూ కోరుకుంటున్నారు.


‘రైతులను మోసగిస్తున్న కేంద్రం’

మాట్లాడుతున్న ఏఐకేఎస్‌ జాతీయ సహాయ కార్యదర్శి కృష్ణప్రసాద్‌

నరసరావుపేట అర్బన్‌, వినుకొండ, న్యూస్‌టుడే: భాజపా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి మోసగిస్తుందని అఖిలభారత కిసాన్‌సభ జాతీయ సహాయ కార్యదర్శి పి.కృష్ణప్రసాద్‌ పేర్కొన్నారు. కేరళలో 13 నుంచి నిర్వహించే 35వ జాతీయ అఖిలభారత్‌ కిసాన్‌సభ సమావేశాలను జయప్రదం చేయాలని కోరుతూ ప్రారంభమైన రైతు అమరవీరుల జ్యోతియాత్ర మంగళవారం నరసరావుపేట, వినుకొండలకు చేరింది. మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. నరసరావుపేట సభలో ఆయన మాట్లాడుతూ దేశం అంబానీలది కాదని కార్మిక, రైతు, మధ్యతరగతి ప్రజలదన్నారు. విద్యుత్తు సవరణ బిల్లు పార్లమెంట్‌లో పెట్టమని చెప్పి కేబినెట్‌లో పెట్టి ఆమోదించడం దుర్మార్గమని చెప్పారు. రెండో జాతీయ విముక్తి పోరాటానికి అందరూ సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు. తెలంగాణలోని కడివెండిలో ఈనెల 5న ప్రారంభమైన యాత్ర ఈనెల 13 కేరళ చేరుతుందన్నారు. రాష్ట్ర రైతు సంఘం నాయకులు వి.కృష్ణయ్య, ప్రకాశన్‌, తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి సాగర్‌, పల్నాడు జిల్లా అధ్యక్షుడు గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట తెదేపా ఇన్‌ఛార్జి డాక్టర్‌ అరవిందబాబు, తెలుగు రైతు నేత గొట్టిపాటి జనార్దనబాబు సంఘీభావం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని