logo

ఆట విడుపే.. ఆఖరిచూపు

ఆట విడుపుగా నదీ స్నానానికెళ్లిన యువకులు 30 అడుగుల లోతు ఇసుక గోతుల్లో చిక్కుకుంటున్నారు. అప్పటి దాకా అందరితో సరదాగా గడిపినవారికి అదే ఆఖరి చూపుగా మారుతోంది.

Updated : 31 May 2023 06:22 IST

తీరని శోకానికి బాధ్యులెవరు?
ప్రమాదాలకు నిలయంగా కృష్ణా తీరం
ఈనాడు, అమరావతి

చిత్రంలో కనిపిస్తున్న దారి నిర్మాణానికి పక్కనే భారీ గొయ్యి తీశారు. అదే మట్టితో దారి వేశారు. ఇలా ఏర్పడిన పెద్దగొయ్యిలో పడి ఇంటర్‌ చదివే మల్లికార్జునరెడ్డి, మరో యువకుడు క్షణాల్లో నీట మునిగి మృత్యువాత పడ్డారు

ట విడుపుగా నదీ స్నానానికెళ్లిన యువకులు 30 అడుగుల లోతు ఇసుక గోతుల్లో చిక్కుకుంటున్నారు. అప్పటి దాకా అందరితో సరదాగా గడిపినవారికి అదే ఆఖరి చూపుగా మారుతోంది. కుటుంబానికి ఆధారంగా ఉన్నవారు.. భవిష్యత్తులో ఆశాదీపంగా నిలుస్తారని ఆశించినవారు.... క్షణాల వ్యవధిలో నీట మునిగి కుటుంబ సభ్యులకు అంతులేని విషాదాన్ని మిగిల్చి వెళ్తున్నారు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి వితంతువులుగా మిగిలిపోతున్న మహిళలు.... పిల్లలను కోల్పోయి గర్భశోకంతో తల్లడిల్లుతున్న తల్లులు... కుటుంబానికి ఆదాయం తెచ్చే వ్యక్తిని కోల్పోయి అనాథలవుతున్న సభ్యుల వేదన వర్ణనాతీతం. దీనికి కారణం నదీ తీర ప్రాంతంలో స్వార్థంతో ఇసుక తోడేస్తున్న ఇసుకాసురులా, లేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా కనీసం హెచ్చరిక బోర్డులు కూడా పెట్టలేని అధికారులదా.. ఆ కుటుంబాల్లో శోకానికి బాధ్యులెవరు?

క్షణాల్లో మృత్యువాత

నదీ తీరంలో లోతు తక్కువగా ఉంటూ క్రమంగా లోపలకు వెళ్లే కొద్దీ లోతు పెరుగుతుంది. కృష్ణానదిలో ఇష్టారాజ్యంగా 20 అడుగులకు పైగా లోతుతో తవ్వకాలు చేయడం వల్ల తీరంలోనే భారీ గోతులు ఏర్పడ్డాయి. తీరం నుంచి మీటర్ల వ్యవధిలోనే భారీ గోతులు ఉండడంతో పర్యటక, ఆధ్యాత్మిక పర్యటనలకు వచ్చినవారు తెలియక నదిలోకి దిగి క్షణాల్లోనే మృత్యువాత పడుతున్నారు. గట్టున ఉన్నవారు ఏం జరిగిందో చూసేలోపు నీట మునిగి కనిపించకుండా పోతున్నారు. తీరంలో నీరు శుభ్రత తక్కువగా ఉంటుందని రెండడగులు లోపలికి వేస్తే ముంపు బారిన పడి ముప్పు కొనితెచ్చుకుంటున్నారు. స్థానికేతరులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు ఎక్కువగా వచ్చే అమరావతిలో స్నానానికి దిగే ప్రాంతాలు 8 ఉన్నాయి. వీటి వద్ద ప్రమాదాలను తెలియజేసేలా ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేస్తే గమనించి అక్కడ స్నానానికి దిగకుండా జాగ్రత్త పడతారు. కనీసం పోలీసులు, గ్రామ పంచాయతీ జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఘటనలు పునరావృతమవుతున్నాయి.

తనయుడు మల్లికార్జునరెడ్డి మృతదేహం వద్ద విలపిస్తున్న తండ్రి రామలింగారెడ్డి (పాతచిత్రం)

కాసుల కక్కుర్తితో...  

ఇసుకాసురులు తీరం ఒడ్డునే బంకమట్టి వచ్చే వరకు ఇసుక తవ్వకాలు చేయడంతో నదిలో భారీ గోతులు ఏర్పడుతున్నాయి. నదికి ప్రవాహం లేనప్పుడు ఇక్కడ నిలిచిన నీటిలో లోతు తెలియక దిగినవారు లోపలికి జారిపోయి బంక మట్టిలో ఇరుక్కుపోతున్నారు. ఈత వచ్చినా బంకమట్టిలో కూరుకుపోయినందున బయటికి వచ్చే మార్గం లేకపోవడంతో మృత్యువాత పడుతున్నారు. అమరావతిలోని అమరేశ్వరఘాట్‌ సమీపంలో నది మధ్యలో ఇసుక తవ్వకాలు చేస్తున్న గుత్తేదారు అక్కడి వరకు వాహనాలు నదిలోకి వెళ్లడానికి నిబంధనలకు విరుద్ధంగా దారి ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నదీపాయ దాటడానికి ఎత్తుగా రహదారి నిర్మాణానికి అవసరమైన మట్టిని నదిలోనే రహదారి పక్కనే గొయ్యి తవ్వి అక్కడే వాడుకున్నారు. ఆ గోతిలోనే పడి ఇంటర్‌ చదివే మల్లికార్జునరెడ్డి, మరో యువకుడు మృత్యువాత పడడం గమనార్హం.

* పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన సిరిపురపు మల్లికార్జునరావు (27) నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పని చేసేవారు. ఇతను అమరావతి మండలం లెమల్లెకు చెందిన హరితను వివావాం చేసుకున్నారు. 2022లో వినాయక చవితి పండుగకు అత్తగారింటికి వచ్చి అక్కడి నుంచి అమరావతిలో వినాయక నిమజ్జనానికి వెళ్లి కృష్ణానదిలో ప్రమాదవశాత్తూ పడి చనిపోయారు. అల్లుడిని తీసుకెళ్లి మృతికి కారణమయ్యారని హరిత అత్తారింటివారు ఆమెను పుట్టింటికి పంపించారు. ఆడపిల్లతో కట్టుబట్టలతో వచ్చిన హరిత తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. తండ్రి టీకొట్టు నడుపుతూ కుటుంబం నెట్టుకొస్తున్నారు. మల్లికార్జునరావు పేరుతో బీమా పాలసీలు లేకపోవడంతో ఒక్క రూపాయి రాలేదు. తనతో పాటు తన కూతురు భవిష్యత్తు ఏమిటన్న బెంగ ఆమెను, ఆమె తల్లిదండ్రులను వెంటాడుతోంది.

* అమరావతి మండలం లెమల్లె గ్రామానికి చెందిన విజయభార్గవ (25) 2022లో వినాయక నిమజ్జనం సందర్భంగా కృష్ణానదిలో మునిగి మృత్యువాత పడ్డారు. ఇతనికి భార్య శ్రీలేఖ, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. భర్త చనిపోయిన తర్వాత ఐదు నెలలు ఇక్కడే ఉన్న శ్రీలేఖ అనంతరం పిల్లలను ఇక్కడే ఉంచి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇద్దరు పిల్లలను విజయభార్గవ్‌ తల్లిదండ్రులు సాకుతున్నారు. తండ్రి చనిపోవడం, తల్లి పుట్టింటికి వెళ్లడంతో ఇద్దరు పిల్లలకు నానమ్మ, తాతయ్యే అన్నీ తామై చూసుకుంటున్నారు. చిన్న వయసులోనే పిల్లలిద్దరూ తల్లిదండ్రులకు దూరం కావడంతో వారి వేదన వర్ణనాతీతం.  

* పెదకూరపాడు మండలం 75 త్యాళ్ళూరుకు చెందిన మల్లికార్జునరెడ్డి (17) 2023 మార్చి 30న అమరావతి ఇసుక రీచ్‌లో ఉన్న ఇసుక గుంతలో పడి మృత్యువాత పడ్డాడు. బాలుడి తల్లిదండ్రులు సుజాత, రామలింగారెడ్డికి ఇద్దరు పిల్లలు. తాము పదో తరగతి వరకు చదివినా పిల్లలకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో గుంటూరులోని కార్పొరేట్‌ విద్యా సంస్థలో చదివిస్తున్నారు. పిల్లలు ఇంటర్‌ పరీక్షలు రాసి వచ్చిన తెల్లారే ఈ సంఘటన చోటుచేసుకుంది. మల్లికార్జునరెడ్డి మృతితో తల్లి సుజాత మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురై కోలుకోలేని దెబ్బతింది. ఆమె ముందు బాధపడితే మరింత కుంగిపోతుందని కుటుంబ సభ్యులు భయంతో బాగున్నట్లు ఉంటూ జీవితం సాగిస్తున్నారు. ఇంకో కుమారుడు ఉన్నా తమ కలలు చెదిరిపోయాయని ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన ఎవరూ తీర్చలేనిది. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు తీసుకుని ఇంకెవరికీ ఇలాంటి బాధ రాకూడదని రామలింగారెడ్డి కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని