logo

మృత్యుకేళి ఇది.. జాగ్రత్త సుమా!

అమరావతి మండలం కృష్ణానది తీరంలోని ధరణికోట రేవు ప్రాంతమిది. ఇక్కడ 2020 మార్చి 15న సాయి (19), గోవర్ధన్‌ (20) ఈతకు దిగి నీటమునిగి చనిపోయారు. ఇక్కడే 2021 అక్టోబరు 3న మోదుగల దుర్గాప్రసాద్‌ (17), ఆనంద అరవింద్‌ కుమార్‌ (24) స్నానానికి దిగి మృత్యువాత పడ్డారు. 2022 నవంబరు 11న తొండపు మణికంఠ (9) ఆడుకుంటూ వెళ్లి నదిలో పడి మృతి చెందారు.

Published : 02 Jun 2023 05:16 IST

అమరావతి మండలం కృష్ణానది తీరంలోని ధరణికోట రేవు ప్రాంతమిది. ఇక్కడ 2020 మార్చి 15న సాయి (19), గోవర్ధన్‌ (20) ఈతకు దిగి నీటమునిగి చనిపోయారు. ఇక్కడే 2021 అక్టోబరు 3న మోదుగల దుర్గాప్రసాద్‌ (17), ఆనంద అరవింద్‌ కుమార్‌ (24) స్నానానికి దిగి మృత్యువాత పడ్డారు. 2022 నవంబరు 11న తొండపు మణికంఠ (9) ఆడుకుంటూ వెళ్లి నదిలో పడి మృతి చెందారు.

అమరావతిలోని ధ్యానబుద్ధ పర్యటక కేంద్రం సమీపంలోని కృష్ణానది తీరమిది. ధ్యానబుద్ధ ప్రాజెక్టు చూడడానికి వచ్చిన పర్యటకులు సరదాగా నదిలో స్నానానికి దిగుతున్నారు. వినాయక చవితి పండగ సందర్భంగా నదిలో వినాయక నిమజ్జనానికి ఇక్కడ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. జాగ్రత్తలు తీసుకుంటున్నా తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ 2022 సెప్టెంబరు 9న రొంపిచర్లకు చెందిన సిరిపురపు మల్లిఖార్జునరావు (29), లేమల్లెకు చెందిన బలుసుపాటి విజయ్‌ భార్గవ్‌ (27) వినాయక చవితి నిమజ్జనానికి వచ్చి నదిలో పడి చనిపోయారు.

ఇది ప్రకాశంబ్యారేజీ ఎగువన కొండవీటి ఎత్తిపోతల పథకం సమీపంలో నదీ తీరం. ఉండవల్లి, విజయవాడ నుంచి వచ్చే యువత ఇక్కడ నదిలో స్నానాలకు దిగి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక్కడే పడవల రేవు సమీపంలో ఏప్రిల్‌ 15న విజయవాడ కృష్ణలంకకు చెందిన ఐటీ ఇంజినీరు జయకృష్ణ(23) స్నేహితులతో కలిసి నదిలో స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తూ నీటమునిగి చనిపోయారు.

ప్రథమ పంచారామం అమరావతి ఆలయం ముందు ఘాట్‌ ఇది. ఆలయానికి వచ్చే పర్యటకులతో పాటు అమరావతిలో శివాలయం చెంతన కర్మకాండలు చేయడానికి ఇక్కడికి వస్తుంటారు. దీంతో ఈ ఘాట్‌ ఎప్పుడూ జన సందడితో ఉంటుంది. స్థానికేతరులు ఎక్కువగా వస్తుండడంతో వారికి ఇక్కడి నదిలో లోతుపై అవగాహన లేక దిగి మృత్యువాత పడుతున్నారు. అమరేశ్వరఘాట్‌లో 2021 మార్చి 10న అమరావతికి చెందిన పఠాన్‌ బాజీ (8), షేక్‌ మీరా హుస్సేన్‌ (12) ఆడుకుంటూ నీటిలో దిగి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 2021 మార్చి 5న గుంటూరు నుంచి భర్తకు కర్మకాండలు చేయడానికి వచ్చిన ఒగ్గు వెంకట సామ్రాజ్యలక్ష్మీ (69) ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందారు. 2021 ఏప్రిల్‌ 4న తెలంగాణ నుంచి అమరావతిలో బంధువుల ఇంటికి వచ్చిన బొడ్డు గంగమ్మ (25) నీటిలో దిగి మృత్యువాత పడింది. 2020 జనవరి 8నగుంటూరుకు చెందిన ఎలికా వెంకటసుబ్బయ్య ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి చనిపోయారు. అమరావతికి చెందిన రేఖా ఏడుకొండలు 2020 ఏప్రిల్‌ 23న నదిలో చేపల వేటకు వెళ్లి అమరేశ్వరఘాట్‌లో శవమై తేలారు. 2023 మార్చి 30న 75 త్యాళ్ళూరు గ్రామానికి చెందిన కొల్లి భార్గవరామ నాగ మల్లికార్జునరెడ్డి(17), కీసర రాజశేఖరరెడ్డి (16) సరదాగా నదిలో దిగి మునిగిపోయారు. గుంటూరుకు చెందిన మహబూబ్‌ఖాన్‌ రంజాన్‌ ఉపవాసాల తర్వాత 2023 ఏప్రిల్‌ 23న పఠాన్‌ మహబూబ్‌ఖాన్‌ (58) కుటుంబ సభ్యులతో కలిసి స్నానానికి వచ్చి నదిలో దిగి మునిగి మృత్యువాత పడ్డారు. * దిడుగు రేవులో 2020 జులై 9న మాగులూరి బాలశౌరి (54), 2023 మార్చి 17న షేక్‌ పెద్దబాజీ(25) నీటిలో దిగి ప్రమాదవశాత్తూ మృతి చెందారు.

ఇది తాడేపల్లి మండలం సీతానగరం పుష్కర్‌ఘాట్‌ సమీపంలో ఉన్న రైల్వేవంతెన మార్గం ప్రాంతం. సీతానగరంలోని ఆలయాలకు వచ్చే భక్తులతో పాటు స్థానికులు ఎక్కువగా ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ మే 27న రైల్వేవంతెన కింద నది గోతుల్లో పడి డోలాస్‌నగర్‌కు చెందిన కృష్ణయ్య(16), శివశంకర్‌(17)లు నదిలో ఆరుగురితో కలిసి స్నానానికి వచ్చి నీటమునిగి చనిపోయారు. గతంలో ఇదే ప్రాంతంలో ఈతకు దిగి ప్రమాదవశాత్తూ గోతుల్లో మునిగిపోయి ఆరుగురు మృత్యువాత పడ్డారు.

రక్షణ చర్యలు చేపట్టాల్సిన ప్రాంతాలివే...

కృష్ణానదీ తీరంలో ఇసుక గోతులు మృత్యుకుహరాలుగా మారుతున్న సంగతి తెల్సిందే. పుణ్య స్నానాలు చేయడానికి నదిలోకి దిగినవారిని గోతులు కబళిస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో పదుల సంఖ్యలో యువకులు, చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఏళ్లు గడుస్తున్నా తమ వారిని పోగొట్టుకున్న కుటుంబాల్లో విషాదం మిగిలే ఉంది. తమ పిల్లలు గుర్తుకొచ్చిన ప్రతిసారి గుండె కోతను అనుభవిస్తూనే ఉన్నారు. భవిష్యత్తు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏమి చేయాలి. ఆయా శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ఎక్కడెక్కడ రక్షణ చర్యలు చేపట్టాలో పరిశీలించేందుకు న్యూస్‌టుడే బృందం కొన్ని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించింది. ఆయా చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా మరెవరూ మృత్యు కుహరాల్లో కాలుపెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని