logo

చేతులూపడమేనా.. చేతల్లేవా జగన్‌!

ఏ ప్రభుత్వానికైనా విశ్వస నీయత ఎంతో ముఖ్యం.. పదవిలో ఉన్నవారు అది నిలబెట్టుకోవడం ఎంతో అవసరం.. అని వైకాపా అధినేతగా, ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ తరచూ మాటలు వల్లెవేసేవారు. కానీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొన్న జగన్‌ ఆచరణలో ఆ మాటే మరిచారు.

Updated : 09 Apr 2024 07:45 IST

సీఎం హోదాలో ఇచ్చిన హామీలూ నెరవేర్చలేదు
మరోసారి మాయమాటలతో మోసగించేందుకు బస్సు యాత్ర

ఏ ప్రభుత్వానికైనా విశ్వస నీయత ఎంతో ముఖ్యం.. పదవిలో ఉన్నవారు అది నిలబెట్టుకోవడం ఎంతో అవసరం.. అని వైకాపా అధినేతగా, ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ తరచూ మాటలు వల్లెవేసేవారు. కానీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొన్న జగన్‌ ఆచరణలో ఆ మాటే మరిచారు. సీఎం హోదాలో పల్నాడు ప్రాంతానికి ఆరుసార్లు వచ్చారు. వచ్చినా ప్రతిసారీ ఎన్నో హామీలు గుప్పించారు. కొన్నిచోట్ల అభివృద్ధి  పనులకు శంకుస్థాపనలు సైతం చేశారు. కానీ సీఎంగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. జిల్లాకు వచ్చి తాను ఉన్నానంటూ చేతులు ఊపి వెళ్లిపోవడం తప్ప, తమకు చేసిందేంటని పల్నాడు వాసులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు బస్సు యాత్ర పేరుతో తమను మళ్లీ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆక్రోశిస్తున్నారు.

ఈనాడు డిజిటల్‌-నరసరావుపేట, న్యూస్‌టుడే-నరసరావుపేట అర్బన్‌, రొంపిచర్ల, నరసరావుపేట టౌన్‌, పెదకూరపాడు, అచ్చంపేట, మాచర్ల గ్రామీణ


కృష్ణా నదిపై ప్రయాణం గాల్లో దీపమే..

గతేడాది జూన్‌ 12న పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోని క్రోసూరులో విద్యాకానుక కిట్లు అందజేసే కార్యక్రమంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాదిపాడు ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తొమ్మిది నెలలు గడుస్తున్నా వంతెన నిర్మాణం టెండర్ల దశ దాటలేదు. దీంతో నది దాటేందుకు ఇప్పటికీ పడవల్లో ప్రమాదం అంచున ప్రయాణిస్తున్నారు.
నదిని దాటేందుకు పడవలో వెళ్తున్న పల్నాడు వాసులు


ఇంకెన్ని ప్రాణాలు పోవాలో..

వంద పడకల ఆసుపత్రులు ఒట్టిమాటే..

సకాలం చికిత్స అందక మాచర్లలో మృతి చెందిన తల్లీపిల్లలు వీరే..

సీఎం హోదాలో జగన్‌ వినుకొండ, మాచర్ల వచ్చినప్పుడు ఈ రెండుచోట్ల ఆసుపత్రి స్థాయిని వంద పడకల స్థాయికి పెంచుతానని హామీనిచ్చారు. కానీ ఆచరణలో మాత్రం మాటమరిచారు. అత్యంత వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో వైద్య సేవల నిమిత్తం గుంటూరుకు పోవాల్సిన పరిస్థితి. అదే ఆసుపత్రి అందుబాటులో ఉంటే ఎందరో ప్రాణాలు నిలిచేవి. మాచర్ల మండలం ఏకోనాంపేట శివారులోని నారాయణరెడ్డిపురంలో ఫిబ్రవరి 4న క్షణికావేశంలో ఓ తల్లి టీలో ఎలుకల మందు కలిపి తాను తాగడంతోపాటు పిల్లలకు, భర్తకు ఇచ్చింది. వెంటనే వారిని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ సరైన సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో నరసరావుపేటకు తరలించారు. తల్లితోపాటు ముగ్గురు పిల్లలు చనిపోయారు. అదే మాచర్లలో మెరుగైన చికిత్స అంది ఉంటే ఆ కుటుంబం బతికి ఉండేది.


చీకట్లు తొలగే మార్గమేదన్నా..

పల్నాడు జిల్లాలో లోఓల్టేజీ సమస్యతో పంట పొలాల్లో మోటార్లు కాలిపోతున్నాయని, సామర్థ్యం మేరకు విద్యుత్తు సరఫరా కాకపోవడంతో గృహోపకరణాలు దెబ్బతింటున్నాయి. క్రోసూరు, అచ్చంపేట మండలాల్లో 132 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణం కాలేదు. ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చినా ఆ దిశగా ఊసే లేదు. అచ్చంపేట మండలం రోకటిగుంటవారిపాలెం వద్ద 132/11 కె.వి. విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణానికి స్థల సేకరణే చేపట్టలేదు.


నరసరావుపేటలో ఆటోనగర్‌ కలే

రెండేళ్ల కిందట నరసరావుపేటలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో జగన్‌ ముఖ్యమంత్రి హోదాలో ఆటోనగర్‌ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. రెండేళ్లు గడిచినా కేవలం శిలాఫలకం ఆవిష్కరణకే పరిమితమైంది. ఎన్నికల వేళ మార్చి రెండో వారంలో కేసానుపల్లిలో మోటారు కార్మికులతో చర్చించకుండా ఏకపక్షంగా కొబ్బరికాయ కొట్టేశారు. ఇప్పుడు పట్టణంలో 600 మంది మెకానిక్‌లు అధికారికంగా నమోదు కాగా, వారంతా పట్టణంలోనే పనులు చేస్తున్నారు. దీంతో పట్టణ వాసులకు ట్రాఫిక్‌ ఇబ్బందులతో పాటు కాలుష్యం సమస్య ఎదురవుతుంది. మరోవైపు మెకానిక్‌లకు ఉపాధి కల్పిస్తానని సీఎం జగన్‌ చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి.


పల్నాట విద్యాభివృద్ధి శూన్యం..

వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో విద్యకు పెద్దపీట వేస్తామని, రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని రెండేళ్ల క్రితం నరసరావుపేటకి వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. విద్యా సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ సీఎం హామీ అమలుకు నోచుకోలేదు. వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాలకు సంతగుడిపాడులోని ఎన్నెస్పీ కాలనీలో స్థలం పరిశీలించారు. ప్రచార ఆర్భాటం తప్ప ఒక అడుగు ముందుకు పడలేదు.
2 వినుకొండలో ముస్లిం మైనార్టీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాల మంజూరు చేస్తున్నానని, రూ.10 కోట్లు ఇస్తున్నానని మాటిచ్చారు. కానీ ఆచరణలో మాటతప్పారు.


మాటల్లోనే పైవంతెన నిర్మాణం

మల్లమ్మ సెంటర్‌ వద్ద ట్రాఫిక్‌

మీ ఎమ్మెల్యే నరసరావుపేటలో ట్రాఫిక్‌ సమస్య ఉందని, ఒక పైవంతెన కావాలని అడిగారు. అది మంజూరు చేస్తున్నానని సీఎం హోదాలో జగన్‌ రెండేళ్ల క్రితం ప్రకటించారు. పైవంతెన మంజూరు ఉత్తర్వులు, నిధుల కేటాయింపు, సమగ్ర పథక నివేదిక(డీపీఆర్‌)పై అధికారుల్లో స్పష్టత కరవైంది. పైవంతెన నిర్మించే ప్రాంతంలో వైకాపా నాయకుల దుకాణాలే అధికంగా ఉండటంతో ఆదిలోనే అటకెక్కింది. జిల్లా కేంద్రంగా మారిన పేటలో ట్రాఫిక్‌ కష్టాలతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని