logo

మద్యం మత్తు.. కుటుంబాలు చిత్తు

గత నెల 18వ తేదీన తెనాలి మున్సిపల్‌ కార్యాలయం చెంతనే నిర్మాణంలో ఉన్న మార్కెట్ భవంతిలో రవికిరణ్‌ (37) అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారణం మద్యం మత్తు. మద్యం తాగి చెంతనే దోమల కాయిల్‌ వెలిగించుకుని నిద్రపోయిన అభాగ్యుడు కాయిల్‌ దుప్పటికి తగిలి మంటలు చెలరేగినా మత్తు వల్ల లేవలేక కాలిపోయాడు

Published : 20 Apr 2024 04:53 IST

గత నెల 18వ తేదీన తెనాలి మున్సిపల్‌ కార్యాలయం చెంతనే నిర్మాణంలో ఉన్న మార్కెట్ భవంతిలో రవికిరణ్‌ (37) అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారణం మద్యం మత్తు. మద్యం తాగి చెంతనే దోమల కాయిల్‌ వెలిగించుకుని నిద్రపోయిన అభాగ్యుడు కాయిల్‌ దుప్పటికి తగిలి మంటలు చెలరేగినా మత్తు వల్ల లేవలేక కాలిపోయాడు. ఇప్పుడు అమ్ముతున్న మందులో మత్తు అధికంగా ఉంటుందని, నాణ్యత తక్కువగా ఉంటుందని, అందువల్లే అతను లేవలేకపోయాడని ఘటనను చూసిన స్థానికులు చర్చించుకున్నారు.

రెండు నెలల కిందట తెనాలి కూరగాయల మార్కెట్ భవంతి పైఅంతస్తులో వేమూరు నియోజకవర్గానికి చెందిన 45 సంవత్సరాల వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. మద్యం మత్తులో అతను మృతి చెందాడని బంధువులు, పోలీసులు నిర్ధారించారు.

 మండలంలోని ఒక గ్రామానికి చెందిన 40 సంవత్సరాల దినసరి కూలీ మద్యం మత్తులో పట్టణంలోని వంతెనపై కూర్చుని కాలువలోకి జారిపోయి మృతి చెందాడు. అతని మీద ఆధారపడిన భార్య, ఇద్దరు పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

 ఇవి కేవలం తెనాలి నియోజకవర్గంలో జరిగిన కొన్ని ఉదాహరణలు మాత్రమే. వైకాపా హయాంలో మద్యం మహమ్మారి అనేక కుటుంబాలను అతలాకుతలం చేసింది. తన భర్త నాసిరకం మద్యం తాగడం వల్ల లివర్‌ పాడై ప్రాణాలు విడిచాడని, తాను, ఇద్దరు పిల్లలం అనాథలుగా మారామని పట్టణంలోని ఒక కాలనీకి చెందిన మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తరహా పరిస్థితులు పదుల సంఖ్యలో నియోజకవర్గంలో గత కొంత కాలంగా చోటు చేసుకున్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి మద్యం తాగిన వారిలో గతంలో చూడని వింత ధోరణిని స్థానికులు గమనిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఒక ఆటో డ్రైయివర్‌ కేసు విషయంగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి తన ఆటోను తానే కాలితో తంతున్న వీడియో వైరల్‌గా మారింది. గతంలో తమకు అందుబాటులో ఉన్న బ్రాండ్లు కాకుండా ఊరుపేరు లేని మందు వల్లే ఇలా జరుగుతుందన్న భావన ఆయా కుటుంబాల్లో నెలకొంది.

- తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని