logo

సూపర్‌ 6 పథకాలతో.. పల్నాడును ప్రగతిబాట పట్టిస్తా..

పల్నాడు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీరు అందించి రైతులకు భరోసా ఇస్తాం. పెన్నా-గోదావరి అనుసంధానం పూర్తి చేసి తొమ్మిది లక్షల సాగర్‌ ఆయకట్టు స్థిరీకరిస్తాం.

Updated : 09 May 2024 06:51 IST

వరికపూడిశెల పథకం పూర్తితో సాగునీరు

పెన్నా-గోదావరి అనుసంధానంతో తొమ్మిది లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ

 విద్య, వైద్యానికి ప్రాధాన్యమిచ్చి ప్రజల జీవన ప్రమాణాల పెంపు

 ‘ఈనాడు’ ముఖాముఖిలో నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు

ఈనాడు-నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీరు అందించి రైతులకు భరోసా ఇస్తాం. పెన్నా-గోదావరి అనుసంధానం పూర్తి చేసి తొమ్మిది లక్షల సాగర్‌ ఆయకట్టు స్థిరీకరిస్తాం. పల్నాడు ప్రజలు ఎక్కువగా విద్య, వైద్యానికి సొమ్ము వెచ్చిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నాణ్యమైన విద్య, వైద్యం అందించి జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రణాళికతో ముందుకెళ్తాం. మహిళలు, వివిధ వర్గాల సంక్షేమానికి సూపర్‌-6 పథకాలతో సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతామని నరసరావుపేట పార్లమెంటు కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ‘ఈనాడు’కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో వివరించారు.


ప్రజల ఆదాయం పెంచేలా ప్రణాళికలు

వైకాపా పాలనలో విద్యుత్తు ఛార్జీలు, నిత్యావసర ధరలు, బస్సు ఛార్జీలను పెంచి ప్రజలను జగన్‌ బాదేశారు. సంక్షేమం పేరుతో  ఒక చేత్తో రూ.10 ఇచ్చి మరో చేత్తో రూ.100 లాగేసుకున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమం అందిస్తూనే ధరలను అదుపులో ఉంచుతాం. విద్యుత్తు ఛార్జీలను పెంచబోమని  మేనిఫెస్టోలో పెట్టాం. ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చి తోడ్పాటు అందిస్తాం. జిల్లాలో 5 లక్షల గృహాల వారికి లబ్ధి చేకూరనుంది. పెట్రోలు, డీజిల్‌ ధరలు నియంత్రించడం వల్ల రవాణా ఛార్జీల తగ్గి వస్తువుల ధరలు తగ్గేలా చూస్తాం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రత్యేక ప్రణాళికలు అమలుచేస్తాం.


అతివల అభ్యున్నతికి..

ప్రతి కుటుంబంలో 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి మహిళకూ నెలకు రూ.1500 ఇస్తాం. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చు. పల్నాడు జిల్లాలో 10.18లక్షల మంది మహిళలు ఉన్నారు. స్వయం సహాయ సంఘాలకు ప్రస్తుతం రూ.2 లక్షల వరకు ఇస్తున్న వడ్డీ లేని రుణాన్ని రూ.10 లక్షలకు పెంచబోతున్నాం. పీ4 విధానం ద్వారా మహిళలు స్వయంసంవృద్ధితో ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తాం.  


ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధికి..

వైకాపా పాలనలో ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికలకు నిధులు కేటాయించలేదు. ఎస్సీ, ఎస్టీతోపాటు బీసీ ఉపప్రణాళిక తీసుకువస్తాం. బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 50 ఏళ్లకే నెలకు రూ.4వేల పింఛను ఇస్తాం. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తాం. బీసీలకు స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో 34శాతం రిజర్వేషన్లు ఇస్తాం. రూ.5వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరించి పరికరాలు అందిస్తాం. దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల గౌరవ వేతనం. వడ్డెర్లకు క్వారీల్లో 15 శాతం రిజర్వేషన్‌ కల్పించి రాయల్టీ, సీనరేజి ఛార్జీల్లో మినహాయింపు ఇస్తాం. రజకుల దోబీఘాట్ల నిర్మాణాలకు ప్రోత్సాహం ఇస్తాం. జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం.


సామాజిక భద్రతకు పెద్దపీట

సామాజిక భద్రత పింఛను నెలకు రూ.4వేలకు పెంచుతాం. దివ్యాంగులకు పింఛను నెలకు రూ.6వేలకు పెంచుతామన్న హామీని అమలు చేస్తాం. కిడ్నీ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వాధిగ్రస్థులకు నెలకు రూ.10వేల పింఛను అందిస్తాం. పేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తాం. ఇప్పటికే పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం నుంచి పక్కా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం. సమాజంలో అందరూ గౌరవప్రదంగా జీవించేలా చర్యలు చేపడతాం.


కూటమితోనే మైనార్టీలకు భద్రత

భాజపా కూటమిలో ఉన్నంత మాత్రాన ముస్లిం మైనార్టీల్లో కూటమిని నమ్మడం లేదనేది అవాస్తవం. 2014 నుంచి 2019 కాలంలో తెదేపా హయాంలో ముస్లింలపై దాడులు జరగలేదు. వైకాపా వచ్చాకనే రాష్ట్రంలో చాలాచోట్ల ముస్లింలపై దాడులు జరిగాయి. ఆ విషయం వారికీ అర్థమైంది. తెదేపా ఉన్నప్పుడే రంజాన్‌ తోఫా, దుల్హన్‌ వంటి పథకాలు అమలయ్యాయి. ఇమామ్‌, మౌజామ్‌లకు తెదేపా హయాంలో జీతాలొచ్చాయి. వైకాపా ఇవన్నీ ఆపేసింది. మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలిస్తాం. ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తాం. ముఖ్యపట్టణాల్లో ఈద్గాలకు, ఖబరిస్థాన్‌లకు స్థలాలు కేటాయిస్తాం. చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు ఆర్థిక సహాయం అందించి క్రిస్టియన్ల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాం.


సాగు, తాగునీటి పథకాల పూర్తికి ప్రాధాన్యం

అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే వరికపూడిశెల పూర్తిచేసి సాగునీరు అందించే బాధ్యత తీసుకుంటాం. కుడికాల్వ మరమ్మతులు, నదుల అనుసంధానంలో భాగంగా పెన్నా గోదావరి పూర్తి చేసి సాగర్‌ ఆయకట్టు తొమ్మిది లక్షల ఎకరాలు స్థిరీకరిస్తాం. బిందు, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యం ఇచ్చి పరికరాలు రాయితీపై రైతులకు అందేలా చూస్తాం. ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తా.


ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు

రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లిస్తాం. బకాయిలు  ఇచ్చేస్తాం. ఉద్యోగులు, ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచి అనుకూల వాతావరణంలో పనిచేసేలా చర్యలు చేపడతాం. ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ అమలు చేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటిస్తాం. సీపీఎస్‌/జీపీఎస్‌ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. తక్కువ జీతాలు పొందే అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తాం. వాలంటీర్ల గౌరవ వేతనం నెలకు రూ.10వేల చొప్పున ఇస్తాం. అంగన్‌వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ చెల్లిస్తాం.  


విద్య, వైద్యానికి ప్రత్యేక ప్రణాళిక

పల్నాడు జిల్లాలో విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపడాలి. విద్యకు సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు సీఎస్‌ఆర్‌ కింద కార్పొరేటు సంస్థల భాగస్వామ్యంతో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేయడానికి చర్యలు తీసుకుంటా. ఇప్పటికే విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఆధ్వర్యంలో పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అభ్యసన సామర్థ్యాలు పెంచేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. ఈ విధానాన్ని విస్తృతం చేస్తాం. జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో 30 పడకల ఆస్పత్రులను 100 పడకలుగా అప్‌గ్రేడ్‌ చేసి, సౌకర్యాలు మెరుగుపరుస్తాం. అందరికీ వైద్యసదుపాయాలు అందిస్తాం. ఎన్నికల ప్రణాళికలో ప్రతి కుటుంబానికి రూ.25లక్షల వరకు ఆరోగ్యబీమా అందిస్తామని హామీ ఇచ్చాం.  


అన్నివర్గాల సంక్షేమానికి కృషి

కాపు సంక్షేమానికి రూ.15వేల కోట్లు కేటాయించి అయిదేళ్లలో ఖర్చు చేస్తాం. కాపు భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం. ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తాం. చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలిస్తాం. కమ్మ, రెడ్డి వెలమ ఇతర అగ్రకుల కార్పొరేషన్లకు తగు విధంగా నిధులు కేటాయించి వారి సాధికారత, అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు కనీస వేతనం ఉండేలా అమలు చేస్తాం.  


లాజిస్టిక్‌ హబ్‌తో యువతకు ఉపాధి

యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. జిల్లాలో లాజిస్టిక్‌ హబ్‌ ఏర్పాటుకు అన్ని వసతులున్నాయి. మనం తక్కువ ఖర్చులో వారికి వసతులు సమకూర్చగలిగితే జిల్లాలో లాజిస్టిక్‌ ఏర్పాటుతో పాటు ఎన్నో పరిశ్రమలు వస్తాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థల ఏర్పాటుకు ప్రాజెక్టు వ్యయంలో రూ.10లక్షల వరకు రాయితీ ఇస్తాం. యువకులకు ఇది ఉపయోగపడుతుంది.  ఏటా 4 లక్షల చొప్పున అయిదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి యువకుడికి నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని