logo

ఈ అరాచకాల్ని.. ఆపేదెవరు..?

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు మూడు రోజుల సమయమే ఉంది. శనివారం సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. సోమవారం పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో పల్నాడులో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం కత్తిమీదసాములా మారింది.

Updated : 10 May 2024 06:20 IST

పల్నాడులో మొదలైన ఘర్షణలు
పరస్పర దాడులతో భయాందోళన
ప్రశాంత ఎన్నికలకు పోలీసుల చర్యలేవీ
ఈనాడు, నరసరావుపేట

2019 ఎన్నికల్లో వైకాపా కార్యకర్తల దాడిలో గాయపడిన కోడెల (పాత చిత్రం)

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు మూడు రోజుల సమయమే ఉంది. శనివారం సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. సోమవారం పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో పల్నాడులో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం కత్తిమీదసాములా మారింది. ప్రచార సమయంలో ఇక్కడ తెదేపా, వైకాపా మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. బాంబులు, వేటకొడవళ్లు, మారణాయుధాలు వెలుగుచూస్తున్నాయి. అధికార పార్టీ వారు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో దాడులకు పాల్పడుతున్నారు. గురజాల, మాచర్ల, నరసరావుపేట నియోజకవర్గాల్లో అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో అదనపు బలగాలను మోహరించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాల్సి ఉంది. 2019 ఎన్నికల్లో ఈవీఎంలు ధ్వంసం చేయడం, ఏజెంట్లపై దాడులు చేసి కొట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. సత్తెనపల్లిలో అప్పటి స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు, నరసరావుపేటలో అప్పటి ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు, మాచర్లలో తెదేపా అభ్యర్థి బంధువుల వాహనంపై దాడులు చేసి ధ్వంసం చేశారు.  2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. శాంతియుత ఎన్నికలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకునేలా చూడాలని పల్నాడు ప్రజలు కోరుతున్నారు.

వరుస సంఘటనలతో ఆందోళన

పల్నాడు జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌రోజు నరసరావుపేటలో వైకాపా నేతలు తెదేపా నేతలపై దాడులు చేసి వాహనాలు ధ్వంసం చేశారు. వెల్దుర్తి మండలంలో తెదేపా, వైకాపా వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ముప్పాళ్ల మండలంలో తెదేపా నేతలపై వైకాపా నేతలు దాడులకు తెగబడ్డారు. పోలింగ్‌కు ముందే హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గురువారం ఒక్కరోజే మూడు గ్రామాల్లో ఘర్షణలు చెలరేగి తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు. అచ్చంపేట మండలం కొండూరులో తెదేపా, వైకాపా వర్గాల మధ్య గొడవ జరిగింది. గురజాల మండలం చర్లగుడిపాడులో తెదేపా నేత లక్ష్మీనారాయణపై వైకాపా మూకలు దాడిచేశాయి. నకరికల్లు మండలం కుంకలగుంటలో వైకాపా-తెదేపా నేతల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది.


చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలో 221 పోలింగ్‌ కేంద్రంలో వైకాపా వర్గీయులు తెదేపా కార్యకర్తలపై దాడి చేసి గాయపరిచారు. ఒక ఓటు విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం ఘర్షణకు దారితీయడంతో వైకాపా వర్గీయులు కర్రలు, సోడా సీసాలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు తెదేపా కార్యకర్తలు గాయపడటంతో  పోలింగ్‌ నిలిపేశారు.


2019లో పోలింగ్‌ రోజు ఘటనలెన్నో..

  • నరసరావుపేట నియోజకవర్గం గోగులపాడు, వినుకొండ మండలం పానకాలపాలెంలో ఈవీఎంలను వైసీపీ నాయకులు ధ్వంసం చేశారు. ‌్ర సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్లలో అప్పటి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై వైకాపా కార్యకర్తలు పోలింగ్‌ కేంద్రం వద్దే దాడిచేసి గాయపరిచారు.
  • బొల్లాపల్లి మండలంలో వెంకటరెడ్డిపురం తండాలో వైకాపా, తెదేపా కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.
  • నరసరావుపేట మండలం రంగారెడ్డిపాలెంలో వైకాపా ఏజెంట్లు తెదేపా ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రం బయటకు నెట్టేశారు.
  • కారంపూడి మండలం పేటసన్నెగండ్లలో తెదేపా వర్గీయులపై వైకాపా వాళ్లు రాళ్లదాడి చేసి ఇద్దరు తెదేపా కార్యకర్తలను గాయపరిచారు.
  • దుర్గిలో తెదేపా, వైకాపా నాయకుల మధ్య రాళ్ల దాడి జరగటంతో ఓటు వేసేందుకు వచ్చిన ఓ మహిళ గాయపడింది.
  • మాచర్లలో అప్పటి తెదేపా అభ్యర్థి అంజిరెడ్డి మామ వెంకట్రామిరెడ్డిపై వైకాపా నాయకుల దాడిచేసి ఆయన వాహనం అద్దాలు పగులకొట్టారు.
  • నరసరావుపేట మండలం ఉప్పలపాడులో యథేచ్ఛగా రిగ్గింగ్‌ జరిగిందనీ అప్పటి తెదేపా ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు ఆర్వో హిమాన్షు శుక్లాను కోరారు. స్థానిక వైకాపా అభ్యర్థి గోపిరెడ్డి ఉప్పలపాడులో ఉద్రిక్తతలను పెంచి తెదేపా, స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లను బయటకు లాగేయడంతో తిరిగి ఏజెంట్లను కేంద్రాల్లో కూర్చోబెట్టేందుకు వెళ్లిన తెదేపా అభ్యర్థి అరవిందబాబు, మీడియాపై దాడి చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని