Ts News: వారం రోజుల్లో ఫీవర్‌ సర్వే పూర్తి: సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

తెలంగాణలో ఫీవర్‌ సర్వే వారం రోజుల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వం చేస్తున్న ఫీవర్‌ సర్వేకు సహకరించాలని

Published : 22 Jan 2022 01:44 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఫీవర్‌ సర్వే వారం రోజుల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వం చేస్తున్న ఫీవర్‌ సర్వేకు సహకరించాలని కోరారు. నగరంలోని ఖైరతాబాద్‌లో జరుగుతున్న ఫీవర్‌ సర్వేను సీఎస్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ ఇతర అధికారులు పరిశీలించారు. ఫీవర్‌ సర్వే సమయంలో జ్వరం, లేదా ఇతర లక్షణాలు ఉంటే అక్కడికక్కడే మెడిసిన్‌ కిట్లు అందజేస్తున్నట్టు చెప్పారు. ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతోందని.. కానీ పెద్దగా లక్షణాలు కనిపించడం లేదన్నారు. త్వరలో కేసులు తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

టెస్టుల సంఖ్య తక్కువగా ఉందన్న విమర్శలను సీఎస్‌ తోసిపుచ్చారు. లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రతి రోజు లక్షకు పైగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు చెప్పారు. కోటి హోం ఐసోలేషన్ కిట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం వైద్య సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారన్నారు. ఫీవర్‌ సర్వేలో వైద్య సిబ్బంది ఐసోలేషన్‌ కిట్‌, గర్భిణులకు వైద్య సాయం, వ్యాక్సిన్‌ తీసుకోని వారికి వ్యాక్సిన్‌ ఇస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో  కలిపి మొత్తం 56వేల బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. బూస్టర్‌ డోస్‌ ఇప్పటివరకు 70శాతం పూర్తయిందని సీఎస్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని