logo

Hyderabad : రద్దీ ఉన్నా రద్దా?

ప్రయాణికులు లేకే ఆదివారం ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులు సగానికి సగం తగ్గిస్తున్నామని దక్షిణమధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో ఎక్కడ చూసినా రద్దీ

Updated : 01 Aug 2022 08:34 IST

ఎంఎంటీఎస్‌ సర్వీసుల కోతతో ప్రయాణికులకు ఇబ్బంది

ఆదివారం సాయంత్రం ఎంఎంటీఎస్‌లో రద్దీ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రయాణికులు లేకే ఆదివారం ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులు సగానికి సగం తగ్గిస్తున్నామని దక్షిణమధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో ఎక్కడ చూసినా రద్దీ విపరీతంగా ఉంది. ఆదివారం రైళ్లే కాదు.. సిబ్బందిని కూడా కుదించడంతో టిక్కెట్ల కోసం బారులుతీరాల్సి వస్తోంది. ఇంతలో గంటకో.. రెండు గంటలకో వచ్చే ఎంఎంటీఎస్‌ తుర్రుమంటూ వెళ్లిపోతోంది. ప్రయాణికులు టిక్కెట్లు తీసుకోకుండానే ఎంఎంటీఎస్‌ వెళ్లిపోతుండడంతో మళ్లీ వచ్చే రైలు కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఇలా ప్రతి రైల్వే స్టేషన్లో ఎంఎంటీఎస్‌ ప్రయాణికులు ఆదివారం అవస్థలు పడుతున్నారు.

స్టేషన్‌కొకరే విధుల్లో..
ఎంఎంటీఎస్‌ రైల్వే స్టేషన్లలో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లకు టిక్కెట్లు రిజర్వు చేసుకుంటారు. సికింద్రాబాద్‌, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్‌ నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్యాసింజర్‌ రైళ్లకు ఎంఎంటీఎస్‌ రైల్వే స్టేషన్లలో టిక్కెట్లు ఇస్తుంటారు. ఇక్కడ ఎంఎంటీఎస్‌ ఎక్కి.. ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి దూరప్రాంతాల రైళ్లను అందుకోవాల్సిన వారు ఇబ్బందిపడుతున్నారు. రోజూ ఇద్దరు టిక్కెట్లు ఇచ్చే వారుంటారు. దూరప్రాంత రిజర్వేషన్‌ టిక్కెట్లు ఇచ్చేవారు మరొకరుంటారు. ఇలా ముగ్గురికి బదులు ఆదివారాల్లో ఒక్కరే ఉంటున్నారు. ఒక్కరే ఎంఎంటీఎస్‌, ప్యాసింజర్‌ రైళ్లకు టిక్కెట్లు ఇవ్వడానికి ఆలస్యం అవుతోంది. దీంతో కౌంటర్ల ముందు బారులుదీరిన ప్రయాణికులు తీవ్ర అసహనంతో ఉన్న ఒక్క ఉద్యోగిపై విరుచుకుపడుతున్నారు.


ఏ రైలు ఎప్పుడొస్తుందో..

రోనాకు ముందు 121 ఎంఎంటీఎస్‌ సర్వీసులు నగర ప్రయాణికులకు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం 75 సర్వీసులే నడుపుతున్నారు. ఆదివారం వస్తే వాటిని 35కే పరిమితం చేస్తున్నారు. నగరంలో మిగతా రోజుల్లో కార్యాలయాలకు, కూలీ పనులకు వెళ్లేవారు.. ఆదివారం నాడు షాపింగ్‌లకు, బంధువుల ఇళ్లకు ఎక్కువ మొత్తంలో వెళ్తున్నారు. నగరంలో శని, ఆదివారాల్లో కూడా విపరీతమైన ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బస్సులు, ఎంఎంటీఎస్‌లు, మెట్రో పూర్తి రద్దీగా మారుతున్నాయి. ఎంఎంటీఎస్‌లు సగానికి సగం కోత వేయడంతో ఏ రైలు ఎప్పుడొస్తుందో తెలియని గందరగోళం ఏర్పడుతోందని.. స్టేషన్లలో ఆ సమాచారం ఉండడంలేదని.. కౌంటర్‌లో అడిగితే మేము చెప్పలేమని సమాధానాలు వస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. 75 సర్వీసులు మొత్తం నడపాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని