logo

Green Coffee: గ్రీన్‌ కాఫీతో మధుమేహం.. ఊబకాయం నియంత్రణ

చిక్కనైన ఫిల్టర్‌ కాఫీ రుచి ఆస్వాదిస్తూ దినపత్రిక చదువుతూ ఉత్తేజాన్ని పొందే వారికి శుభవార్త... మన జీవితంలో భాగమైన కాఫీని గ్రీన్‌టీ తరహాలో గ్రీన్‌ కాఫీగా తీసుకుంటే చాలా ప్రయోజనాలున్నాయన్నాయని దీనిపై అధ్యయనం చేస్తున్న తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఆచార్యులు చెబుతున్నారు.

Updated : 16 Oct 2023 10:22 IST

తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఆచార్యుల అధ్యయనం

ఈనాడు, హైదరాబాద్‌: చిక్కనైన ఫిల్టర్‌ కాఫీ రుచి ఆస్వాదిస్తూ దినపత్రిక చదువుతూ ఉత్తేజాన్ని పొందే వారికి శుభవార్త... మన జీవితంలో భాగమైన కాఫీని గ్రీన్‌టీ తరహాలో గ్రీన్‌ కాఫీగా(Green Coffee) తీసుకుంటే చాలా ప్రయోజనాలున్నాయన్నాయని దీనిపై అధ్యయనం చేస్తున్న తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఆచార్యులు చెబుతున్నారు. గ్రీన్‌కాఫీలోని క్లోరోజెనిక్‌ ఆమ్లం మన శరీర బరువును తగ్గిస్తుందని.. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుందని పేర్కొంటున్నారు. సాధారణంగా కాఫీ పొడిని తయారు చేసేందుకు కాఫీ గింజలను కాలుస్తారు. రోస్ట్‌(వేయించడం) చేస్తారు.. ఇలా చేయకుండా నేరుగా గింజల ద్వారా కాఫీని తయారు చేయడమేనంటున్నారు ఆచార్యులు జయసూర్యకుమారి, శ్రీవల్లి, ఎం.స్రవంతి. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా కాఫీపొడిని తయారు చేసేందుకు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. పేటెంట్‌ హక్కుల కోసం దరఖాస్తు చేయనున్నారు.

గ్రీన్‌ కాఫీ.. క్లోరోజెనిక్‌ ఆమ్లం.. అరబికా నుంచి రోబస్టా కాఫీ వరకూ వివిధ రకాల కాఫీ పరిమళం కావాలంటే గింజలను వేర్వేరుగా కాల్చాలి. ఇందుకు భిన్నంగా కాలం గింజలతో గ్రీన్‌ కాఫీని తయారు చేసుకోవచ్చు. సాధారణ కాఫీతో పోలిస్తే గ్రీన్‌ కాఫీ భిన్నమైన రుచి ఉంటుంది. ఇది తేలికగా.. మూలికల తరహాలో రుచి కలిగి ఉంటుంది, ఇది కాల్చిన కాఫీ గింజల కంటే ఎక్కువ స్థాయిలో క్లోరోజెనిక్‌ ఆమ్లం, తక్కువ కెఫిన్‌ ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉండే కాఫీ గింజలను రోస్ట్‌ చేయడం ద్వారా గోధుమ రంగులోకి మారుతాయి. వేయించిన, కాల్చిన కొద్దీ ఈ గింజలు కుళ్లిపోతాయి. క్లోరోజెనిక్‌ ఆమ్లం నాశనమవుతుంది. ఆకుపచ్చ కాఫీ గింజల్లోని క్లోరోజెనిక్‌ ఆమ్లం వీటిని తాజాగా ఉంచుతుంది.

ఆరోగ్య ప్రయోజనాలు.. గ్రీన్‌ కాఫీని రోజుకు ఒకసారి తాగినా క్లోరోజెనిక్‌ ఆమ్లం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. కొవ్వును హరిస్తుంది. జీవక్రియను పెంచుతుంది. ఇన్సులిన్‌ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. అదనంగా, ఇది వాపు, కొవ్వు నిల్వను గణనీయంగా తగ్గిస్తుంది. టైప్‌ 2 మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును గణనీయంగా తగ్గిస్తుంది. హృదయ స్పందనను నిలకడగా ఉంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తనాళాలను విస్తరిస్తుంది కార్టిసాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది. ఈ లక్షణాలన్నీ గ్రీన్‌ కాఫీలో ఉన్నాయని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ స్క్రాంటన్‌ పరిశోధకులు జె.ఎ.విన్సన్‌ ఇటీవల శాస్త్రీయంగా నిరూపించారు.


శాస్త్రీయ ఆధారాలు.. పరిశోధనలున్నాయ్‌  

ప్రొ.జయసూర్యకుమారి

గ్రీన్‌ కాఫీని రోజుకు ఒకసారి తాగడం వల్ల మధుమేహం నియంత్రణలోకి వస్తుందని శాస్త్రీయ, ఆధారాలు పరిశోధనలున్నాయి. వీటిని అధ్యయం చేసి రెండేళ్లుగా మేమే సొంతంగా ప్రయోగాలు చేస్తున్నాం. మా కుటుంబసభ్యులకు గ్రీన్‌కాఫీని తాగించి వారి శారీరక, మానసిక స్థితులను వైద్యుల ద్వారా తెలుసుకున్నాం. 90శాతం మందికి శరీరం బరువు తగ్గింది. టైప్‌2 మధుమేహం నియంత్రణకు వచ్చింది. అందుకే మా గ్రీన్‌కాఫీకి పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని