logo

Hyderabad: ఉప ఎన్నికలో ఊహించని మలుపు

కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికపై కాంగ్రెస్‌ పట్టుబిగించింది. తన వ్యూహాలతో దూకుడు పెంచి ప్రత్యర్థి పార్టీల కంటే ముందుకు సాగుతోంది. బరిలో నిలిపేందుకు గట్టి అభ్యర్థి కోసం చూస్తున్న ఆ పార్టీకి బలమైన నేత దొరికారు.

Updated : 20 Mar 2024 08:09 IST

టిక్కెట్‌ హామీతో భాజపా నుంచి హస్తం గూటికి శ్రీగణేశ్‌
కంటోన్మెంట్‌పై పట్టుబిగించిన కాంగ్రెస్‌
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

శ్రీగణేశ్‌కు కాంగ్రెస్‌ కండువా కప్పుతున్న మహేశ్‌కుమార్‌, చిత్రంలో పట్నం మహేందర్‌రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు

కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికపై కాంగ్రెస్‌ పట్టుబిగించింది. తన వ్యూహాలతో దూకుడు పెంచి ప్రత్యర్థి పార్టీల కంటే ముందుకు సాగుతోంది. బరిలో నిలిపేందుకు గట్టి అభ్యర్థి కోసం చూస్తున్న ఆ పార్టీకి బలమైన నేత దొరికారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్‌ నారాయణన్‌ మంగళవారం రాత్రి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు కంటోన్మెంట్‌ టిక్కెట్‌ దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు హామీ లభించిన తరువాతే శ్రీగణేశ్‌ అప్పటికప్పుడు కాంగ్రెస్‌లో చేరారని పార్టీ వర్గాలు తెలిపాయి.  ప్రజాబలం ఉన్న గణేశ్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకొని బరిలో నిలిపితే తమదే విజయమన్న భావనలో ఆ హస్తం పార్టీ నేతలు ఉన్నారు.

మధ్యాహ్నం వరకు భాజపా ప్రచారంలో..

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కంటోన్మెంట్‌ భారాస అభ్యర్థిగా ఎమ్మెల్యే లాస్యనందిత విజయం సాధించారు. గత ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా మొన్నటి ఎన్నికల్లో కంటోన్మెంట్‌ నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్‌ను మరోసారి భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ దాదాపుగా నిర్ణయించింది. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన దివంగత గద్దర్‌ కుమార్తె వెన్నెల మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈసారీ ఆమెకే టిక్కెట్‌ దక్కుతుందని అంతా భావించారు. అయితే గట్టి అభ్యర్థిని నిలిపి కంటోన్మెంట్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని దృష్టిపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. స్థానిక నేతలతో మాట్లాడారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలున్న శ్రీ గణేశ్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకొని అభ్యర్థిగా నిలిపితే బాగుంటుందని పలువురు సూచించారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి  గణేశ్‌తో మాట్లాడారు. టిక్కెట్‌ హామీ ఇస్తే వస్తాననడంతో ఆ మేరకు హామీ లభించడంతో మంగళవారం రాత్రి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌ నివాసంలో మైనంపల్లి, మహేందర్‌రెడ్డి సమక్షంలో గణేశ్‌ కాంగ్రెస్‌లోచేరారు. మంగళవారం మధ్యా హ్నం వరకు మల్కాజిగిరిలో భాజపా నేత ఈటలతో కలిసి ప్రచారంలో పాల్గొన్న శ్రీ గణేశ్‌.. రాత్రి కాంగ్రెస్‌లో చేరడంపై భాజపా నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారాస తరఫున సాయన్న కుమార్తె నివేదిత తనకు టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీనిపై ఆ పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

నియోజకవర్గ అభివృద్ధి కోసమే..

కంటోన్మెంట్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌ పార్టీలో చేరానని శ్రీగణేశ్‌ నారాయణన్‌ తెలిపారు. ఈమేరకు రెండు రోజులుగా పార్టీ అగ్రనేతలు, మాజీ ఎమ్మెల్యేలు పట్నం మహేందర్‌రెడ్డి, మైనంపల్లి హనుమంతరావుతో జరిపిన చర్చలు సఫలీకృతం కావడంతో కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. లోక్‌సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో కాంగ్రెస్‌ సత్తాచాటుతుందని శ్రీగణేశ్‌ నారాయణన్‌ ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని