logo

డార్మెటరీలో దోస్తీ.. చోరీలతో మస్తీ

ఎంజీబీఎస్‌ వద్ద ఉన్న డార్మెటరీలో పరిచయమై సెల్‌ఫోన్‌, ద్విచక్రవాహనాలను దొంగలిస్తూ జల్సాలు చేస్తున్న ఇద్దరు నిందితులను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 28 Apr 2024 02:40 IST

14 చరవాణులు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం

వివరాలు వెల్లడిస్తున్న సుల్తాన్‌బజార్‌ ఏసీపీ శంకర్‌. చిత్రంలో ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌, డీఐ నాగార్జున

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఎంజీబీఎస్‌ వద్ద ఉన్న డార్మెటరీలో పరిచయమై సెల్‌ఫోన్‌, ద్విచక్రవాహనాలను దొంగలిస్తూ జల్సాలు చేస్తున్న ఇద్దరు నిందితులను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 14 చరవాణులు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఏసీపీ శంకర్‌ తెలిపిన వివరాల ప్రకారం..  ఉస్మాన్‌గంజ్‌లో ఉండే రాము  ఈనెల 25న  నారాయణగూడ వెళ్తూ తన సెల్‌ఫోన్‌ పోగొట్టుకొని నారాయణగూడ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు శనివారం మధ్యాహ్నం రాంకోఠి ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా బైక్‌పై కనిపించగా అదుపులోకి తీసుకొని విచారించారు. వారి వద్ద 14 చరవాణులు వారి వద్ద దొరికాయి. వీటిలో రాము సెల్‌ఫోన్‌ కూడా ఉంది. నిందితులు మహబూబ్‌నగర్‌లోని ఎల్కగుడకు చెందిన చాకలి బాలరాజు, మెదక్‌ జిల్లా పాపన్నపేట అబ్లాపూర్‌కు చెందిన కూరం రాజుగా గురించారు. బాలరాజు చరవాణులు కొట్టేయడంలో సిద్ధహస్తుడు, ఇతడిపై ఇప్పటికే 18 కేసులు ఉన్నాయి. కూరంరాజు బైక్‌లను ఎత్తుకెళ్లడంతో ఆరితేరినవాడు. ఇతడిపై రెండు కేసులున్నాయి. కూరంరాజు ఎంజీబీఎస్‌లోని ఓ డార్మెటరీలో ఉంటున్నాడు. అక్కడే బాలరాజు పరిచయమై స్నేహం ఏర్పడింది. అప్పటినుంచి ఇద్దరూ కలిసి సెల్‌ఫోన్‌లు, బైక్‌లు చోరీ చేసి జల్సాలు చేస్తున్నారు. రాంకోఠిలో తాము కొట్టేసిన వాహనం అమ్మేందుకు వచ్చి పోలీసులకు చిక్కారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని