logo

అసత్య ప్రచారాలకు ‘మిత్‌ వర్సెస్‌ రియాలిటీ’తో చెక్‌

అసత్య ప్రచారాలపై నియంత్రణ లేకుండా పోతోంది.. ఫలితంగా వాస్తవ సమాచారం దారి తప్పుతోంది. సామాజిక మాధ్యమాలు వేదికగా నిత్యం వివిధ అంశాలపై కోకొల్లలుగా వార్తలు, వదంతులు పుట్టుకొస్తున్నాయి.

Published : 28 Apr 2024 02:45 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: అసత్య ప్రచారాలపై నియంత్రణ లేకుండా పోతోంది.. ఫలితంగా వాస్తవ సమాచారం దారి తప్పుతోంది. సామాజిక మాధ్యమాలు వేదికగా నిత్యం వివిధ అంశాలపై కోకొల్లలుగా వార్తలు, వదంతులు పుట్టుకొస్తున్నాయి. వీటిలో ఏది నిజం..?, ఏది అబద్ధం..? తెలియక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. పూర్తి స్పష్టత లేకుండా సోషల్‌ మీడియా వేదికగా తోచిన రీతిలో కొందరు ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి ఆందోళనకరంగా మారింది. వీటి కట్టడికి ఎన్నికల సంఘం (ఈసీ) పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వాటిలో ‘వెరిఫై బిఫోర్‌ యూ యాంప్లిఫై’ (విస్తరణకు ముందు నిర్ధరణ), ‘ఫ్యాక్ట్‌ చెక్‌’ ముఖ్యమైనవి. తాజాగా ఈసీ పైరెండింటితో పాటు ‘మిత్‌ వర్సెస్‌ రియాలిటీ’ అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. వివిధ సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న సమాచారాన్ని విశ్లేషించి, ధ్రువీకరించిన తరువాత ఈసీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తుంది.

ఇదీ ముఖ్య ఉద్దేశం.. ఎన్నికల సమయంలో పారదర్శకత, కచ్చితత్వం, బాధ్యతాయుతమైన  సమాచారాన్ని ప్రజలకు, మీడియాకు అందుబాటులో ఉంచడం ఈసీ  https://mythvsreality.eci.gov.in వెబ్‌సైట్‌ ముఖ్య ఉద్దేశం.  అసలు నిజమేంటో పౌరులకు తెలియజేయడం. ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, ఎన్నికల జాబితా, ఓటర్లకు అందించే సేవలు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌, యూట్యూబ్‌ తదితర మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్న చిత్రాలు, వీడియోలు, డాక్యుమెంట్లు, వాయిస్‌ మెసేజ్‌లను అధికారులు ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్‌చెక్‌ చేసి ‘మిత్‌ వర్సెస్‌ రియాలిటీ’ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు. వైరల్‌ అవుతున్న అసత్యాలతోపాటు వాస్తవ సమాచారాన్ని జోడిస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లు, ప్రచారం, యాప్‌లు, ఓటర్ల సేవల గురించి తెలియజేసే ఎన్నికల సంఘం అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌, ఫేస్‌బుక్‌ ఖాతాల లింక్‌లను అందుబాటులో ఉంచారు.

ఇలా వివరిస్తారు...

తప్పు: ఈవీఎంలను ఇతర దేశాల్లో ఉపయోగించడం లేదు.

వాస్తవం: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లను అమెరికా, బ్రెజిల్‌, నమీబియా, భూటాన్‌ తదితర దేశాల్లో ఉపయోగిస్తున్నారు.

తప్పు: 14 శాతం కంటే ఎక్కువ ‘టెండర్‌ ఓట్లు’ పోలైనట్లయితే ఆ కేంద్రంలో రీ పోలింగ్‌ నిర్వహిస్తారు.

వాస్తవం: ప్రజాపాతినిధ్య చట్టం - 1951లోని సెక్షన్‌ 58 రీపోలింగ్‌ను మాత్రమే సూచిస్తుంది. టెండర్‌ ఓట్ల కారణంగా నిర్వహించాలనే నిబంధన లేదు. 

తప్పు: విద్యుత్తు సదుపాయం లేని ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయవు.

వాస్తవం: ఈవీఎం, ఈవీ ప్యాట్‌లు పనిచేయడానికి బయట నుంచి విద్యుత్తు సరఫరా అవసరం లేదు. వాటికి ప్రత్యేకంగా బ్యాటరీలు ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని