logo

Hyderabad: నగదుంటేనే రైడ్‌ రైట్‌

ఉదయం, సాయంత్రం వేళల్లో క్యాబ్‌ బుక్‌ అవడం ఓ ప్రహసనమే. అనేక ప్రయత్నాల తర్వాత గానీ బుక్‌ అవదు. ఒకవేళ అయ్యి పేమెంట్‌ విధానం ఎంపిక చేసినా.. డబ్బులు ఎలా చెల్లిస్తారంటూ క్యాబ్‌ డ్రైవర్లు ఫోన్‌ చేస్తారు.

Updated : 28 Mar 2024 09:06 IST

డ్రైవర్ల తీరుతో ప్రమాద బీమా కోల్పోతున్న ప్రయాణికులు

ఉదయం, సాయంత్రం వేళల్లో క్యాబ్‌ బుక్‌ అవడం ఓ ప్రహసనమే. అనేక ప్రయత్నాల తర్వాత గానీ బుక్‌ అవదు. ఒకవేళ అయ్యి పేమెంట్‌ విధానం ఎంపిక చేసినా.. డబ్బులు ఎలా చెల్లిస్తారంటూ క్యాబ్‌ డ్రైవర్లు ఫోన్‌ చేస్తారు. ఆన్‌లైన్‌లో చెల్లిస్తామని చెబితే ఫోన్‌ కట్‌ చేస్తారు. ఆ వెంటనే రైడ్‌ రద్దవుతుంది. కొందరు డ్రైవర్లు ఫోన్‌ చేసి జేబులో నగదు ఉంటే సరి లేకపోతే రైడ్‌ రద్దు చేయాలని సూచిస్తారు. అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారికి క్యాబ్‌ బుకింగ్‌లో ఎదురయ్యే సమస్యలు వర్ణనాతీతం. ఆన్‌లైన్‌లో, డిజిటల్‌ పేమెంట్‌లో డబ్బులు చెల్లిస్తామని చెప్పినా వినిపించుకోరు. తప్పని పరిస్థితుల్లో డ్రైవర్లు చెప్పిన ధర చెల్లించి గమ్యం చేరుకుని ఆ తరువాత సదరు క్యాబ్‌ సంస్థలకు ఫిర్యాదు చేసినా స్పందన ఉండదు. రైడ్‌ బుక్‌ చేసి గమ్యం చేరేలోపు ప్రమాదం జరిగి మరణిస్తే రూ.5 లక్షలు, గాయాలైతే చికిత్సకు రూ.లక్ష వరకు క్యాబ్‌ సంస్థల నుంచి బీమా వర్తించేలా నిబంధనలున్నాయి. ఈ చెల్లింపుల షరతుల మధ్య ప్రయాణికులు బీమా పొందలేకపోతున్నారు.

రద్దుతోనే సమస్య..

రైడ్‌ బుక్‌ చేసుకున్నాక పికప్‌ చేసుకోవడానికి వచ్చిన క్యాబ్‌డ్రైవర్‌ రైడ్‌ ఛార్జీ ఎంత చూపించిందని అడుగుతారు. ఖైరతాబాద్‌ నుంచి ఉప్పల్‌కి రూ.180 చూపించిందని చెబితే సరే సార్‌ కొంచెం రైడ్‌ రద్దు చేస్తారా? ఎందుకంటే ఇచ్చే మొత్తంలో కంపెనీ రూ.40కి పైగా కట్‌ చేస్తుందని చెబుతారు. సరే అని ఆ రైడ్‌ను రద్దు చేశామా అంతే. మార్గమధ్యలో సర్జ్‌, పీక్‌ ఛార్జీల పేరుతో ధర పెరిగితే పెరిగిన ధర ఇవ్వాలంటూ కొందరు డ్రైవర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రయాణికుల బీమా వివరాలు క్యాబ్‌ యాప్‌లో ఉంటాయి. అందులో వివరాలు నమోదు చేయాలి. పైగా నిర్లక్ష్యంగా వ్యవహరించే డ్రైవర్లపై ఫిర్యాదు చేయాలనుకుంటే అందులోనే సపోర్ట్‌ అనే ఎంపిక ద్వారా సమస్యను వివరింవచ్చు.

రక్షణ ఏదీ?

  • నగరంలో 2 లక్షల కార్లు, లక్ష ఆటోక్యాబ్‌లు, 50 వేల బైక్‌రైడ్‌ ట్యాక్సీలు రోజూ ప్రయాణికులను గమ్యస్థానాలు చేరుస్తుంటాయి. బైక్‌టాక్సీల్లో ప్రయాణించేవారికి హెల్మెట్‌ ఇవ్వరు. ట్రాఫిక్‌ రద్దీని తప్పించేందుకు కొందరు బైక్‌టాక్సీ కెప్టెన్ల విన్యాసాలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
  • శివార్లకు వెళ్లేందుకు క్యాబ్‌కే ప్రాధాన్యమివ్వాలి. రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉన్న క్రమంలో ప్రమాద బీమా రక్షణగా ఉంటుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని