అనుమానాస్పద స్థితిలో కార్మికుడి మృతి
సత్తెనపల్లి, న్యూస్‌టుడే : భవన నిర్మాణ కార్మికుడి అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా సత్తెనపల్లి సీఐ యు.శోభన్‌బాబు చెప్పారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. మైదుకూరుకు చెందిన వై.చాంద్‌బాషా(41) గత కొన్నేళ్లుగా పట్టణంలో స్థానిక మహిళతో కలిసి ఉంటూ...భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం తారకరామసాగర్ ఎదురుగా ఉన్న స్టేడియం మైదానంలో విగతజీవిగా పడి ఉన్నాడు. బహిర్భూమికి వెళ్లిన వారు చూసి పోలీసులకు సమాచారం అందజేశారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఎవరైనా చంపారా...అతడే చనిపోయాడా అనే కోణంలో విచారించారు. రెండో వార్డు సచివాలయం వీఆర్‌వో ఆర్.శ్రీలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చాంద్‌బాషా కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, వారితో మాట్లాడి కేసును చేధిస్తామని సీఐ తెలిపారు.