logo

పేదలవి కూల్చేసి..పెద్దలవి వదిలేసి !

కడప నగరం రామాంజనేయపురంలోని వడ్డెర కాలనీకి పైభాగంలో కుంట ఉంది. ఇక్కడ నుంచి వికలాంగుల కాలనీ, సబ్‌జైలు, యానాది కాలనీ, వడ్డెర కాలనీ, నిరంజన్‌నగర్, ఆర్‌కే నగర్‌లో చెరువు(ఇప్పుడు ఇళ్ల నిర్మాణం) ఉంది. నిరంజన్‌నగర్, వడ్డెరకాలనీ, యానాదికాలనీలో

Published : 26 May 2022 06:34 IST

    కడప నగరంలో అనధికార కట్టడాల కూల్చివేతలో పక్షపాత ధోరణి
    ప్రణాళిక లేకుండా అధికార యంత్రాంగం ఇష్టారాజ్యంగా పనులు 


ప్రకాష్‌నగర్‌లో అవసరం లేకున్నా పేదల ఇళ్ల కూల్చివేత

*సార్‌.. అయిదడుగుల కాలువ ఉంది... మరో అయిదడుగులు తీసుకోండి... మా ఇళ్లు మాత్రం కొట్టకండి. కూలి పనులు చేసుకుంటూ ఇల్లు కట్టుకున్నామని బతిమలాడినా కనికరించలేదు... 
మా ప్రాంతం మునగడంలేదు ఇక్కడెందుకు ఇళ్లు కూల్చుతున్నారంటే మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ అడిగిన వ్యక్తి ఇంటిని మరింత భాగాన్ని కూల్చేశారు... 
*ఓ వైపు నుంచి ఆక్రమణలు కూల్చివేస్తూ రావాలి కదా?... మధ్యలోనే ఎందుకు కూల్చుతారని అడిగితే?.. మా ఇష్టం మీరడిగే హక్కు లేదు... ఇంతకీ నీ ఇళ్లెక్కడంటూ బెదిరించారు... 
*పేదలు తమ బాధను, జరిగిన అన్యాయాన్ని చెప్పుకొనేందుకు కూడా సాహసించలేనంతగా భయపెట్టేశారు అధికారులు.... 

ఈనాడు డిజిటల్, కడప కడప నగరం రామాంజనేయపురంలోని వడ్డెర కాలనీకి పైభాగంలో కుంట ఉంది. ఇక్కడ నుంచి వికలాంగుల కాలనీ, సబ్‌జైలు, యానాది కాలనీ, వడ్డెర కాలనీ, నిరంజన్‌నగర్, ఆర్‌కే నగర్‌లో చెరువు(ఇప్పుడు ఇళ్ల నిర్మాణం) ఉంది. నిరంజన్‌నగర్, వడ్డెరకాలనీ, యానాదికాలనీలో మాత్రమే ఇళ్లు కూల్చేశారు. సమస్య తీవ్రత ఉన్న ఎన్‌జీవో, కో-ఆపరేటివ్‌ కాలనీ, రాజారెడ్డికాలనీ, అప్సర వలయంలో ఏమాత్రం పట్టించుకోలేదు. పేదలు నివాసం ఉన్న ప్రాంతంలో ఏమాత్రం కనికరం లేకుండా ఆవాసాలను నేలమట్టం చేసేశారు.     
ప్రకాష్‌నగర్‌ వైపు చూస్తే...!
ఇక్కడ పది అడుగుల మురికినీటి కాలువ వెళుతుంది. నిర్వహణ లేక కొన్ని చోట్ల బహుళ అంతస్తుల ఇళ్లు కట్టుకున్న బడా నేతలు ఇష్టారాజ్యంగా కాలువను తవ్వేశారు. కాలువ నుంచి చుక్కనీరు ముందుకు కదలడం లేదు. చెత్తాచెదారం, మొక్కలు పెరగడంతో నీటి ప్రవాహం నిలిచిపోయింది. కాలువ పూడికతీత, తవ్వేసిన చోట చర్యలు చేపట్టిన తరుణంలో సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నా... ఇక్కడా పేదల ఇళ్లను కూల్చేశారు. దీంతో పలు కుటుంబాలు వీధినపడ్డాయి. నగరంలో పలు చోట్ల పలువురు బడానేతల ఆక్రమణలను పట్టించుకోలేదు. వీరి కారణంగా కాలువల్లో మురికినీటి ప్రవాహం చాలా చోట్ల అగిపోయింది. నేలలోకి ఇంకిపోవడం ద్వారా తాత్కాలికంగా సమస్యకు పరిష్కారం లభిస్తోంది. 


రామాంజనేయపురంలోని వడ్డెర కాలనీలో కూల్చివేతలు

ఇంత చేసినా... పరిష్కారమవుతుందా?...
కడప నగరానికి అత్యంత కింద భాగంలో ఉన్న రామాంజనేయపురంతో పాటు ప్రకాష్‌నగర్‌లో కూల్చివేతతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఆక్రమణల కూల్చివేత పనుల ద్వారా శాశ్వత పరిష్కారం లభించే అవకాశం లేదు. నగరంలోని కాలువల్లో పూడిక తీత ఎక్కడా జరగడంలేదు. నగరమంతా ప్రణాళిక లేకుండా నిర్మాణాలు జరిగిపోయాయి. చిన్నచౌక్‌లోని రెడ్డికాలనీ అంతా మురికి కాలువల్లో నీటి ప్రవాహం లేక రహదారిపైకి చేరుతోంది. పాత బైపాస్‌రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి వస్తారని కాలువలను బండలతో కప్పిపుచ్చారు. మృత్యంజయకుంటను ఆక్రమించుకున్నారు. అన్ని ప్రధాన రహదారుల వెంట ఆక్రమణలున్నాయి. వీటిని వదిలిపెట్టి అత్యంత కడుపేదల నివాసాలను దౌర్జన్యంగా కూల్చేశారు. 

తొలగించాల్సిందే...అయితే?...
చెరువులు...నాలాల ఆక్రమణలతో వరదనీటి ప్రవాహానికి దారులు మూసుకుపోయి కడప నగరం ముంపునకు గురవుతోంది. ఆక్రమార్కుల ధాటికి నగరాల్లో మురుగు, వరదనీటి పారుదల వ్యవస్థలు చిన్నా భిన్నమవుతున్నాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలకు కాలనీలు నీటమునగడంతో వేల కుటుంబాలు విలవిలలాడాయి. కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 12 అడుగుల మేరకు కొన్ని రోజుల పాటు నీరు నిలిచిపోవడం గమనార్హం. ఈ తరుణంలో ఆక్రమణల తొలగింపు పేరిట గత కొన్ని రోజులుగా నగరంలో పనులు చేపట్టారు. ఈ చర్యను ఆహ్వానించాల్సి ఉన్నప్పటికీ ఇష్టారాజ్యంగా పేదలపైనే ప్రతాపం చూపించడం విమర్శలకు దారితీస్తోంది. 

దీనికేం సమాధానం చెబుతారు? 
నగరంలో ఎక్కడా కాలువలు నిర్వహిస్తున్న దాఖలాల్లేవు. చెత్తాచెదారం, మట్టితో నిండిపోయిన కాలువల్లో నెలల తరబడి పార పెట్టిన పరిస్థితి లేదు. సాధారణ వర్షపాతానికే వరద నీరంతా రహదారులపై ప్రవహిస్తోంది. నగరంలో 550 కిలోమీటర్ల పొడవున్న కాలువలు, 70 కిలోమీటర్ల పొడవున్న ప్రధాన కాలువలు ఉన్నా ఎక్కడా పూడిక తీయడంలేదు. వీటి నిర్వహణ చేపట్టడం ద్వారా కొంత వరకు వరద ముప్పును అధిగమించే అవకాశం ఉంది.   
ఆక్రమణలన్నీ తొలగిస్తాం 
కడప నగరంలో ఆక్రమణలన్నీ తొలగిస్తాం. కలెక్టరు ఆదేశాల మేరకు తొలుత ఏడు ముంపు ప్రాంతాలపై దృష్టి సారించాం. ఎవరినీ ఉపేక్షించకుండా ఆక్రమణలు తొలగిస్తాం. ఇందుకోసం పలు కమిటీలు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నాయి.  -శివరామిరెడ్డి, తహసీల్దార్, కడప

కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు
మా ఇంటితో కాలువకు ఎలాంటి ముప్పులేదు. సమస్య ఉన్నచోట్ల పట్టించుకోలేదు. ఏదైనా సమస్య ఉందా? అని అడిగాం. రూ.8 లక్షలతో కట్టుకున్న ఇంటిని నిమిషాల్లో కూల్చేశారు. మా తల్లితో కలిసి వెళ్లి రెవెన్యూ అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. కాలువలో నీటిని కదలకుండా అడ్డుకునే వారి గురించి పట్టించుకోకుండా మమ్మల్ని వీధిన పడేశారు. మాకు ఏదిక్కూ లేకుండా పోయింది.  -మహమ్మద్‌ షరీఫ్, ప్రకాష్‌నగర్‌ కాలనీ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు