logo

రొయ్యలు పట్టేదెట్లా?

మత్స్యకారులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం జలాశయాల్లో చేప పిల్లలతోపాటు రొయ్యల పిల్లలను వదులుతుంది. మత్స్యకారులకు రొయ్య పిల్లలను పట్టడంలో అవసరమైన నైపుణ్యం లేకపోవడంతో జలాశయంలోనే

Published : 21 Jan 2022 03:18 IST

మత్స్యకారులకు నైపుణ్యం కరవు

న్యూస్‌టుడే, బోయినపల్లి

రొయ్య పిల్లలు వదులుతున్న అధికారులు

మత్స్యకారులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం జలాశయాల్లో చేప పిల్లలతోపాటు రొయ్యల పిల్లలను వదులుతుంది. మత్స్యకారులకు రొయ్య పిల్లలను పట్టడంలో అవసరమైన నైపుణ్యం లేకపోవడంతో జలాశయంలోనే అవి ఉంటున్నాయి. దీంతో వాటిని పట్టడంలో శిక్షణ ఇప్పించడానికి ఇటీవల ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపగా అనుమతి వచ్చింది. ఈ మేరకు త్వరలోనే మధ్యమానేరు జలాశయం పరిధిలోని మత్స్యకారులకు శిక్షణ ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో వారికి ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.

జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయం (మధ్యమానేరు), ఎగువ మానేరు (అప్పర్‌), అన్నపూర్ణ జలాశయాలు ఉన్నాయి. రాజరాజేశ్వర జలాశయం, ఎగువ మానేరులో మూడేళ్లగా చేప పిల్లతోపాటు రొయ్య పిల్లలను అధికారులు వదులుతున్నారు. ప్రస్తుతం  సంవత్సరంలో ఈ రెండింటితోపాటు అన్నపూర్ణ జలాశయంలో కూడా వదిలారు. మూడేళ్లలో రెండు జలాశయాల్లో 64,79,450 లక్షల రొయ్య పిల్లలను వదలగా, 2021-22లో 37,50,00 విడిచిపెట్టారు. నెల రోజుల వయస్సు ఉన్న 100 గ్రాముల బరువు ఉన్న వాటిని వదులుతుండగా 4 నుంచి 5 నెలల వ్యవధిలో సుమారు 450 గ్రాముల బరువుకు పెరుగుతుంది. ఫిబ్రవరి నుంచి మే వరకు జలాశయాల్లో రొయ్యలు అధికంగా లభిస్తాయి. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.400 వరకు పలుకుతుంది. మత్స్యకారులు వ్యాపారులకు కిలో రూ.200లకే విక్రయిస్తున్నారు. కాగా ఏటా రాజరాజేశ్వర జలాశయంలో రొయ్యలను వదులుతున్నప్పటికి వీటిని పూర్తిస్థాయిలో పట్టడం లేదు. ఇందుకు సరైన నైపుణ్యం లేకపోవడమే కారణమని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం మత్స్యకారుల ఉపాధి అవకాశాలపై చూపుతుంది.

నీరు అధికంగా ఉండటంతో...-తిరుపతి, మత్స్యకారుడు, కొదురుపాక

జలాశయంలో నీరు అధికంగా ఉండటంతో రొయ్యలు లభించడం లేదు. వాటిని పట్టడంలో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. శిక్షణతో వారికి ప్రయోజనం కలుగుతుంది. బుట్టలు, వలలు, తెప్పలు, మోపెడ్‌లు ఉచితంగా అందించాలి.

త్వరలోనే శిక్షణ ఇస్తాం- శివప్రసాద్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి

రాజరాజేశ్వర జలాశయంలో ఏటా వదులుతున్న రొయ్యలను మత్స్యకారులు పూర్తిస్థాయిలో పట్టడం లేదు. నైపుణ్యం లేకపోవడం వల్ల సాధ్యపడటం లేదని తెలిసింది. ఇందుకోసం వారికి త్వరలోనే శిక్షణ శిబిరం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జలాశయంలో రొయ్యలు పుష్కలంగా ఉన్నాయి. రాయితీపై మోపెడ్‌, తెప్పలు, వలలు అందించేందుకు ప్రతిపాదనలు పంపిస్తాం.

శిబిరం ఏర్పాటుకు కార్యాచరణ

రాజరాజేశ్వర జలాశయం పరిధిలోని 1,024 మంది మత్స్యకారులతో మార్కెటింగ్‌ సొసైటీ ఏర్పాటు చేశారు. రొయ్యలను పట్టడంలో ఎదురవుతున్న సమస్యలను మత్స్యకారులు అధికారులకు వివరించారు. దీంతో నిష్ణాతులైన మత్స్యకారులను ఖమ్మం జిల్లా నుంచి రప్పించి ఇక్కడి వారికి శిక్షణ ఇప్పించాలని అధికారులు భావిస్తున్నారు. వెయ్యి మందిని మూడు బృందాలుగా విభజించి ఈ నెల 27 తరవాత మూడు రోజులు శిక్షణ శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే వలలు, మోపెడ్‌, తెప్పలు అందించడానికి చర్యలు తీసుకోనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని