logo

బదిలీల బేరం.. ఇదేం ఘోరం

కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఓ ఉపాధ్యాయుడు పరస్పర బదిలీపై ఇతర జిల్లాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌ మండలానికి చెందిన ఓ 

Published : 21 Jan 2022 03:18 IST

ఒక్కో ప్రాంతానికి రూ.10 లక్షల డిమాండ్‌

ఒప్పందాలు కుదుర్చుకుంటున్న ఉపాధ్యాయులు

న్యూస్‌టుడే-కరీంనగర్‌ విద్యావిభాగం

కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఓ ఉపాధ్యాయుడు పరస్పర బదిలీపై ఇతర జిల్లాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌ మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు బదిలీ కోసం ఫోన్‌లో ఆయన్ను సంప్రదించారు. సదరు ఉపాధ్యాయుడు మీ నుంచి కొంత ఆశిస్తున్నట్లు సమాధానమిచ్చి, బయట పెద్దమొత్తంలో నడుస్తుందని చెప్పారు. కరీంనగర్‌ జిల్లాకు బాగా డిమాండ్‌ ఉందని బేరాలు ఆడారు. దాదాపు రూ.10 లక్షల వరకు డిమాండ్‌ చేస్తూ సంభాషించారు. ఇది గురువారం వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది.

కొత్త జిల్లాలకు కేటాయింపుల అనంతరం ఉపాధ్యాయులు పలువురు పరస్పర బదిలీలపై దృష్టి నిలిపారు. వారు కోరుకుంటున్న జిల్లాకు సాధారణ బదిలీల్లో వెళ్లే అవకాశం బంద్‌ కావడంతో పరస్పర బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే లక్షల రూపాయలను ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు.   కొందరు ఉపాధ్యాయులు ఈ వ్యవహారానికి మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. స్థానికతకు ప్రాధాన్యం లేకుండా సీనియారిటీ ప్రకారం కొత్త జిల్లాలకు కేటాయింపులు జరపడంతో చాలా మంది ఉపాధ్యాయులు సొంత జిల్లాలకూ దూరంగా పక్క జిల్లాలకు వెళ్లారు. ఉపాధ్యాయులుగా ఉన్న భార్య, భర్తలు తలో జిల్లాకు కేటాయించారు. ఇలాంటి వారు పరస్పర బదిలీల కోసం ఎదురుచూస్తూ ఇలాంటి అడ్డదారులను వెతుక్కుంటున్నారు. మరో వైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం ఈ బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా, మార్గదర్శకాలే జారీ తరువాయి కావడంతో పరస్పర బదిలీల బేరసారాలు ఉమ్మడి జిల్లాలో మరింత ఊపందుకున్నాయి.

జిల్లా, మండలాన్ని బట్టి డిమాండ్‌

పరస్పర బదిలీపై డబ్బులు తీసుకుని ఎక్కడికైనా వెళ్లేందుకు ముందుకు వస్తున్న వారు ఇందు కోసం జిల్లా, మండలాన్ని బట్టి లక్షల్లో డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా వివిధ రకాలు వ్యాపారాలున్న వారు, స్పౌజ్‌ కేటగిరిలోని వారు ఇలా బదిలీపై వచ్చేందుకు అత్యధికంగా ఆసక్తి చూపుతున్నారు. హెచ్‌ఆర్‌ఏ పొందే అవకాశం గల బడులకు ఇంకా ఎక్కువ మొత్తంలో డిమాండ్‌ చేస్తున్నారు. సర్వీసు ఎక్కువగా ఉన్న మరికొందరు స్థానిక జిల్లాకు వెళ్లేందుకు పరస్పర బదిలీ ఇచ్చే వారి కోసం వెతుకుతున్నారు. పదవీ విరమణకు తక్కువ కాలం ఉన్న వారు అందినంత  దండుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.

విద్యాశాఖ దృష్టికి సమాచారం

ఉపాధ్యాయుల వాట్సాప్‌ గ్రూపుల్లో ఇలాంటి సందేశాలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. కేటాయించిన జిల్లా, పాఠశాల పేరు, చిరునామా, కేటగిరి, కోరుకుంటున్న జిల్లా, చరవాణి నంబర్లను వాటిల్లో పెడుతున్నారు. వీటి ఆధారంగా పరస్పర బదిలీల బేరసారాలు ప్రారంభమయ్యాయి. గురువారం వాట్సాప్‌ల్లో చక్కర్లు కొట్టిన ఇద్దరు ఉపాధ్యాయుల పరస్పర బదిలీ కోసం జరిగిన సంభాషణ, డబ్బుల డిమాండ్‌ వ్యవహారాన్ని ఓ ఉపాధ్యాయ సంఘ నేత రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో క్రమశిక్షణ చర్యలు తప్పవని  అధికారి చెప్పినట్లు సంఘ నేత తెలిపారు.

ఉపాధ్యాయులు ఆలోచించాలి -క్యాదాసి సారయ్య, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, టీపీటీయూ

బదిలీ కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి ఉపాధ్యాయ పోస్టులను వ్యాపారంగా మార్చడం మంచిది కాదు. జిల్లాలు మారాలి అనుకుంటే మానవతా దృక్పథంతో మరొకరికి అవకాశం కల్పించి ఆదర్శంగా నిలవాలి. జిల్లా మారడం కోసం అప్పులు చేసి తిప్పలు పడవద్దు. ఉపాధ్యాయ రంగానికి చెడ్డపేరు తీసుకురావద్దు.

* ఉమ్మడి జిల్లాలోని కొత్త జిల్లాల నుంచి కరీంనగర్‌కు పరస్పర బదిలీకి రూ.5 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నారు.

* కరీంనగర్‌ జిల్లా అనంతరం సిద్దిపేట, హన్మకొండ జిల్లాలకు పరస్పర బదిలీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రూ.3 నుంచి రూ.6 లక్షల వరకు బేరాలు జరుగుతున్నట్లు సమాచారం.

* రాజన్న సిరిసిల్ల,పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వచ్చేందుకు అంత మొగ్గు చూపకున్నా పరస్పర బదిలీ అవకాశం కోసం రూ.3 లక్షల వరకు డిమాండ్‌ పలుకుతుందని పలువురు ఉపాధ్యాయులే పేర్కొంటున్నారు.

* పెద్దపల్లి జిల్లాలోని ఓ పండిత టీచర్‌ కరీంనగర్‌కు పరస్పర బదిలీపై వచ్చేందుకు రూ.6 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం.

*  ఒకే జిల్లాలోస్పౌజ్‌ కేటగిరిలో నియామకమైన సుల్తానాబాద్‌ మండలంలోని ఓ ఉపాధ్యాయుడు పరస్పర బదిలీపై ఇక్కడికి వచ్చే కరీంనగర్‌ జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడి నుంచి రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని