logo

రహదారులపై యమగండాలు

సిరిసిల్ల-సిద్దిపేట రహదారిలో తంగళ్లపల్లి మండలం నేరెళ్ల-జిల్లెల్ల మధ్య రహదారిలో ప్రమాదకరమైన మలుపులున్నాయి. ఈ రహదారిపై ఏడు నెలల క్రితం ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులు మూలమలుపు వద్ద అదుపుతప్పి

Published : 23 Jan 2022 02:25 IST

ప్రమాదాల్లో రాష్ట్రంలో  జిల్లా రెండోస్థానం

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

ఇరుకుగా ఉన్న వెంకట్రావ్‌పల్లిలోని మూడు రహదారుల కూడలి

* సిరిసిల్ల-సిద్దిపేట రహదారిలో తంగళ్లపల్లి మండలం నేరెళ్ల-జిల్లెల్ల మధ్య రహదారిలో ప్రమాదకరమైన మలుపులున్నాయి. ఈ రహదారిపై ఏడు నెలల క్రితం ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులు మూలమలుపు వద్ద అదుపుతప్పి పడిపోయారు. లక్ష్మి తలకు తీవ్రగాయమైంది. ఇప్పటి వరకు వైద్యానికి రూ.20 లక్షలు ఖర్చు చేసినా కోలుకోలేదు.

* వేములవాడ-చందుర్తి రహదారిలో హన్మాజీపేట మూలమలుపు వద్ద ఏడాది క్రితం నిమ్మపల్లికి చెందిన యువకుడు సంజీవ్‌ వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంజీవ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ రహదారిపై ఎక్కడా వేగనిరోధకాలు, ప్రమాద సూచీలు లేవు. వాహన వేగాలకు అదుపు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కొడుకు కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రులకు తీరని వేదనను మిగిల్చింది.

జిల్లాలోని రహదారుల వెంట ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. కొందరు మృత్యువాత పడుతున్నారు. మరికొందరు దివ్యాంగులుగా మారుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారులపై జరిగిన అధ్యయనంలో జిల్లాలో 29 శాతం ప్రమాదాలు పెరిగాయి. ఈ లెక్కన రాష్ట్రంలో జిల్లా రెండోస్థానంలో ఉంది. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. వీటిలో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణంలోనే ఎక్కువగా ఉంది. ప్రధాన రహదారులు, పట్టణాల్లో డ్రంకైన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మితిమీరిన వేగాన్ని పసిగట్టేందుకు స్పీడ్‌గన్‌ను ఉపయోగించి పర్యవేక్షిస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంత రహదారులు కనీసం నిర్వహణ, పర్యవేక్షణ లేక ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయి.

నిర్వహణకు నిధుల్లేక...

జిల్లా వ్యాప్తంగా 18 చోట్ల ప్రమాదకర ప్రాంతాలను రవాణా, పోలీసుశాఖలు గుర్తించాయి. గడిచిన ఏడాదిలో ప్రజల్లో సొంత వాహనాల వినియోగం పెరిగింది. ఫిబ్రవరిలో మేడారం జాతర ఉంది. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి జిల్లాలోని రాజన్న దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కరీంనగర్‌, సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల మీదుగా వాహనాల రాకపోకలతో రహదారులు రద్దీగా మారాయి. రోడ్లు ప్రమాదకరంగా ఉన్న చోట కనీస జాగ్రత్తలు ఊసేలేదు. పట్టణంలో సిరిసిల్ల-కామారెడ్డి రహదారిలోని ప్రధాన కూడళ్ల వద్ద కనీసం జీబ్రాక్రాసింగ్‌లు లేవు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని పోలీసుశాఖ నుంచి రహదారులు, భవనాలశాఖకు నివేదికలు వెళ్తున్నా నిధుల లేమితో వాటిని పక్కన పెడుతున్నారు. దీంతో ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

నేరెళ్లలోని మూలమలుపు

మార్పు తీసుకొస్తున్నాం - రాహుల్‌ హెగ్డే, ఎస్పీ

రహదారులపై ప్రమాదాల నివారణకు ఎన్‌ఫోర్స్‌మెంటు బృందంతో తనిఖీలు చేపడుతున్నాం. జిల్లాలో ప్రధాన రహదారులపై వెళ్లేటప్పుడు ఏ వైపు వెళ్లేవారు అదే వరుసలో వెళ్లాలి. రహదారిపై ప్రయాణంలో నిబంధనలు పాటించేలా మార్పు తీసుకొస్తున్నాం. జిల్లాలో తరచూ డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు, వేగాన్ని నియంత్రించేలా తనిఖీలు చేపడుతున్నాం. ప్రమాదాలు ఎక్కువగా జరిగే గ్రామీణ పోలీస్‌స్టేషన్ల పరిధిలో వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని మద్యం తనిఖీలు విస్తృతంగా నిర్వహించాలని దిగువ స్థాయి అధికారులకు సూచించాం.

ప్రమాదకర ప్రాంతాలివే...

సిరిసిల్ల పట్టణంలో రగుడు, పాతబస్టాండ్‌ కూడలిలో ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ కాలిబాటలో వెళ్లేవారు రోడ్డు దాటేందుకు ప్రత్యేక జీబ్రాక్రాసింగ్‌లు లేవు. అసలు సిరిసిల్ల పట్టణంలో ఎక్కడా రహదారి భద్రతను పాటించేలా సూచికలు కనిపించవు. రహదారి విస్తరణ పనులు జరిగి మూడేళ్లు పూర్తయినా కనీస జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. సిరిసిల్ల-కామారెడ్డి రహదారిలో సర్దాపూర్‌, పెద్దూరు, ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి వద్ద రహదారి ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగతున్నాయి.

* వేములవాడలో ఆరెపల్లి, సంకెపల్లి బస్టాండ్‌లు, రెండవ బాహ్యవలయ రహదారి, శాత్రాజుపల్లి, నాంపల్లి వద్ద మూడు రహదారుల కూడలి ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ ఎలాంటి సూచికలు ఉండవు. కరీంనగర్‌ నుంచి వచ్చే వాహనాలు వేములవాడకు వెళ్లేలా సూచికలు లేవు. రహదారి విభాగిని లేకపోవడంతో రాత్రి సమయంలో ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. శివరాత్రి జాతర సమయంలో మాత్రం పోలీసు చెక్‌పోస్టును ఏర్పాటు చేసి తర్వాత వదిలేస్తారు.

* సిరిసిల్ల-సిద్దిపేట రహదారిలో తంగళ్లపల్లి మండలం నేరెళ్ల-జిల్లెల్ల, తంగళ్లపల్లి శివారు పెద్దమ్మనగర్‌లో ఆరు ప్రమాదకర మూల మలుపులున్నాయి.

* చందుర్తి మండలం లింగన్నపేట, కోనరావుపేట మండలం మల్కపేట వద్ద మూలమలుపు వంపు ఎక్కువగా ఉంది. వాహనాల వేగాన్ని నిరోధించేలా రహదారిపై ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేవు.

* బోయినపల్లి మండలం కొదురుపాకలో మూడు రహదారుల కూడలి నుంచి నాలుగు వరుసల వంతెన రహదారి ప్రారంభమయ్యే చోట రోడ్డు విస్తారంగా ఉంది. కానీ ఏ వైపు నుంచి వచ్చే వాహనాలు ఎలా వెళ్లాలనే మార్జిన్లు గానీ, సూచికలు గానీ లేవు. వెంకట్రావ్‌పల్లి మూడు రహదారుల కూడలి ఇరుకుగా ఉండటం వాహనాలు సాఫీగా వెళ్లలేని పరిస్థితి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని