logo

కథలు విందాం.. వికాసానికి బాటలు వేద్దాం

నేటి తరం పుస్తక పఠనానికి దూరమవుతోంది. పుస్తకమంటే వారి దృష్టిలో పాఠ్యపుస్తకాలే.. సెల్‌ఫోన్‌ గేమ్స్‌లో మునిగి తేలుతున్నారు. కరోనా కాలంలో మరింత ఎక్కువయింది. ఇది పిల్లల విజ్ఞానం, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అందుకే కొందరు తల్లిదండ్రులు ఈ వేసవి సెలవుల్లో నాలుగు కొత్త విషయాలు తెలుసుకునేలా..నైతిక విలువలు తెలిసేలా శిక్షణ శిబిరాలకు పంపించారు.  కథలు చదవడం, వినడం

Published : 25 May 2022 02:39 IST

కథా శిబిరంలో పాల్గొన్న చిన్నారులు

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: నేటి తరం పుస్తక పఠనానికి దూరమవుతోంది. పుస్తకమంటే వారి దృష్టిలో పాఠ్యపుస్తకాలే.. సెల్‌ఫోన్‌ గేమ్స్‌లో మునిగి తేలుతున్నారు. కరోనా కాలంలో మరింత ఎక్కువయింది. ఇది పిల్లల విజ్ఞానం, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అందుకే కొందరు తల్లిదండ్రులు ఈ వేసవి సెలవుల్లో నాలుగు కొత్త విషయాలు తెలుసుకునేలా..నైతిక విలువలు తెలిసేలా శిక్షణ శిబిరాలకు పంపించారు.  కథలు చదవడం, వినడం వల్ల పిల్లల్లో మానసిక వికాసం కలుగుతుంది. వారిలో సృజనాత్మక భావనలు, వాగ్దాటి పెంపొందుతాయని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు వేసవి సెలవులను వృథా చేసుకోకుండా నైపుణ్యాలను పెంచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

కలిసొచ్చిన వేసవి శిక్షణ శిబిరాలు
వేసవి సెలవుల్లో చిన్నారులకు విజ్ఞానం పెంచడంతో పాటు వినోదాన్ని అందిస్తూ నైతిక విలువలు బోధించడమే లక్ష్యంగా కొన్ని సంస్థలు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశాయి. సేవా భారతి ఆధ్వర్యంలో సంస్కార సాధన, వికాస తరంగిణి ప్రజ్ఞా తరగతులు నిర్వహించారు. యోగా, భజనలు, సంస్కృతం, వేద గణితం, చిత్రలేఖనంతో పాటు కథా కాలం పేరుతో ప్రముఖుల జీవిత చరిత్రలను కథలుగా చెప్పించారు.


ఉన్నత విలువలతో జీవించడం నేర్చుకున్నా
- తడిగొప్పుల శ్రీకర్‌, పద్మానగర్‌

సేవా భారతి నిర్వహించిన వేసవి శిబిరం ప్రతి రోజు మహనీయుల జీవిత కథలు విన్నా. ఉన్నత స్థానానికి ఎలా ఎదిగారన్నది చక్కగా వివరించారు. ఆ జీవిత కథలు వినడం వల్ల సమాజంలో ఉన్నత విలువలతో ఎలా జీవించవచ్చో నేర్చుకున్నా. భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవడానికి కావాల్సిన మానసిక సంసిద్ధత అలవడింది. యోగా, వేదగణిత, శ్లోకాలు, గేయాలు, భజనలు, సంస్కృతం లాంటి శిక్షణ ధారణతో పాటు క్రమ శిక్షణ నేర్చుకున్నా.


గుడి, బడిలో కథలు పుస్తకాలు చదువుతా
-కె.చిన్మయి, రాంనగర్‌

సాయంత్రం రాంనగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయ హాలులో ఎన్నో కథల పుస్తకాలకు నిలయం. కిషన్‌ సారు మాకు నిత్యం చక్కటి కథలు వినిపిస్తారు. కథలను చదివేందుకు పుస్తకాలు ఇస్తారు. బడి, గుడిలో చదివిన మంచి కథలు తోటి వారికి చెబుతారు. ఇలా ఒకరికొకరం కథలు చెప్పుకుంటూ ఆనందిస్తాం.


ధైర్య సాహసాలు అలవర్చుకున్నా
- బేతి దేవిశ్రీ, 9వ తరగతి, కరీంనగర్‌

బాల సంస్కార్‌ శిక్షణ శిబిరానికి క్రమం తప్పకుండా వెళ్లాను. దేశభక్తుల జీవిత చరిత్ర చెప్పారు. ధైర్య సాహసాలు ఎలా అలవర్చుకోవాలో రెండు వారాల్లోనే నేర్పించారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. దేవతల కథలు ఆసక్తిని పెంచాయి. ఈ శిబిరంలో శుభోదయం, నమస్కారం అనే పదాలు ఈ శిబిరంలోనే మొదటిసారిగా అలవాటు చేసుకున్నా. సంస్కృతి, సంప్రదాయాలతో పాటు వినూత్న ఆటలు, పాటలు, వేద గణితం నాకు మానసిక బలాన్నిచ్చాయి.


చిన్నతనం నుంచే..
- గాజుల ప్రీతి వర్షిణి,  8వ తరగతి

సంస్కార వారిధి నిర్వహిస్తున్న నైతిక విలువల శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నా. ఎన్నో నీతి కథలు వింటున్నాం. కథలు చెప్పడంలో నేనూ, మా చెల్లెలు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాం. చిన్నతనం నుంచే మంచి అలవాట్లు అలవర్చుకోవాలనే భావాలు పెంచుకోవాలని నేర్పించాయి. ఆచార్యులు చెబుతున్న కథలతో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. భగవద్గీత శ్లోకాలు, పద్యాలు క్రమశిక్షణ అంశాలు ఎన్నో నేర్చుకుంటున్నాం.


నైతిక విలువలకు బాటలు
- చామ మహేశ్వర్‌, కన్వీనర్‌, సేవా భారతి

ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు పాఠ్యాంశాలకే పరిమితమవుతున్నారు. భవిష్యతు తరాలకు నైతిక విలువలు తెలియజేయాల్సి ఉంది. పాత తరం నాటి నీతి, పంచతంత్ర కథల్లో వినోదంతో పాటు నైతికత ఉంటుంది. పెద్దలను గౌరవించడం, మంచి నడవడిక అలవర్చుకోవడం, ఏకాగ్రత సాధన వంటి అంశాలు బాల్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే వేసవి శిబిరంలో పిల్లల ఎదుగుదలకు దోహదపడే విధంగా శిక్షణ కార్యక్రమాలు డిజైన్‌ చేసి నేర్పించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని