logo

నిర్మించిన కొన్నాళ్లకే కూలుతున్నాయి..!

ఇది.. కరీంనగర్‌ గ్రామీణ మండలం చామన్‌పల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ దుస్థితి. నిర్మించి పట్టుమని ఐదేళ్లుకూడా  కాలేదు.  ఇలా నేలమట్టమైంది. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకే ఇలా తడిసి ఒకవైపునకు కూలిపోయింది. అదృష్టవశాత్తు

Published : 07 Jul 2022 03:03 IST

ఆగమాగం పనులతో తప్పని అవస్థలు

ఈనాడు, కరీంనగర్‌

ఇది.. కరీంనగర్‌ గ్రామీణ మండలం చామన్‌పల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ దుస్థితి. నిర్మించి పట్టుమని ఐదేళ్లుకూడా  కాలేదు.  ఇలా నేలమట్టమైంది. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకే ఇలా తడిసి ఒకవైపునకు కూలిపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో దీని చెంతన ఎవరు లేకపోడంతో ముప్పు తప్పింది. దాదాపుగా రూ.8 లక్షల వరకు దీని కోసం వెచ్చించారు. గతేడాదిలోనే ఈ ఆస్పత్రిని ప్రారంభించారు. లోపలి భాగంలో మొరం ఎత్తుగా పోయడం.. ఇవతలి వైపున అదే స్థాయిలో మట్టి లేకపోవడంతో కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు నాణ్యత లోపం వల్లనే ఇలా ఇది నేలకు ఒరిగిపోయిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది వానకాలంలోనూ వీణవంక మండలం ఎలబాక గ్రామంలో వైకుంఠధామం ప్రహరీ కూడా ఇదే తరహాలో కూలిపోయి నామరూపాలు లేకుండా పోయింది. తరువాత మళ్లీ కొన్నాళ్లకు కూలినదాన్ని కొత్తగా నిర్మించారు. ఇదే తరహాలో కొండపాక సమీపంలోని వాగు చెంతన నిర్మించిన వైకుంఠధామం ప్రహరీ కూడా కుప్పకూలింది. లక్షలాది రూపాయల్ని పెట్టి నిర్మించే వాటి విషయంలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ప్రజల పైసలు ప్రతి ప్రజాప్రయోజనానికి పక్కాగా ఉపయోగపడాలనే ఆకాంక్షలు కొన్ని అభివృద్ధి పనుల విషయంలో నెరవేరడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం.. మొక్కుబడి నిర్మాణాలతో ఎదురవుతున్న శాపాల కారణంగా పలు నిర్మాణాలు లోపభూయిష్టంగా ఉంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆయా శాఖల పర్యవేక్షణలో సాగుతున్న పలు పనుల్లో డొల్లతనం ఇట్టే బయటపడుతోంది. గతంలో బీటీ రహదారులు, సీసీ రోడ్ల విషయంలోనే నాణ్యత ప్రమాణాల్లో వైఫల్యం ఉన్నట్లు కనిపించేది. ఇటీవల మాత్రం భవనాల నిర్మాణాలు, ప్రహరీలు ఇతరత్రా అన్ని పనుల ప్రగతిలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో శాశ్వత ప్రయోజనాల్ని అందించే వాటి విషయంలో ఏదో కట్టామంటే.. కట్టామనే ధోరణి కనిపిస్తోంది. ఏళ్ల తరబడి మన్నికతో ఉండాల్సినవన్ని ఐదేళ్ల నుంచి దశాబ్ద కాలానికి కాలం చెల్లిన వాటి జాబితాలో చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

నామమాత్రంగానే తనిఖీలు..!
ప్రతి పనిని ఆయా దశల వారీగా పురోగతి సమయంలోనే ఇంజినీరింగ్‌ అధికారులు పక్కాగా పర్యవేక్షించాలి. కాని చాలా చోట్ల ఈ ప్రక్రియ సజావుగా కొనసాగడం లేదు. పైగా పని పూర్తయ్యాక మాత్రం పైపైన మెరుగుల్ని చూసి బాగుందనేలా బిల్లులను అందిస్తుండటం రివాజుగానే మారిపోయింది. మరోవైపు ఆయా మండలాల వారీగా ఒకే గుత్తెదారు ఐదారుచోట్ల పనుల్ని చేపడుతుండటం.. వేగంగా చేయాలనేలా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ చేస్తుండటంతో నాణ్యత విషయంలో రాజీపడే పరిస్థితులు కొన్నిచోట్ల కనిపిస్తున్నాయి. ఇక పని నాణ్యతను పరిశీలించాల్సిన క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు వారి బాధ్యతను పక్కాగా నిర్వర్తించడంలో లోపాలుంటున్నాయనే మాటలు  వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల పనులను పరిశీలించకుండానే ధ్రువీకరణల్ని అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిర్మాణ సమయంలో సరైన విధంగా కాంక్రీట్‌, సిమెంట్‌, ఇసుకల కలయిక లేకపోవడంతో ఇష్టానుసారమనే తీరుని కొందరు గుత్తేదారులు చేతల్లో చూపిస్తున్నారు. కరీంనగర్‌లో కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్న స్మార్ట్‌సిటీ పనుల్లోనూ నాణ్యత లేకుండా జరుగుతున్నాయని ప్రతిపక్షాల కార్పొరేటర్లు ఆందోళనలు చేయడంతోపాటు కలెక్టరుకు ఫిర్యాదులిచ్చారు. ఇక గతేడాది జిల్లా వ్యాప్తంగా వాగులపై ఒక్కొక్కటి రూ.4 నుంచి రూ.9కోట్ల వరకు నిర్మించిన చెక్‌డ్యామ్‌లు కూడా నాణ్యతా లోపంతో వరద నీళ్లల్లో కొట్టుకుపోయాయి. నిధులన్ని నీళ్లపాలయ్యాయి. ప్రజల సొమ్ముతో నిర్మించే పనుల విషయంలో ఇకనైనా సంబంధిత అధికారులు తగు దృష్టిని సారించడంతోపాటు నాణ్యత ప్రమాణాలపై నిఘా మరింతగా పెరగాల్సిన అవసరముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని