logo

ఇక పాఠశాలల్లో వేలిముద్రతో హాజరు

ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్‌ విధానంలో హాజరు నమోదుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దాదాపు రెండేళ్ల పాటు రెండేళ్లుగా మూలన పడిన పరికరాల మనుగడపై గత జూన్‌లో క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించారు.

Updated : 19 Aug 2022 05:31 IST
వినియోగంలోకి రానున్న బయోమెట్రిక్‌ పరికరాలు
25లోగా మరమ్మతులు పూర్తి.. 1 నుంచి అమలు!
పాడయిన బయోమెట్రిక్‌ పరికరం

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్‌ విధానంలో హాజరు నమోదుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దాదాపు రెండేళ్ల పాటు రెండేళ్లుగా మూలన పడిన పరికరాల మనుగడపై గత జూన్‌లో క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించారు. వినియోగం లేక చాలా చోట్ల పరికరాలు పనికి రాకుండా పోయాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వాటికి మరమ్మతులు చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఈ నెల 16 నుంచి 25 వరకు మండలాల్లో ఒక చోట మెకానిక్‌లు వచ్చి మరమ్మతు చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో జిల్లాలోని పాఠశాలల్లో బయోమెట్రిక్‌ పరికరాలు తిరిగి వినియోగంలోకి రానున్నాయి. సెప్టెంబరు 1 నుంచి వేలిముద్రల ద్వారా హాజరు విధానం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

మూలన పడిన పరికరాలు

కొవిడ్‌ ఉద్ధృతితో దాదాపు రెండేళ్లు పాఠశాలలు తెరుచుకోలేదు. ఆన్‌లైన్‌లో పాఠాలు కొనసాగాయి. గతేడాది సెప్టెంబరు నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నా పాత పద్ధతిలోనే హాజరు విధానం అమలవుతోంది. కాగా నెలల తరబడి బయోమెట్రిక్‌ పరికరాలు మూలన ఉండటంతో పాడయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో బయోమెట్రిక్‌ విధానాన్ని తిరిగి ప్రారంభించేందుకు పాఠశాలల్లో పరికరాల వాస్తవ పరిస్థితిపై సమాచారం సేకరించారు. ఇందులో అత్యధికంగా పని చేయడం లేదని తేలింది.

మండల స్థాయిలో మరమ్మతు

బయోమెట్రిక్‌ పరికరాలను మండల స్థాయిలో మరమ్మతు చేసేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం అమలవుతున్న 14 జిల్లాల్లో పరికరాల మరమ్మతుకు మంగళవారం ఉత్తర్వులు అందాయి. జిల్లాలో 632 అడాప్టర్లు, 409 యాంటెన్నాలు, 431 ప్లగ్స్‌ ప్లేల్లు పాడయ్యాయి. వీటన్నింటినీ మరమ్మతు చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలో 1,383, ఆంగ్ల మాధ్యమంలో 30,120, ఉర్దూ మాధ్యమంలో 800 మంది విద్యార్థులు చదువుతుండగా, 2,274 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.

బోగస్‌ హాజరుకు చెక్‌

సర్కారు బడుల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. స్థానికంగా నివాసం ఉండకుండా దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో సమయానికి హాజరు కావడం లేదన్న ఆరోపణలున్నాయి. సకాలంలో విధులకు హాజరు కాకున్నా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయంతో మరుసటి రోజు హాజరు రిజిస్టరులో సంతకాలు చేసుకుంటున్నారనే ఫిర్యాదులు విద్యాశాఖ దృష్టికి వెళ్లాయి. దీంతో బోగస్‌ హాజరు విధానానికి అడ్డుకట్ట వేసేందుకు 2018లో బయోమెట్రిక్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. దాదాపు రెండేళ్ల పాటు వేలిముద్రల విధానంలో హాజరు నమోదు అమలైంది. 2020 మార్చిలో కొవిడ్‌ కారణంగా రద్దయింది.

ఆదేశాలు వచ్చాయి: విజయ్‌కుమార్‌, సమగ్ర శిక్ష జిల్లా  సమన్వయకర్త

జిల్లాలోని పాఠశాలల్లో బయోమెట్రిక్‌ పరికరాలకు మరమ్మతు చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఈ నెల 25 వరకు పాత మండలకేంద్రాలకు వాటిని తీసుకెళ్లాలి. మరమ్మతు పూర్తయిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలో బయోమెట్రిక్‌ విధానం అమలులోకి వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని