logo

ఇసుక దందా ఆగేనా..!

జగిత్యాల జిల్లాలో ఇసుక దందా మళ్లీ మొదలైంది. ఇప్పటికే పలువురు గోదావరి తీర గ్రామాల్లో పెద్దమొత్తంలో ఇసుక నిల్వలను ఏర్పాటు చేసుకొని అక్రమంగా తరలిస్తున్నారు. జిల్లాలోని ధర్మపురి, బీర్‌పూర్‌, రాయికల్‌, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం

Published : 29 Sep 2022 04:53 IST

పల్లెల్లో అక్రమ నిల్వలు
న్యూస్‌టుడే, ధర్మపురి


తీర గ్రామంలో ఇసుక నిల్వలు

జగిత్యాల జిల్లాలో ఇసుక దందా మళ్లీ మొదలైంది. ఇప్పటికే పలువురు గోదావరి తీర గ్రామాల్లో పెద్దమొత్తంలో ఇసుక నిల్వలను ఏర్పాటు చేసుకొని అక్రమంగా తరలిస్తున్నారు. జిల్లాలోని ధర్మపురి, బీర్‌పూర్‌, రాయికల్‌, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం తదితర తీరప్రాంత గ్రామాల్లోంచి పట్టణాలకు ఇసుక ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ, రవాణా శాఖాధికారులు నిఘా ఏర్పాటు చేయకపోవడంతో అక్రమార్కులు తమ దందాను కొనసాగిస్తున్నారు. తీరప్రాంతాల్లో ప్రభుత్వమే ఇసుక రీచ్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు మోక్షం కలగడం లేదు. ఉదయం మామూలుగానే ఉండగా రాత్రి సమయంలో ధర్మపురి ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఇసుక ట్రాక్టర్లు తరలుతున్నాయి. గోదావరి నీటిమట్టం బాగానే ఉండటంతో ముందుగానే కుప్పలుగా పోసుకున్న నిల్వల నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. ఈ కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న అనంతరం పైస్థాయి నుంచి ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. దీంతో మండల స్థాయి అధికారులు సైతం తమకెందుకులే అనే ధోరణిలో ఉంటున్నారు. తీరప్రాంత మండలాల్లోని ఒక్కో గ్రామంలో సుమారుగా 100కు పైగా ఇసుక కుప్పలు ఉన్నాయి. ఇలా నిలువ ఉంచిన ఇసుకకు ఇష్టారాజ్యంగా ధర పెంచుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇసుక ట్రాక్టర్లను అతి వేగంగా, అజాగ్రత్తగా నడుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

గతంలో ఇసుక ట్రాక్టర్లు ఢీ కొట్టడంతో పలువురు గాయాల పాలవగా, ఒకరిద్దరు మృత్యువాత పడిన ఘటనలున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరముంది. ఇసుక అక్రమ రవాణా విషయాన్ని ‘న్యూస్‌టుడే’ ఎస్సై కిరణ్‌ కుమార్‌ దృష్టికి తీసుకువెళ్లగా ధర్మపురి మండలంలో నుంచి ఇసుక రవాణా పూర్తిగా తగ్గిందన్నారు. ప్రభుత్వ పనులకు మాత్రమే ఆన్‌లైన్‌ ద్వారా అనుమతులు ఇస్తున్నారన్నారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.


దొంతాపూర్‌ మార్గంలో దెబ్బతిన్న రహదారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని