logo

ఇరు పార్టీల మధ్య ‘ఇసుక’ దుమారం

ఇసుక రీచ్‌ల నిర్వహణపై నేతల పరస్పర ఆరోపణల నేపథ్యంలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఎన్నికలకు ఏడాది ముందే రాజకీయం వేడెక్కింది. శాసనసభ్యుడు దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావుల మధ్య సవాళ్ల పర్వం ఉద్రిక్తతలకు దారి తీసింది.

Published : 03 Oct 2022 04:59 IST

పెద్దపల్లిలో వేడెక్కిన రాజకీయం


ఓదెల మల్లన్న ఆలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే విజయరమణారావును
అదుపులోకి తీసుకుంటున్న ఏసీపీ సారంగపాణి

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి: ఇసుక రీచ్‌ల నిర్వహణపై నేతల పరస్పర ఆరోపణల నేపథ్యంలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఎన్నికలకు ఏడాది ముందే రాజకీయం వేడెక్కింది. శాసనసభ్యుడు దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావుల మధ్య సవాళ్ల పర్వం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఓదెల ఆలయంలో విజయరమణారావును పోలీసులు అరెస్టు చేసి ధర్మారం ఠాణాకు తరలించిన అనంతరం సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పెద్దపల్లిలోని ఇంటి నుంచి ఓదెలకు బయల్దేరుతుండగా ఎస్సై రాజేశ్‌ ఆధ్వర్యంలో గృహ నిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో తెరాస, కాంగ్రెస్‌ శ్రేణులు పెద్దపల్లి, సుల్తానాబాద్‌, కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల, జూలపల్లి, ఎలిగేడు మండలాల్లో వేర్వేరుగా దిష్టిబొమ్మల దహనాలు, రాస్తారోకోలు చేపట్టారు.

పరస్పర ఆరోపణలు
మానేరు పరీవాహక ప్రాంతాలైన సుల్తానాబాద్‌, ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌ మండలాల్లో మూడేళ్లుగా రాష్ట్ర గనుల శాఖ ఆధ్వర్యంలో ఇసుక రీచ్‌లు నిర్వహిస్తున్నారు. వీటిని నిర్వహించే గుత్తేదారుల నుంచి శాసనసభ్యుడు మనోహర్‌రెడ్డి పెద్దఎత్తున ముడుపులు తీసుకున్నారని కాంగ్రెస్‌ నేత విజయరమణారావు ఆరోపిస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే సైతం ఇసుక రీచ్‌ల వద్దకు అనుచరులతో వెళ్లి గుత్తేదారుల నుంచి ముడుపులు తీసుకుంటున్నారని మనోహర్‌రెడ్డి ఆరోపించారు.

మాటల యుద్ధం.. ప్రజలకు ఇబ్బందులు
రీచ్‌ల నుంచి ఇసుక తరలించే వాహనాల రాకపోకలతో ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, సుల్తానాబాద్‌ మండలాల్లో రహదారులు దెబ్బతింటున్నాయి. గుంతలమయమైన రహదారులపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజల వినతులను గుత్తేదారులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో విజయరమణారావు ఇటీవల ఓదెల మండలం మడక నుంచి గుంపుల వరకు పాదయాత్ర నిర్వహించారు. సెప్టెంబరు 26న పొత్కపల్లిలో మాట్లాడుతూ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. అక్టోబరు 2న ఎమ్మెల్యే ఓదెల మల్లికార్జున ఆలయంలో శివలింగంపై ప్రమాణం చేసి ఇసుక ముడుపుల వ్యవహారంలో చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. అప్పటి నుంచి తెరాస, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సామాజిక మాధ్యమాల్లో రెండు పార్టీల అనుచరులు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. మరోవైపు రీచ్‌ల వద్ద ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. నేతల సవాళ్లు, ప్రతి సవాళ్ల మాటేమో గానీ మానేరు పరీవాహక గ్రామాల ప్రజలకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని