logo

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం బోయినపల్లి మండలం కొదురుపాక వంతెన వద్ద చోటు చేసుకుంది.

Published : 03 Oct 2022 04:59 IST

ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు


బాలయ్య

బోయినపల్లి, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం బోయినపల్లి మండలం కొదురుపాక వంతెన వద్ద చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తిమ్మాపూర్‌ మండలం నల్లగొండకు చెందిన ఎడెల్లి బాలయ్య, కవ్వంపల్లి కొమురయ్య తిమ్మాపూర్‌లోని ఓ కళాశాలలో సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. వేములవాడకు పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై వచ్చారు. పని ముగించుకుని తిమ్మాపూర్‌ వెళుతుండగా కొదురుపాక నాలుగు వరుసల వంతెన వద్దకు చేరుకోగానే కామారెడ్డి నుంచి కరీంనగర్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనకాల నుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో బాలయ్య, కొమురయ్యలు కిందపడిపోయారు. బాలయ్య తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా కొమురయ్యకు తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో చికిత్స నిమిత్తం కరీంనగర్‌ తరలించారు. బాలయ్యకు భార్య బాలమ్మ, కూతురు, కుమారుడు ఉన్నారు. ఏఎస్సై చంద్రమౌళి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాలయ్య మృతదేహాన్ని సిరిసిల్ల ఆసుపత్రికి శవపరీక్ష కోసం తరలించారు.


ప్రాణం తీసిన అతి వేగం

ద్విచక్రవాహనం అదుపు తప్పి యువకుడు మృతి


వినయ్‌

జూలపల్లి(సుల్తానాబాద్‌), న్యూస్‌టుడే: ద్విచక్రవాహనాన్ని అతి వేగంగా నడుపుతున్న యువకుడు అదుపు తప్పి కింద పడి మృతి చెందిన ఘటన జూలపల్లి మండలం బాల్‌రాజ్‌పల్లి సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై వెంకటకృష్ణ, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం కాచాపూర్‌ గ్రామానికి చెందిన బట్టు వినయ్‌(20) ఇంటర్‌ పూర్తి చేసి వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. శనివారం సాయంత్రం స్నేహితుడి ద్విచక్రవాహనం తీసుకొని మరో స్నేహితుడు మధూకర్‌తో కలిసి వెళ్లాడు. కాచాపూర్‌ నుంచి కుమ్మరికుంట వరకు వెళ్లి తిరిగి వస్తుండగా బాల్‌రాజ్‌పల్లి సమీపంలోని మలుపు వద్ద అతివేగంతో వాహనం అదుపు తప్పింది. రహదారి పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టడంతో వినయ్‌ తలకు గాయమై తీవ్ర రక్త స్రావమైంది. కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాంలో మధూకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి తండ్రి రవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


చెరువులో మునిగి వ్యక్తి...

బుగ్గారం న్యూస్‌టుడే : బతుకమ్మ పండగ కోసం తామర పూలను తెంపేందుకు చెరువులోకి వెళ్లిన ఓ వ్యక్తి అందులో మునిగి చనిపోయిన సంఘటన బుగ్గారం శివారులో ఆదివారం చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ నర్సింగరావు సమాచారం మేరకు బుగ్గారం గ్రామానికి చెందిన కస్తూరి రవి(40) కొద్ది సంవత్సరాలుగా గొల్లపల్లి మండలం మల్లన్నపేటలో నివాసముంటున్నాడు. బతుకమ్మ పండుగ ఉండటంతో రవి తన కుమారుడు చంద్రశేఖర్‌తో కలిసి ఆదివారం పూల కోసం బుగ్గారం శివారులోని బోయినకుంట వద్దకు వచ్చాడు. పూలు తెంపేందుకు చెరువులో దిగాడు. మొక్కలకు సంబంధించిన తీగలు కాళ్లకు చుట్టుకోవడంతో నీళ్లలో మునిగి మృతి చెందాడు. తండ్రి చెరువులో నుంచి ఎంతకు రాకపోవడంతో గట్టుపైన ఉన్న చంద్రశేఖర్‌ ఇంటికి వెళ్లి తల్లికి తెలిపాడు. గ్రామస్థుల సహాయంతో మృతదేహాన్ని బయటికి తీశారు. రవికి కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుడి భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని