logo

లోలెవల్‌ వంతెలకు మోక్షమేది?

వానకాలం వచ్చిందంటే ధర్మపురి-జగిత్యాల రహదారి మధ్యన రెండు లోలెవల్‌ వంతెనలపై రాకపోకలు నిలిచిపోతూ ప్రజలకు అసౌకర్యంగా మారుతున్నాయి. ఏటా వానకాలంలో ఆరు నెలల్లో ఈ రహదారి పరిధిలోని మూడు జిల్లాలకు వెళ్లాల్సిన ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు.

Published : 05 Oct 2022 05:16 IST

వానకాలంలో ఏటా కడగండ్లే


వర్షాలకు వరద రోడ్డెక్కి ప్రవహించే నేరెళ్లగుట్ట ప్రాంతం

న్యూస్‌టుడే, ధర్మపురి: వానకాలం వచ్చిందంటే ధర్మపురి-జగిత్యాల రహదారి మధ్యన రెండు లోలెవల్‌ వంతెనలపై రాకపోకలు నిలిచిపోతూ ప్రజలకు అసౌకర్యంగా మారుతున్నాయి. ఏటా వానకాలంలో ఆరు నెలల్లో ఈ రహదారి పరిధిలోని మూడు జిల్లాలకు వెళ్లాల్సిన ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు. నిజామాబాద్‌-జగ్ధల్‌పూర్‌ 63 జాతీయ రహదారిపై జగిత్యాల వరకు వంతెలన్నీ నూతనంగా నిర్మించారు. ధర్మపురి మార్గంలో మాత్రం రెండు చోట్ల వదిలేశారు. దీంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ధర్మపురి మండలంలోని నేరెళ్ల ఆకుసాయిపల్లె గుట్ట వద్ద లోలెవల్‌ వంతెన ఉంది. ఎగువ ప్రాంతాలైన బట్టపల్లి, సారంగాపూర్‌, నేరెళ్ల తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడిందంటే గంటలోపు నీరంతా ఇక్కడికి చేరి వంతెనపై నుంచి ప్రవహించి రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఆగస్టు నుంచి అక్టోబర్‌ వరకు పలుమార్లు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇటీవల పదిమార్లు వారధి వరద నీటిలో మునిగిపోయి, రాకపోకలు నిలిచి పోయాయి. అటు జగిత్యాల, ఇటు ధర్మపురి వైపు రాకపోకలు లేక ప్రజలు ఇబ్బంది పడాల్సిన దుస్థితి నెలకొంది. ఇక్కడ హైలెవల్‌ వంతెన నిర్మించడానికి ప్రతిపాదించారు. దీనికి రూ. కోటి వ్యయం అవుతుందని ప్రతిపాదించినా నిధులు మంజూరు కాలేదు. జగిత్యాల మండలంలోని అనంతారం వంతెన పూర్తిగా తక్కువ ఎత్తులో ఉండటంతో వానాకాలం రాకపోకలు నిలిచి పోతున్నాయి. దీనితో ప్రజలు గంటల తరబడి రహదారిపై ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంటోంది. పురాతన వారధి ఎగువ ప్రాంతంలో నూతన వంతెన నిర్మాణానికి రూ.2 కోట్లతో ప్రతిపాదించారు. నిధులు మంజూరు చేయడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ రెండు వారధులకు నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని