logo

ఆదర్శం.. రూ.1కే అంత్యక్రియల పథకం

‘రూపాయికే అంత్యక్రియల పథకం’ పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో సౌకర్యంగా మారింది. కరీంనగర్‌ నగర పరిధిలో పేదలు, అనాథలు ఎవరు చనిపోయినా సరే నగర పాలిక ద్వారానే రూ.1తో దహన సంస్కారాలు చేస్తున్నారు.

Published : 25 Jan 2023 04:32 IST

స్థానికేతరులకు ప్రయోజనం చేకూరేలా సంస్కరణలు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

‘రూపాయికే అంత్యక్రియల పథకం’ పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో సౌకర్యంగా మారింది. కరీంనగర్‌ నగర పరిధిలో పేదలు, అనాథలు ఎవరు చనిపోయినా సరే నగర పాలిక ద్వారానే రూ.1తో దహన సంస్కారాలు చేస్తున్నారు. ‘రూపాయి’ పథకాన్ని 2019 జూన్‌ 15న ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. స్థానికేతరుల ప్రయోజనార్థ్థం కొత్త సంస్కరణ చేపట్టారు. పూర్తి వివరాలతో కథనం.

కరీంనగర్‌ నగరపాలక అంతిమ యాత్ర వాహనం

గర నివాసి అయి ఉండి తెల్లకార్డు, ఆధార్‌కార్డుతో నగర పాలికకు రూపాయి చెల్లిస్తే అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఒక్కో అంత్యక్రియకు నగరపాలక రూ.10 వేలు గుత్తేదారుకు చెల్లిస్తోంది. వీరితోనే శ్మశానవాటికలో దహనం, ఖననం చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయిస్తారు. ఆయా మతాలు, ఆచారాలకు అనుగుణంగా దహన సంస్కారాలు నిర్వహిస్తారు. వీధుల్లో ఎవరూ చనిపోయినా సరే బాధిత కుటుంబ సభ్యులు స్థానిక కార్పొరేటర్‌, శానిటేషన్‌ జవాన్‌ దృష్టికి తీసుకెళ్తే ఒక రూపాయి తీసుకొని రసీదు ఇస్తారు. అప్పుడు ఆ గుత్తేదారు ఆయా మత సంప్రదాయాల ప్రకారం దహన సంస్కారాలు పూర్తి చేసే ప్రక్రియ మొదలవుతోంది.

రెండేళ్లలో 1,413 మందికి..

రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా రూ.1కే అంత్యక్రియలు నగరపాలక చేపడుతోంది. రెండేళ్లుగా పరిశీలిస్తే 1,413 దహన సంస్కారాలు నిర్వహించింది. అంతకుముందు 1,255 మందికి ఆఖరి సఫర్‌ అందించారు. కొవిడ్‌ సమయంలో అయినవారు చనిపోయిన సరే కనీసం దగ్గరికి వచ్చి చూడని సమయంలో కూడా నగరపాలక ముందుండి భేష్‌ అనిపించుకుంది. ఆ సమయంలో 353 శవాలకు కొవిడ్‌ నిబంధనల ప్రకారం దహన సంస్కారాలు చేశారు.

ఏటా నిధుల కేటాయింపు

అంతిమయాత్ర, దహన సంస్కారాలు చేసేందుకు నగర పాలక సంస్థ ఏటా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తోంది. పథకం ప్రారంభించిన మూడేళ్ల వరకు ఒక్కొక్కరికి రూ.8 వేలు చొప్పున ఇవ్వగా గతేడాది ఏప్రిల్‌ నుంచి రూ.10 వేలు ఇస్తున్నారు. ఇందుకు సాధారణ నిధులు రూ.90 లక్షలు కేటాయించారు.


దహన సంస్కారాలు ఇలా..

హన సంస్కారాలు చేసేందుకు కావాల్సిన వస్తువులన్నీ సదరు గుత్తేదారు తీసుకొచ్చి కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. నగరపాలక రెండు వాహనాలు అంతిమయాత్ర కోసం అందుబాటులో ఉంచింది. ఫ్రీజర్లు కూడా ఉండగా నిర్వహణ లేకపోవడంతో మూలనపడ్డాయి. హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించే అంత్యక్రియలకు 500 కిలోల కర్రలు, ఐదు లీటర్ల కిరోసిన్‌ లేదా సరిపడా ఇంధనం, పాడే, నాలుగు డప్పులు, ఇతర వస్తువులు ఉంటాయి. ముస్లింలకు అయితే గుంత తవ్వడం, కఫాన్‌ సెట్‌, మ్యాట్‌, పూలు ఇతర సామగ్రి ఉంచుతారు. క్రిస్టియన్‌లో గుంత తవ్వడం, శవపేటిక, డప్పులు, ఇతర వస్తువులు ఉంటాయి.


ఎక్కడి వారైనా సరే ధ్రువీకరిస్తే చాలు

జీవనోపాధికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పేదలు అద్దెకు ఉంటుండగా కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారికి అంత్యక్రియలు నిర్వహించడం భారంగా మారుతోంది. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లడానికి నానావస్థలు పడుతున్న విషయాన్ని నగర మేయర్‌ వై.సునీల్‌రావు గుర్తించి పథకంలో మార్పులు చేశారు. ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు ఎక్కడిదైనా సరే అద్దెకు ఉన్న ఇంటి యజమానులతో మాట్లాడి స్థానిక కార్పొరేటర్‌ ధ్రువీకరిస్తారు. జవాన్‌ సంతకం చేసి రూపాయి పథకం వర్తింపజేస్తారు. నగరంలో నివసించే ఇతర ప్రాంతాల పేదలందరికీ ఇది ఎంతో ఉపయోగపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని