logo

అంతా ఇన్‌ఛార్జులే..

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచే ప్రతి విద్యార్థిని తెలుగు, ఆంగ్లం, గణితంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.

Published : 05 Feb 2023 05:03 IST

21 మండలాలకు 8 మంది ఎంఈవోలు

మల్యాల మండల రిసోర్సు కార్యాలయ భవనం

న్యూస్‌టుడే, మల్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచే ప్రతి విద్యార్థిని తెలుగు, ఆంగ్లం, గణితంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. విద్యార్థులకు మెరుగైన బోధనతోపాటు ఎప్పటికప్పుడు ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులకు అనుగుణంగా ఆయా పరీక్షల నిర్వహణలో మండల విద్యాధికారుల పాత్ర చాలా ముఖ్యమైంది. జిల్లాలో 8 మంది మాత్రమే మండల విద్యాధికారులు అదనపు బాధ్యతలపై విధులు నిర్వర్తిస్తున్నారు.

2017 నుంచి నియామకాల్లేవ్‌

ఆయా పాఠశాలల్లో పనిచేసే సీనియారిటీగల ప్రధానోపాధ్యాయులకే ఎంఈవోలుగా బాధ్యతలు అప్పగిస్తుండటం కొన్నేళ్లుగా జరుగుతున్న తీరు. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో పనిచేసే జడ్పీ ఉన్నత పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులకు మాత్రమే ఎంఈవోలుగా పనిచేసే అవకాశాలు మెండుగా ఉండటంతో డీఈవో పర్యవేక్షణలో నడిచే ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులకు ఆ అవకాశం రాకపోవడంతో కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు ఎంఈవో నియామకాలపై నిషేధం ఉన్నందున ఆయా మండలాల్లో పనిచేసే ఎంఈవోలు ఉద్యోగ విమరణ పొందినా, ఇతర ఏ కారణంతోనైనా పోస్టు ఖాళీ అయితే ఆ మండలానికి చెందిన సీనియర్‌ ప్రధానోపాధ్యాయులకు అప్పగించకుండా పక్క మండలానికి చెందిన ఎంఈవోకే అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నెట్టుకొస్తున్నారు.  

మూడు మండలాల బాధ్యతలు ఒక్కరికే..

జిల్లాలోని 18 పాత మండలాలతోపాటు కొత్తగా ఏర్పడ్డ ఎండపెల్లి, భీమారం, బండలింగాపూర్‌ మండలాలను కలుపుకుని 21 మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం 18 మండలాలకుగాను 8 మంది మండల విద్యాధికారులు పనిచేస్తున్నారు. మల్యాల జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేసే ప్రధానోపాధ్యాయుడు మల్యాలతోపాటు పెగడపెల్లి, కొడిమ్యాల ఎంఈవోగా అదనపు బాధ్యతలు నిర్వరిస్తున్నారు. వెల్గటూరు ఎంఈవోకు ధర్మపురి, బుగ్గారం, కోరుట్ల ఎంఈవోకు మేడిపెల్లి, కథలాపూర్‌ ఎంఈవోకు ఇబ్రహీంపట్నం, జగిత్యాల గ్రామీణ ఎంఈవోకు జగిత్యాల అర్బన్‌, సారంగాపూర్‌ ఎంఈవోకు బీర్‌పూర్‌, మెట్‌పెల్లి, మల్లాపూర్‌ మండలాలు అదనంగా అప్పగించారు. రాయికల్‌, గొల్లపెల్లి మండలాలకు మాత్రమే వేర్వేరుగా ఎంఈవోలు విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఒక మండలానికి పూర్తిస్థాయిలో ఎంఈవో పనిచేసేవారు. కొన్నేళ్లుగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తుండటంతో వారు విద్యార్థులకు బోధించే అవకాశం లేకుండాపోయింది. స్థానిక సంస్థల ఆధీనంలో పనిచేసే పాఠశాలలతోపాటు ప్రభుత్వ పాఠశాలలన్నీ జిల్లా విద్యాధికారి పర్యవేక్షణలో ఉన్నప్పటికీ ఎంఈవోలకు ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలలపై మాత్రమే పర్యవేక్షణపై ఉంటుంది. ఇటీవల ప్రభుత్వం మండలంలోని ఓ సీనియర్‌ ప్రధానోపాధ్యాయుడిని నోడల్‌ ఆఫీసర్‌గా నియమించి ప్రాథమిక పాఠశాలలపై ప్రత్యేక పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది.


తొలిమెట్టు, ‘మన ఊరు-మన బడి’ పర్యవేక్షణ వారిదే

ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన తొలిమెట్టు కార్యక్రమంలో పిల్లల పరిజ్ఞానాన్ని పరీక్షిస్తూ.. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన ‘మన ఊరు- మన బడి’ పనుల పర్యవేక్షణ కూడా మండల విద్యాధికారులు చూసుకోవాల్సి ఉంటుంది. వివరాలను ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి నివేదించాలి. జిల్లాలో 188 జడ్పీ ఉన్నత, 84 ప్రాథమికోన్నత, 511 ప్రాథమిక పాఠశాలలతో పాటు 16 ఆదర్శ, 16 కస్తూర్బా, మరో 15 వరకు బాలికల, బాలుర గురుకులాలు, మైనార్టీ, అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో దాదాపు 75 వేల మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎంఈవోలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రధానోపాధ్యాయులకు అదనపు బాధ్యతలు అప్పగించకుండా వారితో ప్రతిరోజు విద్యార్థులకు ఒక పీరియడ్‌ బోధన చేయిస్తే మేలు జరుగుతుంది.  


అదనపు బాధ్యతలతో ఇబ్బందే
- శ్రీనివాస్‌, ఎంఈవో మల్యాల, కొడిమ్యాల, పెగడపల్లి

ఎంఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించకముందు ప్రతి రోజు ఓ తరగతి విద్యార్థులకు ఒక పీరియడ్‌ బోధించే అవకాశం ఉండేది. ప్రస్తుతం నాకు అప్పగించిన మూడు మండలాల్లో పర్యటించి ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు ఏ విధంగా బోధిస్తున్నారో పరిశీలిస్తూ.. పాఠశాలల్లో సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం నెలకు రూ.600 టీఏ అందజేస్తుంది. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు ఎంఈవో పోస్టుల భర్తీని నిలిపివేశారు. అదనపు బాధ్యతలు కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని