logo

కమనీయం.. శ్రీనివాసుని కల్యాణం

తిరుమల గిరుల క్షేత్ర వైభవం కరీంనగర్‌లో సాక్షాత్కరించింది. సుందరాలంకరణలో శ్రీదేవి, భూదేవి సహిత శ్రీనివాసుడు కొలువై ఉండగా.. తిరుమల వేద పండితుల మంత్రాలు మారుమోగగా కల్యాణం కనుల పండువగా జరిగింది.

Published : 01 Jun 2023 05:37 IST

మంగళసూత్రం చూపుతున్న అర్చకుడు

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: తిరుమల గిరుల క్షేత్ర వైభవం కరీంనగర్‌లో సాక్షాత్కరించింది. సుందరాలంకరణలో శ్రీదేవి, భూదేవి సహిత శ్రీనివాసుడు కొలువై ఉండగా.. తిరుమల వేద పండితుల మంత్రాలు మారుమోగగా కల్యాణం కనుల పండువగా జరిగింది. స్థానిక కళాకారుల అన్నమయ్య సంకీర్తనలు వీనుల విందు చేశాయి. కరీంనగర్‌ పద్మానగర్‌లో బుధవారం తితిదే దేవాలయం నిర్మాణ భూమి పూజ, శంకుస్థాపన చేసిన సందర్భంగా రాత్రి శ్రీనివాసుని కల్యాణ మహోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుని కల్యాణ మహోత్సవం వీక్షించేందుకు భక్తజనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. తితిదే ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, అన్నమయ్య వంశీకులు హరినారాయణాచార్యులు, తిరుమల అర్చకుల కల్యాణ క్రతువును వేదోక్తంగా నిర్వహించారు. విశ్వక్సేన పూజతో కల్యాణ క్రతువు మొదలైంది. మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్‌, ఎంపీ దామోదర్‌రావు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, భాస్కర్‌రావు, మేయర్‌ సునీల్‌రావు, పోలీసు కమిషనర్‌ సుబ్బారాయుడు కుటుంబ సభ్యులతో కలిసి కల్యాణ వేడుకలను వీక్షించారు. అందరికి ఆశీర్వచనాలు, తిరుపతి లడ్డూ ప్రసాదం వితరణ, అన్నదానం చేశారు. గోగుల ప్రసాద్‌ ఆధ్వర్యంలో అన్నమయ్య సంగీత విభావరి అలరించింది.

కల్యాణ మహోత్సవానికి హాజరైన నగరవాసులు

అలరించిన శోభాయాత్ర...

సాయంత్రం మంకమ్మతోట శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి పద్మానగర్‌ వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఏనుగులు, గుర్రాలు, మహిళల కోలాట ప్రదర్శనలు, చిన్నారుల నృత్యాలు, గోవింద నామ స్మరణలతో యాత్ర సాగింది. పద్మానగర్‌ పద్మశాలీలు పద్మావతి ఆడబిడ్డగా భావించి సారె తీసుకొచ్చారు.

శోభాయాత్రలో గజరాజులు

కరీంనగర్‌లో తితిదే ఆలయం నిర్మాణం.. సంతోషకరం

భక్తుల కొంగు బంగారంగా నిలిచే తిరుమల తిరుపతి దేవస్థానం కరీంనగర్‌ భక్తుల చెంతకు చేర్చాలని దేవాలయం నిర్మించడం సంతోషకరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం భూమి పూజ క్షేత్రాన్ని సందర్శించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడంలో, ధార్మిక కార్యక్రమాల అమలుకు తితిదే కృషి చేస్తుందన్నారు.

సారె తీసుకెళ్తున్న గంగుల, వినోద్‌కుమార్‌, సునీల్‌రావు దంపతులు

పూజ చేస్తున్న బండి సంజయ్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని