logo

పరిశ్రమలతోనే అభివృద్ధి

పరిశ్రమలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో పారిశ్రామిక ఉత్సవాన్ని నిర్వహించారు.

Published : 07 Jun 2023 02:15 IST

ఉత్పత్తులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ యాస్మిన్‌బాషా, జడ్పీ ఛైర్‌పర్సన్‌ వసంత, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తదితరులు

జగిత్యాల, న్యూస్‌టుడే: పరిశ్రమలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో పారిశ్రామిక ఉత్సవాన్ని నిర్వహించారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్‌, అదనపు కలెక్టర్లు బీఎస్‌ లత, మంద మకరందు, ఆర్డీవోలు ఆర్‌.డి.మాధురి, టి.వినోద్‌కుమార్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అభివృద్ధిలో పరిశ్రమల పాత్ర కీలకమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సింగిల్‌విండో విధానం అమలులోకి తెచ్చిందన్నారు. ప్రభుత్వ పరంగా పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి అనేక ప్రయోజనాలు కల్పిస్తున్నామని ప్రతిఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొత్త పరిశ్రమలకు శ్రీకారం చుట్టాలని కలెక్టర్‌ అన్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల పారిశ్రామిక రంగం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహిళలు స్వయం ఉపాధి పథకాలతో అభివృద్ధి చెందుతున్నారని... మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదిగి మహిళలకు ఉపాధి చూపాలన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ... రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తీసుకుంటున్న చొరవతో పారిశ్రామికంగా రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా వివిధ మహిళా సంఘాలు చేసిన ఉత్పత్తులను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు.

ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

జిల్లాలో జరుగుతున్న రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ యాస్మిన్‌బాషా ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గత ఐదు రోజులుగా నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని 7న నియోజకవర్గ స్థాయిలో సాగునీటి దినోత్సవం, 8న ఊరూరా చెరువుల పండగ నిర్వహించాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో ప్రజలు చెరువుల వద్దకు బతుకమ్మలు, బోనాలతో ర్యాలీగా వెళ్లి కట్టమైసమ్మకు పూజలు చేసి అక్కడే భోజనం చేసేలా ఏర్పాటు చేయాలన్నారు. చెరువుల వద్ద రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్‌, అదనపు కలెక్టర్లు బీఎస్‌ లత, మంద మకరందు ఆర్డీవో ఆర్‌.డి.మాధురి, జిల్లా మత్స్యశాఖ అధికారి దామోదర్‌ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని