logo

మరణంలోనూ... సమాజ హితం

మూడు దశాబ్దాల క్రితం రక్తదానం... రెండు దశాబ్దాల క్రితం నేత్రదానం అంటేనే ఎవరూ ముందుకు రాని పరిస్థితులు.

Updated : 09 Jun 2023 06:28 IST

శరీరదానంతో వైద్య విద్యార్థులకు ప్రయోజనం

వరంగల్‌లోని వైద్య కళాశాలకు సరస్వతి మృతదేహాన్ని దానం చేస్తున్న కుటుంబ సభ్యులు (పాతచిత్రం)

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం: మూడు దశాబ్దాల క్రితం రక్తదానం... రెండు దశాబ్దాల క్రితం నేత్రదానం అంటేనే ఎవరూ ముందుకు రాని పరిస్థితులు. క్రమక్రమంగా స్వచ్ఛంధ, సామాజిక సంస్థల కృషితో ఆయా అంశాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. రక్త, నేత్రదానాలు వేలల్లో జరుగుతుండగా జీవన్మృతుల అవయవదానాలతో ఆపన్నులకు పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. శరీరదానంతో వైద్య విద్యార్థుల పరిశీలనలు, ప్రయోగాలకు దోహదపడుతున్నారు. ఇలా... మరణంలోనూ సమాజహితం కోరుతూ నేత్ర, అవయవ, శరీరదానాలకు ముందుకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా రక్తదానంపై లయన్స్‌ క్లబ్‌ లాంటి స్వచ్ఛంద సంస్థలు అవయవదానంపై జీవన్‌దాన్‌ ట్రస్టు విశేష కృషి చేస్తున్నాయి. కాగా 2008లో గాంధీ జయంతి రోజున గోదావరిఖని కేంద్రంగా ఆవిర్భవించిన ‘సదాశయ ఫౌండేషన్‌’ నేత్ర, అవయవ, శరీరదానంపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కాళోజీ నారాయణరావు స్ఫూర్తితో మొదలైన శరీరదానాలు గత ఒకటిన్నర దశాబ్దాల్లో దాదాపుగా 90కి పైగా జరిగాయి. ఇటీవల గోదావరిఖనిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో రెండు శరీరదానాలు జరగడం పెరుగుతున్న అవగాహనకు నిదర్శనం. నేత్ర, అవయవ, శరీర దానానికి సుమారు 50వేల మంది సదాశయ ఫౌండేషన్‌కు హామీ పత్రాలు ఇవ్వగా అందులో 10వేల వరకు శరీరదానాలకు సంబంధించినవే ఉన్నాయి. నేత్రదానాలైతే లెక్కకు మించి జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని అబ్బిడిపల్లి, ఓదెల గ్రామంలోని ప్రజలు నేత్రదానానికి అంగీకరిస్తూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు.


స్థానికంగా అవగాహన

చనిపోయిన వారి నేత్రాలను సేకరించి హైదరాబాద్‌లోని కంటి ఆసుపత్రులకు పంపించడంతో పాటు నేత్రదాత దశదినకర్మ రోజున సదాశయ ఫౌండేషన్‌, రామగుండం లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో సంస్మరణ సభలు నిర్వహించి నేత్ర, అవయవ, శరీరదానం ఆవశ్యకతలపై అవగాహనతో పాటు నేత్రదాత కుటుంబానికి అభినందన పత్రం ఇస్తున్నారు. ఏటా సదాశయ ఫౌండేషన్‌ వార్షికోత్సవం రోజున ఆ సంవత్సర కాలంలో నేత్ర, అవయవ, శరీరదానం చేసిన వారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరిస్తున్నారు. ఆయా కార్యక్రమాలతో స్ఫూర్తిపొందిన ఎంతోమంది తమ మరణానంతరం శరీర దానాలకు హామీ పత్రాలను ఇస్తున్నారు. గోదావరిఖనికి చెందిన ప్రముఖ కార్మిక నాయకుడు మాదిరెడ్డి భాస్కర్‌రావు సతీమణి ఇందుమతి మృతిచెందగా ఆమె శరీరాన్ని వైద్య కళాశాలకు దానం చేయడంతో రామగుండం ప్రాంతంలో శరీరదానాల ప్రక్రియ మొదలైంది. ఆ తర్వాత స్థానిక ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ ముత్తిలింగం సతీమణి విమల శరీరాన్ని 2014లో వైద్య కళాశాలకు దానం చేశారు. ఆమె కుటుంబ సభ్యులంతా అవయవ, శరీరదానాలకు అప్పట్లోనే హామీ ఇచ్చారు. ఇటీవల వరంగల్‌లో మృతి చెందిన విమల కుమార్తె సరస్వతి శరీరాన్ని వరంగల్‌లోని కొలంబో వైద్య కళాశాలకు దానం చేశారు. గోదావరిఖనికి చెందిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయురాలు ఇటీవల మృతి చెందగా ఆమె కోరిక మేరకు మృతదేహాన్ని గోదావరిఖనిలోని వైద్య కళాశాలకు దానం చేశారు. సదాశయ ఫౌండేషన్‌ నిర్వాహకులు శ్రావణ్‌కుమార్‌ సోదరుడు, మామ శరీరాలను వైద్య కళాశాలలకు దానం చేశారు.


పరిశోధనలకు దోహదం

- డాక్టర్‌ రమేశ్‌బాబు, గోదావరిఖని

మరణించినా వైద్యపరిశోధనల కోసం ఉపయోగపడాలన్న ఉద్దేశంతో తొమ్మిదేళ్ల క్రితం మా అమ్మ మృతదేహాన్ని వైద్య కళాశాలకు అప్పగించాం. కుటుంబ సభ్యులమంతా నేత్ర, అవయవ, శరీరదానానికి హామీ ఇచ్చాం. ఇటీవల వరంగల్‌లో మా అక్కయ్య మృతిచెందగా అక్కడి వైద్య కళాశాలకు దానం చేశాం. వారు మా నుంచి దూరమైనా సమాజహితానికి ఉపయోగపడటం మాకెంతో సంతృప్తినిస్తుంది. వెలకట్టలేని మానవ అవయవాలను మట్టిపాలు చేసేకన్నా దానం చేయడం వల్ల ఎందరికో పునర్జన్మను ప్రసాదించవచ్చు.


చట్టం తీసుకురావాలి

-శ్రావణ్‌కుమార్‌, సదాశయ ఫౌండేషన్‌

కొన్ని దేశాల్లో ఉన్నట్లుగా ప్రతి ఒక్కరు అవయవ, శరీరదానం చేసేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలి. ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఈ రంగంలో పనిచేస్తున్న స్వచ్ఛంద, సామాజిక సంస్థలకు సహకరించాలి. దాతల కుటుంబాలను సముచితంగా గౌరవించడంతో ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. వివిధ రంగాల్లోని ప్రముఖులు, వైద్యులు, ప్రజా ప్రతినిధులు అవయవ, దేహదానంతో ప్రజలకు స్ఫూర్తినివ్వాలి. ఇటువంటి కార్యక్రమాల వల్ల ఎంతోమందికి మేలు జరుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని