logo

నిజామాబాద్‌ బరిలో జీవన్‌రెడ్డి

కాంగ్రెస్‌ నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం టికెట్‌ జీవన్‌రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది

Published : 28 Mar 2024 05:28 IST

ఈనాడు, కరీంనగర్‌, న్యూస్‌టుడే- జగిత్యాల: కాంగ్రెస్‌ నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం టికెట్‌ జీవన్‌రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఈయన ఎంపీ అభ్యర్థిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఉండటం ఈయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. గతేడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన తరువాత.. పార్టీ ముఖ్య నేతలు, జాతీయ నాయకత్వం నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా జీవన్‌రెడ్డి వైపునకే మొగ్గు చూపారు.  జగిత్యాల నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం.. ఈ ఎన్నికల్లో ఉపయోగకరంగా మారనుంది. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా ఉండటంతోపాటు రైతులతో జీవన్‌రెడ్డికి మంచి సంబంధాలు ఉండటం కలిసి వచ్చే అవకాశం ఉందని పార్టీ భావించినట్లు సమాచారం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే నాయకుడిగా గుర్తింపు ఉండటంతోపాటు ఆయనకున్న అనుభవానికి పార్టీ అధిష్ఠానం ప్రాధాన్యతనిచ్చి టికెట్‌ను కట్టబెట్టింది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో భాజపా, భారాస అభ్యర్థుల్ని ప్రకటించడంతో వారు ప్రచారం సాగిస్తున్నారు. జీవన్‌రెడ్డి కూడా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తున్నా.. ప్రస్తుతం అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారంలో  దిగే అవకాశం ఉంది.

 జగిత్యాలలో సంబరాలు

 జీవన్‌రెడ్డికి ఎంపీ టికెట్‌ కేటాయించడంతో జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. పలు వార్డుల్లో కార్యకర్తలు బాణాసంచా కాల్చారు.


పేరు : తాటిపర్తి జీవన్‌రెడ్డి,  వయస్సు : 73, విద్యార్హత : బీఏ, ఎల్‌ఎల్‌బీ, భార్య : అహల్య
కుమారులు : రాంచంద్రారెడ్డి, బాలకృష్ణారెడ్డి, చంద్రకృష్ణారెడ్డి
స్వస్థలం : బతికెపల్లి, పెగడపల్లి మండలం,  నివాసం : జంబిగద్దె, జగిత్యా


 న్యాయవాది అయిన జీవన్‌రెడ్డి 1981లో మల్యాల సమితి అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1983లో తెలుగుదేశం పార్టీ నుంచి జగిత్యాల నుంచి బరిలో నిలిచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1985లో కాంగ్రెస్‌లో చేరిన ఈయన ఇప్పటివరకు శాసనసభకు 11 సార్లు పోటీ చేశారు. ఇందులో ఆరుసార్లు గెలిచి, అయిదుసార్లు ఓటమి చెందారు. 2006, 2008లో కరీంనగర్‌ నుంచి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి కేసీఆర్‌ చేతిలో రెండుసార్లు ఓటమి పాలయ్యారు. 1983లో ఎన్టీఆర్‌ ప్రభుత్వ హయాంలో , 2008లో వైఎస్సార్‌ హయాంలో రాష్ట్ర మంత్రిగా పని చేశారు. 2019లో కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేసి శాసనమండలిలో అడుగుపెట్టారు. ప్రస్తుతం నిజామాబాద్‌ నుంచి బరిలో నిలుస్తూ తొలి గెలుపును అందుకుని పార్లమెంటులో అడుగుపెట్టాలనే ఉద్దేశంతో జీవన్‌రెడ్డి ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని