logo

నిధులు దూరం.. నిర్వహణ భారం

వ్యవసాయ శాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించింది. శాఖాపరంగా రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం.

Published : 29 Mar 2024 04:57 IST

19 నెలలుగా పైసా రాని వైనం
ఏఈవోలకు గుదిబండగా రైతు వేదికలు
న్యూస్‌టుడే, హుజూరాబాద్‌

వ్యవసాయ శాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించింది. శాఖాపరంగా రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ రైతు వేదికల నిర్వహణపై పట్టింపు లేకుండా పోయింది. ఏళ్ల తరబడి నిర్వహణ నిధులు మంజూరు చేయకపోవడంతో రైతు వేదికల లక్ష్యం ఆశించిన మేర ముందుకు సాగడం లేదు. రూ.కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో వీటి నిర్వహణ ఏఈవోలకు భారంగా మారింది.  

రూ.4.41 కోట్ల బకాయిలు

ఉమ్మడి జిల్లాలో గత ప్రభుత్వం 258 రైతు వేదికలు నిర్మించింది. ముందుగా ఒక్కో రైతు వేదిక నిర్వహణ ఖర్చుల కింద ప్రతి నెలా రూ.3 వేలు ఇచ్చింది. ఈ నిధులు సరిపోకపోవడంతో వ్యవసాయ శాఖ ప్రతిపాదనల మేరకు రైతు వేదికల నిర్వహణకు రూ.9 వేల చొప్పున అందజేస్తామని ప్రకటించింది. 2022 ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు 5 నెలలకుగానూ ఒక్కో రైతు వేదికకు రూ.45 వేలు అందించింది. ఆ తరవాత 19 నెలలు గడిచినా నిర్వహణ నిధులు ఒక్క పైసా కూడా మంజూరు కాలేదు. ఉమ్మడి జిల్లాలోని 258 రైతు వేదికలకు నిర్వహణ నిధుల బకాయిలు రూ.4,41,18,000 మేర పేరుకుపోయాయి. దీంతో విద్యుతు ఛార్జీలు, పారిశుద్ధ్య నిర్వహణ, మరమ్మతులు, స్టేషనరీ, రైతు శిక్షణ, తాగునీటి సౌకర్యాలకు నిధులు ఖర్చు చేయాల్సి ఉండగా ప్రభుత్వం నిర్వహణ నిధులు విడుదల చేయకపోవడంతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని మండల వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవోలు) వాపోతున్నారు. ఒక్కో రైతు వేదికకు రూ.1.71 లక్షలు రావాల్సి ఉందని, తమ సొంత డబ్బులను రైతు వేదికల నిర్వహణకు ఖర్చు చేయాల్సి వస్తోందని అంటున్నారు. పైగా ఒక్కోదానికి రూ.10 వేల నుంచి రూ.12 వేల చొప్పున విద్యుత్తు బకాయిలు పేరుకుపోయాయని చెబుతున్నారు. రైతు సమావేశాలు జరిగిన సందర్భంలో కనీసం తాగునీరు, తేనీటికి కూడా డబ్బుల్లేవని ఏఈవోలు వాపోతున్నారు. ఒక్కో కేంద్రానికి మినీ భూసార పరీక్ష ల్యాబ్‌ కిట్లను అందజేసి వీటి ద్వారా వేదికల్లో పరీక్షలు చేయాల్సి ఉన్నా నిధుల విడుదల లేకపోవడంతో ఈ ప్రక్రియ కూడా అటకెక్కింది.


ఊరికి దూరంగా..

మ్మడి జిల్లాలో 258 రైతు వేదికలు ఉండగా వీటిలో సగానికి పైగా గ్రామాలకు దూరంగానే ఉన్నాయి. ఒక్కో రైతు వేదిక పరిధిలో 5వేల ఎకరాలు ఉండేలా అయిదారు గ్రామాలను చేర్చారు. కానీ మండల కేంద్రాలు, గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలు ఊరికి దూరంగా, గుట్టల ప్రాంతాలు, నిర్మానుష్య ప్రాంతాల్లో నిర్మించారు. దీంతో రైతులు హాజరయ్యేందుకు అంతగా ఆసక్తి కనబర్చటం లేదు. ప్రతీ రైతు వేదికకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి బాధ్యులుగా ఉండగా.. వీరిలో 50 శాతానికి పైగా మహిళలే ఉన్నారు. ఊరికి దూరంగా వేదికల్లో వీరు ఒక్కరే విధులు నిర్వర్తించేందుకు భయపడుతున్నారు. కనీసం అటెండర్‌ కూడా లేకపోవడంతో ఏఈవోనే తాళం తీసుకుని శుభ్రం చేసుకుని విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏఈవోలు తప్పనిసరిగా వారి క్లస్టర్‌ పరిధిలోని రైతు వేదిక నుంచి జియోట్యాగింగ్‌ ద్వారా తమ హాజరు నమోదు చేసుకోవాలి. లేకుంటే గైర్హాజరు పడినట్టే.. అందుకే ప్రతీ రోజూ విధిగా రైతు వేదికకు వెళ్లి హాజరు నమోదు చేసుకున్న తర్వాతే క్షేత్రస్థాయికి వెళ్లాల్సి ఉంటుంది.


ఇలాగైతే దృశ్య శ్రవణం ఎలా?

శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, రైతులు సమావేశమై సాగు సమస్యలు, ఆధునిక పద్ధతులపై చర్చించేందుకు వీలుగా రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ కార్యక్రమాన్ని ఇటీవలనే ప్రారంభించారు. తొలుత ప్రయోగాత్మకంగా ప్రతీ శాసనసభ నియోజకవర్గానికి ఒక వేదికను ఎంపిక చేశారు. ప్రస్తుతం 125 కుర్చీలు, రెండు టేబుళ్లు, 8 పెద్ద టేబుళ్లు, ఒక మైక్‌సెట్‌ చొప్పున ఉండగా కొత్తగా రూ.3.70 లక్షలతో టెలివిజన్‌, సెట్‌టాప్‌ బాక్స్‌లు, ఇన్వర్టర్లు ఇతర సామగ్రిని సమకూర్చారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా స్థాయి వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు రైతులతో నేరుగా మాట్లాడి పంటల సాగు విధానం, చీడపీడల నివారణ, ప్రభుత్వ పథకాలు తదితర వాటిపై అవసరమైన సలహాలు ఇచ్చేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇదంతా బాగానే ఉన్నా రైతు వేదికల నిర్వహణ నిధులు 19 నెలలుగా విడుదల చేయకపోతే ఎలా అని ఏఈవోలు ప్రశ్నిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించే సమయానికి రైతు వేదికలను సిద్ధం చేయాలని, కానీ అటెండర్‌ కూడా లేకపోవడంతో అన్ని పనులు తామే చేయాల్సి వస్తుందని అంటున్నారు. పైగా ప్రతీనెలా తమ వేతనం నుంచే నిర్వహణ ఖర్చులు భరించాల్సి వస్తోందని, ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని