logo

ప్రజా సేవకుడిగా పార్లమెంటులో గళం వినిపిస్తా

‘కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధిపై నాకు ప్రణాళిక ఉంది.. నాన్న ఆశయ సాధన కోసం కరీంనగర్‌ ప్రజల సేవకు నా జీవితాన్ని అంకితం చేస్తా’ అని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు.

Published : 05 May 2024 04:39 IST

ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల ఏర్పాటుకు పాటుపడతా
‘ఈనాడు’తో కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు
ఈనాడు, కరీంనగర్‌

‘కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధిపై నాకు ప్రణాళిక ఉంది.. నాన్న ఆశయ సాధన కోసం కరీంనగర్‌ ప్రజల సేవకు నా జీవితాన్ని అంకితం చేస్తా’ అని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. తాను పక్కా లోకల్‌ అని.. ప్రస్తుత ఎన్నికల్లో ప్రత్యర్థులతో పోలిస్తే తానే సరైన అభ్యర్థినని అన్ని వర్గాల ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. సమస్యలపై తనకు సంపూర్ణ అవగాహన ఉందని, ప్రాధాన్య క్రమంలో వాటిని పరిష్కరించే దిశగా రేయింబవళ్లు శ్రమిస్తానన్నారు. చేపట్టాల్సిన ప్రగతి పరంగా తనకు ప్రత్యేకమైన ఎజెండా ఉందంటున్న వెలిచాల రాజేందర్‌రావు ‘ఈనాడు’ ముఖాముఖిలో పలు ప్రశ్నలకిలా సమాధానమిచ్చారు.

ప్రశ్న : మీ ప్రచారం ఎలా సాగుతోంది. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది?
జవాబు :
టికెట్‌ ఆలస్యంగా వచ్చినప్పటికీ ప్రజలు అడుగడుగునా అభిమానంతో ఆదరిస్తున్నారు. దశాబ్దాల పాటు ఇక్కడి ప్రజలతో మమేకమైన వెలిచాల జగపతిరావు కుమారుడిగా బ్రహ్మరథం పడుతున్నారు. ఊరూరా జనాలు భారాస, భాజపా అభ్యర్థుల వైఖరిపై విసిగి చెంది ఉన్నారు. మార్పు కోరుకుంటున్నారు. గతంలో వినోద్‌కుమార్‌కు, బండి సంజయ్‌కు అవకాశమిచ్చామని.. ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలన్న అభిప్రాయంతో ఉన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఉత్సాహంగా పని చేస్తున్నారు. పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరిస్తున్నాం.

ప్ర : లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలేంటి? వాటి పరిష్కారానికి మీకున్న ప్రణాళిక?
జ :
కీలకమైన ప్రాజెక్ట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. మనోహరాబాద్‌- కొత్తపల్లి రైల్వే మార్గం సిద్దిపేట వరకే వచ్చింది. నేను గెలిచిన తరవాత మూడేళ్లలో సిరిసిల్ల మీదుగా కొత్తపల్లి వరకు రైలును తీసుకొస్తాను. ఒకవేళ ఈ పని చేయకుంటే వెంటనే రాజీనామా చేస్తా. చిత్తశుద్ధి ఉంటే అటు కేంద్రం, ఇటు రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి ప్రజలు ఆశించిన అభివృద్ధి ఫలాలను అందించొచ్చు. నాకున్న ప్రణాళికతో కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖల నుంచి దిల్లీ స్థాయిలో పెద్దలను ఒప్పించి నన్ను నమ్మి గెలిపించే కరీంనగర్‌ ప్రజలకు ఊహించని అభివృద్ధి ఫలాలను అందిస్తా. ఆ సత్తా నాకుంది. చేనేత కార్మికుల భవితను మారుస్తా. పెండింగ్‌ రైల్వే పనులు పూర్తి చేయిస్తా. జాతీయ రహదారుల ప్రగతికి చొరవ చూపడంతోపాటు ఐఐటీ, నవోదయలాంటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు, ఇతర పరిశోధన కేంద్రాలు తీసుకొస్తా. రాష్ట్రంలో అత్యధికంగా ఈ లోక్‌సభ నియోజకవర్గంలో మత్స్యకారుల కుటుంబాలున్నాయి. ఇక్కడున్న జలాశయాలనే వనరులను వినియోగించి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి వారి జీవితాల్లో వెలుగులు అందిస్తా. ముఖ్యంగా కొండగట్టు అంజన్న, వీరభద్రస్వామి, వేములవాడ రాజన్న ఆలయాల అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు తీసుకొస్తా. సాగు, తాగునీటి పరంగా శాశ్వత ప్రయోజనాలు ఉండే మంచి పనులు చేస్తాను.

ప్ర : ప్రత్యర్థులకు భిన్నంగా మీరు ప్రజలకేమి చేయనున్నారు? గెలిస్తే లోక్‌సభలో మీ పాత్ర ఎలా ఉండనుంది?
జ :
కరీంనగర్‌ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బండి సంజయ్‌, వినోద్‌కుమార్‌లు సరిగ్గా వినియోగించుకోలేదు. సంజయ్‌ నయాపైసా తేలేదు. సర్వసభ్య సమావేశాలకు ఒక్కసారి కూడా రాలేదు. స్మార్ట్‌సిటీ కూడా యాదృచ్ఛికంగా వచ్చిందే.. వినోద్‌కుమార్‌ తెచ్చింది కాదది. వాళ్లిద్దరి వైఫల్యాలు ప్రజలకు తెలుసు. నేను ఇంకా అర్థమయ్యే విధంగా చెబుతున్నా. నాకు అన్ని భాషలు వచ్చు. కరీంనగర్‌ ఎంపీగా కాకుండా ఒక సేవకుడిగా పార్లమెంటులో నా గళాన్ని బలంగా వినిపిస్తా. రాహుల్‌గాంధీ జోడో యాత్ర ఆశయ సాధన అయిన దేశ సమగ్రత, భద్రత కోసం నేను కంకణబద్దుడినై నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తా. పార్లమెంటులో ఆ అంశాలపై మాట్లాడుతూనే కరీంనగర్‌కు అవసరమైన నిధులను సభలో ప్రస్తావించి, పెద్దలను ఒప్పించి అభివృద్ధి నిధులు తీసుకొస్తాను. అభివృద్ధిలో కరీంనగర్‌ను ఒక దిక్సూచిగా మారుస్తాను.

ప్ర : మీరు గెలిస్తే ఇక్కడి ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటారు?
జ :
నా ప్రాణమున్నంత వరకు ఇక్కడి ప్రజల సేవకు అంకితమవుతాను. మా నాన్న, మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కరీంనగర్‌లోని ఆస్పత్రిలో ప్రాణం వదిలారు. చివరి కోరికగా కరీంనగర్‌ ప్రజల కోసమే సేవ చేయాలని చెప్పారు. నా రాజకీయ ప్రస్థానం గ్రామ స్థాయి నుంచి మొదలు కాగా రాష్ట్రస్థాయి వరకు ఎదిగా. అవినీతి మచ్చ లేని నాయకుడిగా గుర్తింపు పొందా. నాన్నకిచ్చిన మాట నెరవేరుస్తా. నాన్న సంకల్ప బలంతోనే నాకు టికెట్‌ వచ్చింది. పార్టీ కూడా నాపై విశ్వాసముంచి అభ్యర్థిగా ప్రకటించింది. మంచి మెజారిటీతో గెలిచి ప్రజల రుణం తీర్చుకుంటా. నాకు అభివృద్ధి పరంగా ప్రణాళిక ఉంది. గతంలో ఎంపీల మాదిరిగా కాకుండా సొంత ఎజెండాను ఆచరణలో చూపిస్తా. అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌ మైదానాన్ని కరీంనగర్‌లో 50 ఎకరాల్లో నిర్మించి ఐపీఎల్‌, వన్డే ఆటలకు కరీంనగర్‌ను వేదికగా మారుస్తా. ప్రతి ఏడాది అన్ని మండలాల జట్లతో ఐపీఎల్‌ తరహాలో టోర్నీని నిర్వహించి రూ.10 లక్షల బహుమతి ఇస్తా. క్రీడాకారులను ప్రోత్సహిస్తా. నా సొంత డబ్బు ఏటా రూ.12 కోట్లు వెచ్చిస్తా. పేరొందిన సంస్థల సహకారంతో నైపుణ్య కేంద్రం ఏర్పాటు చేస్తా. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో చిన్నచిన్న పనులను అప్పటికప్పుడు చేసేందుకు జేసీబీ, ట్రాక్టర్‌, రోడ్‌రోలర్‌ లాంటివి అందుబాటులో ఉంచుతా. ఒక్కో యూనిట్‌కు రూ.2 కోట్లతో రూ.14 కోట్లు సొంత డబ్బు వెచ్చిస్తా. నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తా. ప్రతి మండలానికి ఒక అంబులెన్స్‌, కరీంనగర్‌, సిరిసిల్లల్లో రూ.50 లక్షలతో రెండు చొప్పున ఉచిత అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తా. గల్ఫ్‌ బాధితులకు, పేద విద్యార్థులకు, క్రీడాకారులకు ఏటా ఆర్థిక సాయమందిస్తా. కరీంనగర్‌ సహాయక్‌ అనే యాప్‌తో సేవల్లో కొత్త పంథా చూపిస్తా. ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేయిస్తా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని