logo

క్షేమంగా వెళ్లి వారంలోపే రండి!

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు మరో వారం రోజులే ఉంది. ఈ నెల 13న పోలింగ్‌ నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది.

Updated : 06 May 2024 06:34 IST

13లోపే యాత్రలకు ముగింపు పలకండి
పోలింగ్‌ రోజు ఓటుకు సెలవివ్వొద్దు

న్యూస్‌టుడే,కరీంనగర్‌ పట్టణం, సుభాష్‌నగర్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు మరో వారం రోజులే ఉంది. ఈ నెల 13న పోలింగ్‌ నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ప్రజాస్వామ్యానికి బలమైన ఆయుధం ఓటు మాత్రమేనని, ఈ విషయాన్ని మరచిపోకుండా హక్కును సద్వినియోగం చేసుకోవాలని అధికార యంత్రాంగం విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటేస్తేనే సుపరిపాలన అందుబాటులోకి రానుంది.

ఆరు రోజులకే ప్రణాళిక

విద్యాసంస్థలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. దాదాపు పది రోజులుగా పిల్లలకు ఆటవిడుపు దొరికింది. ఖాళీ సమయంలో పిల్లలు, పెద్దలు సేద తీరాలని భావిస్తారు. మండే ఎండల్లో చల్లటి ప్రదేశాలకు వెళ్లేవారు కొందరైతే, తీర్థ యాత్రలకు వెళ్లడం, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించడం మరికొందరికి అలవాటు. 13న (సోమవారం) పోలింగ్‌ సందర్భంగా సెలవు కాగా ముందు రెండో శనివారంతో పాటు ఆదివారం సాధారణ సెలవులు. వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయని ఇంటిల్లిపాదీ ఎక్కడికైనా వెళ్దామని భావించే అవకాశముంది. అయితే పోలింగ్‌ రోజును సెలవు దినంగా భావిస్తే సమున్నత లక్ష్యానికి విఘాతం కలుగుతుందన్న విషయం మరచిపోకూడదు. ఎక్కడ ఉన్నా వచ్చి ఓటు వేయడానికే ఆ రోజు సెలవు ప్రకటించారని గుర్తుంచుకోవాలి. వేసవి సెలవుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు కూడా ఒక రోజు ముందు స్వస్థలాలకు చేరుకునేలా ఏర్పాటు చేసుకోవాలి. పోలింగ్‌కు సరిగ్గా వారం రోజుల సమయం ఉన్నందున యాత్రలకు వెళ్లేవారు ఆరు రోజులకే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.

పట్టణ ఓటరూ.. బద్దకించకండి

ప్రతి ఎన్నికల సమయంలో పల్లె ప్రాంతాల్లో అధికంగా, పట్టణ ప్రాంతాల్లో తక్కువగా పోలింగ్‌ నమోదవుతోంది. నగరాలు, పట్టణ ప్రాంత జనాలు ఓటేయడానికి ఆసక్తి చూపకపోవడమే ఇందుకు కారణమన్న విమర్శలున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆ విమర్శలు తిప్పికొట్టడానికి తమ చేతిలోని అస్త్రాన్ని సంధించాల్సిన అవసరం ఉంది.

అంతకు మించి సంధించాలి

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పలు విడతల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఇప్పటికే రెండు విడతలు పూర్తి కాగా మొదటి విడతలో 66.14 శాతం, రెండో విడతలో 66.71 శాతం పోలింగ్‌ నమోదైంది. నాలుగో విడతలో తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ జరగనుంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 77.26 శాతం నమోదైంది. ఈసారి ఎన్నికల్లో అంతకు మించి పోలింగ్‌ నమోదు కావాలంటే ఓటుహక్కు కలిగి ఉన్న వారంతా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలి.

గంట పొడిగింపుతో ఉపశమనం

ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లాలంటేనే భయం వేస్తోంది. ఈ క్రమంలో పోలింగ్‌ ప్రక్రియ కూడా అగ్ని పరీక్షగా మారింది. భానుడి ప్రతాపాన్ని గుర్తించిన ఎన్నికల సంఘం పోలింగ్‌ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించింది. ఇది వృద్ధులు, మహిళలకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులంతా ఉదయం 7 గం.ల నుంచి 11 గం.లలోపు ఓటు వేసి రావడం ద్వారా ఎండదెబ్బ నుంచి ఉపశమనం ఉంటుంది. ఆ సమయంలో వీలు పడని వారికి సాయంత్రం 4 గం.ల నుంచి 6 గం.ల వరకు అవకాశం ఉంది.

ఊపిరిలూదాల్సింది యువతే..

యువతే దేశానికి ప్రాణవాయువు. ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం చాలా మంది స్వస్థలాలకు దూరంగా, పట్టణ, నగర ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈసారి పోలింగ్‌కు ముందు రోజు కూడా సెలవు వస్తున్నందున ఎక్కడ ఉన్నా సొంత ప్రాంతాలకు చేరుకొనేందుకు అనుకూలంగా ఉంటుంది. యువ ఓటర్లు తప్పనిసరిగా ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యానికి ఊపిరిలూదిన వారవుతారు. వారు ఓటుహక్కు వినియోగించుకోవడంతో పాటు దివ్యాంగులు, వృద్ధులకు చేయూతనందించే ప్రయత్నం చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని