logo

రాజకీయ అదును..వ్యూహాలకు పదును

రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. రెండు రోజుల వ్యవధిలో రాష్ట్రాన్ని సందర్శించటంతో జాతీయ పార్టీల్లో రాజకీయ వ్యూహాలు పదునెక్కాయి.

Published : 06 Aug 2022 02:06 IST

షా, రాహుల్‌ రాక.. జాతీయ పార్టీల్లో కాక

అమిత్‌షాతో అప్ప చర్చలూ ఆసక్తిదాయకమే

ఈనాడు: రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. రెండు రోజుల వ్యవధిలో రాష్ట్రాన్ని సందర్శించటంతో జాతీయ పార్టీల్లో రాజకీయ వ్యూహాలు పదునెక్కాయి. ప్రస్తుతం దేశమంతా 75వ స్వాతంత్య్ర అమృత మహోత్సవాల కార్యక్రమాల్లో మునిగితేలుతోంది. ఆ వేడుక ముగిశాక.. రాష్ట్రంలోని రెండు కీలక పార్టీలు తమ ఎన్నికల కార్యాచరణను ప్రారంభించాలని నిర్ణయించాయి. 2023 ఏప్రిల్‌- మే నెలల్లో విధానసభకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆలోగా పార్టీలో ఎదురయ్యే వ్యవస్థాగత లోపాలను సవరించుకోవాలి. ఇరు పార్టీల్లోనూ స్థిరమైన నాయకత్వం లేదన్నది తెలియంది కాదు. ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ సాధించాలంటే సమర్థమంతమైన నాయకత్వం ఎంతో కీలకం. సరిగ్గా ఈ విషయాన్ని రాహుల్‌గాంధీ, అమిత్‌షా రాష్ట్రంలోని వారివారి నేతలకు మరోమారు గుర్తు చేశారు. పేరుకు జాతీయ పార్టీలైనా స్పష్టమైన అధికారాన్ని పొందేందుకు అవసరమైన స్థానాలను గెలుచుకోవటంలో వైఫల్యం చెందుతున్నాయి. ప్రతిసారీ ప్రాంతీయ పార్టీ అండతో సర్కారు రచించటం, ఆపై భిన్నాభిప్రాయాలతో అధికారాన్ని కోల్పోవటం గత ఐదేళ్ల కాలంగా జరుగుతున్న తంతే. ఈసారి అలాంటి సందర్భాలకు అవకాశం కల్పించరాదని వీరిద్దరూ తమ పార్టీ నాయకులకు హెచ్చరించారు.
అవాంతరాలెన్నో
అధికార పక్షం భాజపా ఎన్నికలను ఎదుర్కోవాలంటే పాలన లోపాలను సవరించుకోవాలి. అధికారం చేతిలో ఉన్నా పార్టీని సమైక్యపరచటంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రెండేళ్ల యడియూరప్ప పాలన తర్వాత బొమ్మై నాయకత్వంతో సర్కారు ఏర్పడింది. తొలి ఆరు నెలలు బాలారిష్టాలు ఎదుర్కొన్న ఆయన ఆపై కాస్త కుదురుకున్నట్లే కనిపించారు. మతపరమైన సంఘర్షణలు జాతీయ స్థాయిలో వివాదంగా మారటంలో సమస్యలు మొదటికే వచ్చాయి. సొంత పార్టీ మద్దదారే హత్యకు గురికావడంతో కార్యకర్తలు భగ్గుమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పటికంటే నేడు ఆ పార్టీ కార్యకర్తల్లో భయం పెరిగినట్లు అమిత్‌ షాకు ఫిర్యాదులు అందాయి. ఆర్‌ఎస్‌ఎస్‌తో ఈ సమాచారాన్ని సేకరించిన అమిత్‌ షా ముఖ్యమంత్రి, హోంమంత్రులతో కాస్త కఠినంగానే మాట్లాడినట్లు సమాచారం. కార్యకర్తల మూకుమ్మడి రాజీనామాలు పార్టీకి అప్రతిష్ట తెచ్చేవని ఆయన పార్టీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌కు గట్టిగా హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్రాలు ఎన్ని ఆకర్షణీయమైన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు రూపొందించినా వాటిని ప్రచారం చేయాలంటే కార్యకర్తలే కీలకం. వీరికి భరోసా కల్పించటంపై మరింత దృష్టి సారించాలని సూచించారు.
రాహుల్‌ సలహాలతో
కాంగ్రెస్‌ పార్టీలోని ఆధిపత్య పోరుపై ఉన్న అపోహలు బుధవారం పటాపంచలయ్యాయనే రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌- మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పార్టీ కోసం ఒక్కటయ్యారన్న సందేశాన్ని దావణగెరె కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరవేశారు. రాహుల్‌ గాంధీ సూచనలతోనే వీరిద్దరూ ఒక్కటైనట్లు కనిపించారన్న వాదన లేకపోలేదు. వాస్తవానికి సిద్ధును సన్మానించిన డీకే.. తన పని అయిపోయినట్లు కనిపించారు. రాహుల్‌ స్పష్టమైన సూచనతోనే ఆలింగనం చేసుకునే దృశ్యాలు మాధ్యమాల్లో స్పష్టంగా కనిపించాయి. పార్టీలో నేతలెవ్వరూ మాధ్యమాలతో ఏకపక్షంగా మాట్లాడొద్దని రాహుల్‌ హెచ్చరించారు. పార్టీని గెలిపించేందుకు ప్రయత్నించి, ఆపై గెలిచిన ఎమ్మెల్యేల ఆమోదంతోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది నిర్ణయిస్తామని తేల్చిచెప్పారు. దావణగెరె కార్యక్రమానికి వచ్చిన భారీ స్థాయి అభిమానుల సంఖ్య పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమం డీకే వర్గాన్ని కాస్త కలవరపెట్టినట్లు సమాచారం. పార్టీ సీనియర్లంతా సిద్ధు నాయకత్వాన్ని ఆమోదిస్తుండగా, యువతరం మాత్రం డీకే వైపు మొగ్గు చూపుతోంది. ఈ భిన్నాభిప్రాయాలు ఎన్నికల వేళ పెల్లుబకకుండా చూడాలని ఇరు వర్గాలకు రాహుల్‌ సూచనలు చేశారు. దేశ రాజకీయాల్లో మార్పునకు రాష్ట్ర కాంగ్రెస్‌ గెలుపు కీలకంగా మారనుందన్నారు. ఇప్పటికే లింగాయత్‌ సముదాయాన్ని ఆకట్టుకునే దిశగా ఇష్టలింగ దీక్ష చేసిన రాహుల్‌గాంధీ.. ఎన్నికల వేళ రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటిస్తానని నేతలకు చెప్పారు.
సిద్ధు.. ఓ అలజడి
బుధవారం దావణగెరెలో నిర్వహించిన సిద్ధరామోత్సవ కార్యక్రమం అధికార పక్షానికి హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న యడియూరప్పతో అమిత్‌ షా ఈ కార్యక్రమం ప్రభావంపై సమగ్రంగా చర్చించారు. కాంగ్రెస్‌ పార్టీలో అందరూ ఊహించినట్లు ఆధిపత్య పోరున్నా ఎన్నికల సమయానికి అందరూ ఒక్కటవుతారు. భాజపాలో ఆ సమన్వయం తక్కువని అమిత్‌ షాకు అప్ప వివరించినట్లు సమాచారం. బొమ్మై నాయకత్వాన్ని పైకి ఆమోదించినట్లున్నా లోలోపల అసంతృప్తి, సీనియర్లు, జూనియర్లు, వలస నేతలు, ఉత్తర కర్ణాటక, బెళగావి నేతల ప్రత్యేక రాజకీయాలు ఎన్నికల్లో పార్టీకి చేటు తెస్తాయనే వీరి చర్చల్లో తేలినట్లు తెలిసింది. పాత మైసూరులో అత్యధిక స్థానాలు సాధించాలన్న సంకల్పానికి నేతల సమన్వయ లోపం అడ్డుకట్టగా ఉన్నట్లు గుర్తించారు. త్వరలోనే రాష్ట్రమంతా పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని అప్ప హామీ ఇచ్చారు. యడియూరప్ప సేవలు పూర్తిగా ఉపయోగపడాలంటే ఆయన తన కుమారుల కోసం విధించే నిబంధనలను పార్టీ ఆమోదించాలనేది జగమెరిగిన సత్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని