logo

ఆ మైదానం రెవెన్యూ సొత్తు

నగరంలోని వివాదాస్పదమైన చామరాజపేట ఈద్గామైదానం రాష్ట్ర రెవెన్యూ శాఖ సొత్తుగా బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె ప్రకటించింది. ఈ మేరకు పాలికె పడమటి విభాగం సంయుక్త కమిషనర్‌ శ్రీనివాస్‌ ఆదేశాలు జారీ చేశారు.

Published : 08 Aug 2022 01:45 IST

ఈద్గామైదానం వద్ద గట్టి పోలీసు బందోబస్తు

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: నగరంలోని వివాదాస్పదమైన చామరాజపేట ఈద్గామైదానం రాష్ట్ర రెవెన్యూ శాఖ సొత్తుగా బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె ప్రకటించింది. ఈ మేరకు పాలికె పడమటి విభాగం సంయుక్త కమిషనర్‌ శ్రీనివాస్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను సవాల్‌ చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసి న్యాయపోరాటం చేస్తామని వక్ఫ్‌ మండలి వెల్లడించింది. ఖాతా చేసేందుకు సంబంధించిన దాఖలాలను సమర్పించాలని రెండు సార్లు మండలికి తాఖీదులు ఇచ్చినా సమాధానం ఇవ్వలేదని ఆయన తెలిపారు. రెవెన్యూ శాఖ రికార్డుల్లో రెవెన్యూ సొత్తుగా నమోదైనట్లు తెలియజేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించేందుకు అనుమతించాలని చామరాజపేట నాగరిక ఐక్యవేదిక నాయకులు డిమాండ్‌ చేశారు. మైదానం ప్రజా ఆస్తి, స్వాతంత్య్ర దినోత్సవం నాడు జాతీయ జెండా ఎగురేసేందుకు అనుమతించాలని పాలికె చీఫ్‌ కమిషనర్‌ తుషార్‌గిరినాథ్‌కు వినతి పత్రం అందజేసినట్లు వేదిక ప్రధాన కార్యదర్శి రుక్మాంగద తెలిపారు. మైదానానికి జయచామరాజేంద్ర ఒడెయర్‌ పేరు పెట్టాలని ఒత్తిడి తెచ్చారు. వివాదం మళ్లీ తెరపైకి రావడంతో మైదానం వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరూ ప్రవేశించకుండా పోలీసు పహారా ఏర్పాటు చేశారు.

మైదానం వద్ద నినాదాలు చేస్తున్న ప్రతినిధులు

‘జెండా ఎగరేస్తాం’

బెంగళూరు (శివాజీనగర): ఈద్గా మైదానంలో పంద్రాగస్టుకు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తామని చామరాజపేట నాగరిక పౌర వేదికె ప్రకటించింది. ఈ మైదానానికి జయచామరాజేంద్ర ఒడెయరు పేరు పెట్టాలని స్థానిక నివాసుల సంఘం అధ్యక్షుడు రుక్మాంగద డిమాండ్‌ చేశారు. ఈద్గా మైదానం తమ ఆస్తి అని వక్ఫ్‌ బోర్డు నిరూపించుకోవడంలో విఫలమైన నేపథ్యంలో అది రెవెన్యూ శాఖకు చెందిన మైదానమని పాలికె ప్రకటించడంపై వేదికె ప్రతినిధులు హర్షాన్ని వ్యక్తం చేశారు. 75 ఏళ్లుగా ఇక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు అవకాశమే దక్కలేదని స్థానికుడు, వేదికె ప్రతినిధి లహరి వేలు పేర్కొన్నారు. అన్ని సముదాయాల ప్రతినిధులు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవకాశాన్ని కల్పించాలని తాము ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు. బక్రీద్‌కు గొర్రెల విక్రయం, రంజాన్‌కు సామూహిక ప్రార్థనలకు అవకాశంతో పాటు వినాయకచవితికి విగ్రహాల విక్రయం, స్థానిక విద్యార్థులు ఆడుకునేందుకు అనుమతించేలా ప్రభుత్వం, పాలికె చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తామని పేర్కొన్నారు. మైదానం వద్ద బాణసంచా కాల్చి స్థానిక నివాసులు, కన్నడ సంఘాల ప్రతినిధులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని