logo

తప్పిన పెనుప్రమాదం

బళ్లారి నగర పాలికె గాంధీనగర ప్రధాన రహదారి దిగువన భూగర్భ మురుగు కాలువ ఒక్కసారి కుంగిపోయింది. 14 అడుగుల గుంత ఏర్పడింది.

Published : 27 Nov 2022 02:11 IST

కుంగిన గాంధీనగర్‌ ప్రధాన రహదారి

గాంధీనగర్‌ ప్రధాన రహదారిలో కుంగిపోయిన రహదారి

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి నగర పాలికె గాంధీనగర ప్రధాన రహదారి దిగువన భూగర్భ మురుగు కాలువ ఒక్కసారి కుంగిపోయింది. 14 అడుగుల గుంత ఏర్పడింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పాలికె అధికారులు శనివారం పనులు ప్రారంభించారు. కనక దుర్గమ్మ గుడి నుంచి గాంధీనగర్‌ ప్రధాన రహదారి మధ్యలో భూగర్భ మురుగు కాలువ గొట్టాలు వెళ్తున్నాయి. ఈ గొట్టాలను 1973లో వేయడంతో బలహీనపడ్డాయి. శుక్రవారం సాయంత్రం ఉన్న ఫళంగా ప్రధాన రహదారిలోని రేణుక హోటల్‌ ముందు గుంత ఏర్పడింది. కుంగిన ప్రదేశంలో వాహనాలు ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని పాలికె అధికారులు తెలిపారు.

పనులు ప్రారంభించిన పాలికె అధికారులు

కుంగిపోయిన భూగర్భ మురుగు కాలువ పనులు శనివారం ఉదయం ప్రారంభించారు. నగర శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి, కమిషనర్‌ రుద్రేశ్‌, ముఖ్య ఇంజినీర్‌ ఖాజా పరిశీలించారు. పైభాగం నుంచి వస్తున్న మురుగునీటితో పనులకు ఇబ్బంది కలగకుండా దుర్గమ్మ దేవస్థానం మలుపులో గొట్టాలతో మురుగునీటిని రాజ కాలువకు మళ్లించారు. భవిష్యత్తులో భూగర్భ మురుగు కాలువ గొట్టాలు కుంగిపోకుండా ముందు జాగ్రత్తగా రేణుక హోటల్‌ నుంచి దుర్గమ్మ గుడి వరకు కొత్త గొట్టాలు వేస్తామని పాలికె అధికారులు తెలిపారు.

పనులకు ఇబ్బంది లేకుండా పైభాగంలో మురుగునీటిని రాజు కాలువకు మళ్లింపు

మోక్షం ఎప్పుడో

గాంధీనగర్‌ ప్రధాన రహదారికి మోక్షం ఎప్పుడు లభిస్తుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి గొట్టాలు వేయడంతో అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీచే విచారణ చేశారు. దీనిపై పాలికె అధికారులు కేసు ముగించారు. గాంధీనగర్‌ ప్రధాన రహదారిని పూర్తి స్థాయిలో చేయడానికి అధికారులు సిద్ధమవుతుండగా తాగునీటి గొట్టాలు పగలిపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయి. తాగునీటి గొట్టాలు సరిపోయాయి. రహదారి పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతుండగా, శుక్రవారం సాయంత్రం భూగర్భ మురుగు కాలువ కుంగిపోయింది. దీంతో రహదారి పనులు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనపడుతోంది.

పనులు పరిశీలిస్తున్న శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి, పాలికె అధికారులు

భారీ వాహనాలు నిషేధించాలి

ఈ రహదారిపై భారీ వాహనాలు 40 నుంచి 60 టన్నుల బరువును తీసుకెళ్తుండటంతో గొట్టాలు పగిలిపోతున్నాయి. పగటి పూట భారీ వాహనాలు నగరంలోకి అనుమతించకూడదని జిల్లా పాలనాధికారి పోలీసులకు పలుమార్లు హెచ్చరించినా.. ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కనీసం రహదారి పూర్తి స్థాయి వేసే వరకు భారీ వాహనాలను నిషేధించాలని స్థానిక ప్రజలతో పాటు, పాలికె అధికారులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని