logo

రాష్ట్రానికి అవినీతి మరక

జాతీయ పార్టీల అవినీతితో రాష్ట్రం, దేశం పాడైందని మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్‌ కీలక నేత కుమారస్వామి నిప్పులు చెరిగారు.

Published : 25 Jan 2023 01:22 IST

జాతీయ పార్టీలపై కుమార నిప్పులు

బాగలకోట, న్యూస్‌టుడే : జాతీయ పార్టీల అవినీతితో రాష్ట్రం, దేశం పాడైందని మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్‌ కీలక నేత కుమారస్వామి నిప్పులు చెరిగారు. గెలిచే ఎద్దు తోక పట్టుకుని వెళుతుంటానని నాపై విపక్ష నాయకుడు సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు దారుణమని ఖండించారు. మా పార్టీకి పూర్తి మెజార్టీ లేకపోయినా దేవేగౌడ వద్దకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మీరు కోరిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. భాజపా నుంచి గోవింద కారజోళ కూడా తమ ఇంటికి వచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు రావాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి దళ్‌ నేత ఎంపీ ప్రకాశ్‌ను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని కోరినా ఆయన అంగీకరించలేదన్నారు. బాదామి తాలూకా ఆడగల్ల గ్రామంలో కుమార మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఇకపై తన రథయాత్ర రాయచూరు, బళ్లారి, కొప్పళ, హరిహరలలో కొనసాగుతుందని, ఆ తర్వాత బెళగావి, హుబ్బళ్లి, హావేరిలలో ముందుకు సాగుతుందని ప్రకటించారు. అవసరం కోసం తన వద్దకు వచ్చిన నేతలే ఇప్పుడు విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు. గ్రామాభివృద్ధి నుంచి, రైతులు, మహిళలు, కార్మికులు, పౌరుల సమస్యలు పరిష్కరించడంలో జాతీయ పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు.


హాసన నుంచి బరిలో దిగుతా

హాసన, న్యూస్‌టుడే : విధానసభ ఎన్నికలలో హాసన నుంచి తాను జనతాదళ్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని నాయకురాలు భవానీ రేవణ్ణ ప్రకటించారు. హాసన సమీప సాలిగ్రామలో నిర్మించిన అణ్ణప్ప స్వామి ఆలయాన్ని ఆమె మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. తన భర్త హెచ్‌.డి.రేవణ్ణ మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో అనే అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. గత ఎన్నికలలో భాజపా అభ్యర్థి ఇక్కడి నుంచి గెలిచారని, ఈసారి నేనే బరిలో దిగి విజయం సాధిస్తానన్నారు. నా విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆమె వ్యాఖ్యానించారు. హాసన జిల్లా దళ్‌లో లుకలుకలు ఉన్నాయని భవానీ వ్యాఖ్యలతో స్పష్టమైంది. హాసన జిల్లా నుంచి రేవణ్ణ, భవానీ రేవణ్ణ, వారి కుమారుడు ప్రజ్వల్‌, సూరజ్‌ టిక్కెట్టు కేటాయించాలని కోరడంతో అభ్యర్థులను ప్రకటించకుండా కుమారస్వామి తేదీని వాయిదా వేస్తూ వస్తున్నారు. భవాని ఎన్నికలలో పోటీ చేసి, ప్రచారానికి వెళితే తప్పేముందని హెచ్‌డీ రేవణ్ణ వ్యాఖ్యానించారు.


రాహుల్‌కు గౌడ అభినందన

మాన్విలో కుమారస్వామి బృందానికి వినూత్నంగా డోళ్ల హారం!

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌గాంధీ ‘భారత్‌ జోడో’ యాత్ర ముగింపు కార్యక్రమానికి విచ్చేయాలంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాసిన ఉత్తరానికి మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవేగౌడ స్పందించారు. ‘మీ లేఖకు ధన్యవాదాలు. మీ ఆహ్వానం ఆనందకరం. రాహుల్‌ యాత్ర అభినందనీయం. దేశ ప్రజలకు ఇదెంతో అవసరమైన కార్యక్రమం. ఈనెల 30న శ్రీనగరలో పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు నాకు సాధ్యం కాదు. రాహుల్‌కు నా శుభాకాంక్షలు’ అంటూ గౌడ ప్రత్యుత్తరమిచ్చారు.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని