logo

అవినీతిపరులను కారాగారానికి పంపిస్తాం

పూర్తి మెజారిటీతో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవినీతిపరులైన రాజకీయ నాయకులను కారాగారానికి పంపిస్తామని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు.

Published : 06 Feb 2023 01:32 IST

కుమరస్వామిని సత్కరించేందుకు  నమ్మ మెట్రో బోగీల తరహాలో వెండితో తయారు చేసిన గజమాల

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: పూర్తి మెజారిటీతో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవినీతిపరులైన రాజకీయ నాయకులను కారాగారానికి పంపిస్తామని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. ఒకప్పుడు దోపిడీదారుల దగ్గరే ఎక్కువ డబ్బు ఉండేది. ఇప్పుడు భాజపా నాయకుల ఇళ్లలో సంపద పోగవుతోందని ఎద్దేవా చేశారు. ఆదివారం దాసరహళ్లి నియోజకవర్గంలో ఆయన పంచరత్న యాత్రను నిర్వహించారు. ఇదే నేపథ్యంలో తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారు. పలు కార్యక్రమాలను జారీలోకి తీసుకుని రాకుండా మంత్రి అశోక్‌ ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. మరో 61 రోజులు పగలూ, రాత్రి నియోజకవర్గాలను చుట్టివస్తానని, పూర్తి మెజారిటీతో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే సంకల్పానికి ప్రజలు, నేతలు మద్దతు ఇస్తారన్న నమ్మకం వచ్చిందన్నారు. పాలికె పరిధిలోకి 110 గ్రామాలను తీసుకు వచ్చిన ఘనత తనదేనని గుర్తు చేశారు. దాసరహళ్లిలో పనులు చేసేందుకు నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం అడ్డుపడితే, హైకోర్టును ఆశ్రయించవలసి వచ్చిందని చెప్పారు. నిధులు విడుదల కాకుండా, మాజీ ముఖ్యమంత్రి సదానందగౌడ అడ్డుపడ్డారని ఆరోపించారు. పార్టీకి వెన్నుపోటు పొడిచే నాయకులను దూరం చేసుకుని, కొత్త తరానికి అవకాశాలు ఇస్తున్నామని తెలిపారు. శివరాత్రి రోజు మినహా ఈనెల 27 వరకు వరుసగా బెంగళూరు పరిధిలో పంచరత్న యాత్ర కొనసాగిస్తానని ప్రకటించారు. మార్చిలో హాసన, మైసూరు విభాగాలలో యాత్ర ఉంటుందని, 25వ తేదీ నాటికి ముగింపు సభను నిర్వస్తామని వెల్లడించారు. తమకు పూర్తి మెజారిటీ ఇస్తే 65 ఏళ్లు దాటిన పేదలకు నెలకు రూ.5 వేల పింఛను ఇస్తామని ప్రకటించారు. వివాహం చేసుకోని మహిళలకు నెలకు రూ.2 వేలు ఇస్తామని తెలిపారు. ఈసారి మంజునాథ్‌ను గెలిపించుకుంటే, ఆయనకు మంత్రిగా అవకాశం కల్పిస్తామని చెప్పారు. నమ్మ మెట్రో బోగీల తరహాలో వెండితో చేసిన హారాన్ని బోన్‌మిల్లు కార్యకర్తలు కుమారస్వామికి వేసి సత్కరించారు. బాగలగుంటెలో కొందరు కార్యకర్తలు గొర్రెపై కుమారస్వామి అని రాయించి బహుమతిగా ఇచ్చారు. ఎమ్మెల్సీ రవికుమార్‌ తమ యాత్రను విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు. విజయసంకల్ప యాత్ర బదులుగా సీడీ యాత్రను నిర్వహించాలని భాజపా నాయకులకు సలహా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని