logo

అదును చూసి.. జాబితా అస్త్రం!

విధానసభ ఎన్నికల పోరులో కాంగ్రెస్‌ పార్టీ తొలి అడుగు వేసింది. రాష్ట్రంలోని విధానసభ క్షేత్రాల్లో పోటీ చేసే అభ్యర్థులెవరో తేల్చింది.

Updated : 26 Mar 2023 06:39 IST

కాంగ్రెస్‌ తొలి అడుగు

ఈనాడు, బెంగళూరు : విధానసభ ఎన్నికల పోరులో కాంగ్రెస్‌ పార్టీ తొలి అడుగు వేసింది. రాష్ట్రంలోని విధానసభ క్షేత్రాల్లో పోటీ చేసే అభ్యర్థులెవరో తేల్చింది. సగానికి పైగా క్షేత్రాల్లో బరిలో దిగేందుకు కీలక నేతలు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, వారసులు, కొత్త, పాత ముఖాలకు చోటిచ్చింది. పార్టీ ముందుగా ప్రకటించినట్లు ఎలాంటి వివాదాలు, అసమ్మతికి చోటివ్వని క్షేత్రాల్లోనే అభ్యర్థులను ప్రకటించింది. తొలిజాబితా ప్రకటన తర్వాత అక్కడక్కడ అసంతృప్తి వ్యక్తమైనా ఆ ప్రభావం జాబితా సవరణకు దారితీయదన్న ధీమాతో పార్టీ ఉంది. అదునుచూసి.. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా వెల్లడించిన ఈ జాబితా అధికార పక్షం ప్రకటించే అభ్యర్థుల జాబితాను కూడా సవరించే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలి జాబితాలో కీలకమైన నేతలు పోటీ చేసే క్షేత్రాలు వెల్లడించటమే ఇందుకు కారణం.

సిద్ధు ఊహించనిది..

విపక్ష నేత సిద్ధరామయ్య పోటీ చేసే క్షేత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనమే. రెండు నెలల కిందటే ఆయన కోలారు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. రెండు వారాలుగా వ్యవహార శైలిని మార్చుకుని మళ్లీ చర్చకు అవకాశం కల్పించారు. కుటుంబ సభ్యుల అభిప్రాయం ప్రకారం పోటీ చేసే నియోజకవర్గాన్ని వెల్లడిస్తానని ప్రకటించిన మరుసటి రోజే ‘వరుణ’ నుంచి ఆయన పోటీ ఖరారైంది. రెండు చోట్ల  పోటీ చేయాలని యోచిస్తున్నటు అధిష్ఠానానికి వివరించానని సిద్ధు తెలిపారు. అందులో ఒక స్థానంపై స్పష్టత దొరికిందని శనివారం ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కోలార, బాదామిల్లో ఒక చోట పోటీకి సిద్ధమని సమాచారం. సిద్ధు కుమారుడు యతీంద్ర స్థానంపై పార్టీలో చర్చ కొనసాగుతోంది. కుమారుడి కోసం 2018 ఎన్నికల్లో వరుణ క్షేత్రాన్ని వదలుకున్న సిద్ధరామయ్య అక్కడికి చేరువలోని చాముండేశ్వరితో పాటు బాదామిలో పోటీ చేశారు. అందులో ఒక చోట ఓడిపోయి మరో చోట స్వల్ప మెజార్టీతో గెలిచారు. ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన సిద్ధరామయ్య గెలుపు ఎంత కీలకమో ఆయన ఓటమి ప్రత్యర్థులకు అంతే అవసరం.

నిర్ణయాలు అనూహ్యమే

ఏమాత్రం రాజకీయ అనుభవం లేని యువకుడు దర్శన్‌ ధ్రువనారాయణ్‌కు నంజనగూడు నుంచి టికెట్‌ ఇచ్చారు. ఇటీవల కనుమూసిన ధ్రువనారాయణ సేవలు, ఆయన వ్యక్తిత్వం పార్టీలో అందరినీ మెప్పించేవే. ఆయన మరణించిన రోజున పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఇచ్చిన మాట ప్రకారం దర్శనకు టికెట్‌ దక్కింది. ఈసారి కాంగ్రెస్‌ గెలిస్తే దళిత నేత ముఖ్యమంత్రి కాగలరన్న అంచనాతో రాష్ట్ర రాజకీయాల వైపు దృష్టి సారించిన మాజీ మంత్రి కె.హెచ్‌.మునియప్ప, గత ఎన్నికల్లో ఓడిపోయినా తన కుమారుడు మల్లికార్జునకు టికెట్‌ ఇప్పించగలిగిన శ్యామనూరు శివశంకరప్ప, రామనగర నుంచి పోటీ చేస్తారని అందరూ ఊహించిన డీకే సురేశ్‌ను కాదని ఒక ముస్లింకు, వ్యాపారవేత్త అశోక్‌ఖేనికి బీదర్‌ దక్షిణ నుంచి టికెట్‌ ఇవ్వటం పార్టీ తీసుకున్న అనూహ్య నిర్ణయాన్ని చాటాయి. టికెట్‌ దక్కటమే కష్టమనిపించిన మాజీ స్పీకర్‌ కోళివాడ్‌ తన కుమారుడికీ టికెట్‌ దక్కించుకోవటం, పార్టీలోకి చేరిన కొద్ది రోజుల్లోనే పుట్టణ్ణ, భాజపా వెన్నుపోటుతో దగా పడిన స్వతంత్య్ర అభ్యర్థి హెచ్‌.నగేశ్‌ టికెట్‌ సాధించటం అనూహ్యమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని