logo

రెక్కలు కట్టుకుని ఓట్ల వేట

విధానసభ ఎన్నికల ప్రకటన కోసం పార్టీలన్నీ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. ప్రకటన ఏ క్షణంలోనైనా వెల్లడించే వీలుంది. ఆలోపు కనీసం సగం రాష్ట్రాన్ని చుట్టేయాలి

Updated : 29 Mar 2023 12:07 IST

హెలికాప్టర్ల ధరలకు డిమాండు

నేతల కోసం సిద్ధమవుతున్న హెలిక్యాప్టర్లు

ఈనాడు, బెంగళూరు : విధానసభ ఎన్నికల ప్రకటన కోసం పార్టీలన్నీ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. ప్రకటన ఏ క్షణంలోనైనా వెల్లడించే వీలుంది. ఆలోపు కనీసం సగం రాష్ట్రాన్ని చుట్టేయాలి. ప్రకటన వచ్చాక మిగిలిన ప్రాంతాల్లో పర్యటించాలి. ఉన్నది కేవలం ఓ నెల సమయం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నేతలు హెలికాప్టర్ల వైపు దృష్టి సారించారు. బెంగళూరు నగరం నుంచి ఉత్తర కర్ణాటక ప్రాంతాలకు ప్రయాణమంటే కనీసం 600 కిలోమీటర్ల వరకు సాగాలి. ఈ ప్రయాణ భారం సులభతరం చేయాలంటే హెలికాప్టర్లు ఎక్కాల్సిందే. నెల రోజులుగా రాష్ట్రంలో ఈ విహంగాలకు ఎక్కడ లేని డిమాండు పెరిగిపోయింది.

ర్యాలీల జోరు

కాంగ్రెస్‌, భాజపా, జనతాదళ్‌, ఆప్‌ నేతలు మొత్తంగా కనీసం 600కుపైగా ర్యాలీలు నిర్వహించేందుకు ప్రణాళికలను తయారు చేసుకున్నారు. పార్టీల అంచనా ప్రకారం భాజపా 200, కాంగ్రెస్‌ 200, జేడీఎస్‌ 150, ఆప్‌ 50 ర్యాలీలు చేపడుతున్నట్లు ఆయా పార్టీల కార్యాలయాలు వెల్లడించాయి. ఈ ర్యాలీల కోసం జాతీయ, రాష్ట్ర నేతలు వస్తుంటారు. జాతీయ నేతలు వారి సొంత హెలికాప్టర్లు, విమానాల ద్వారా ప్రచార ప్రాంతాలకు చేరుకుంటారు. రాష్ట్ర నేతలు ఒక రోజులో మూడు నాలుగు చోట్ల ప్రచారం చేయాలి. వారికి హెలికాప్టర్లు తప్పనిసరి. భాజపా 2018 ఎన్నికల్లో వీటి కోసం రూ.17.2 కోట్లు, కాంగ్రెస్‌ రూ.10.5 కోట్లను వ్యయం చేయగా, జేడీఎస్‌ రూ.8 కోట్లు వ్యయం చేసింది. ఈ ఏడాది ఈ ఖర్చు రూ.50 కోట్లు దాటే వీలుందని గోల్డెన్‌ ఈగల్‌ ఏవియేషన్‌ డైరెక్టర్‌ జె.ఎస్‌.జార్జ్‌ తెలిపారు. పెరిగిన ధరలు, ర్యాలలకు అనుగుణంగా ఈ వ్యయం చేయక తప్పదు.

* రాష్ట్ర నేతలు తరచుగా అగ్ని ఏవియేషన్‌, డక్కన్‌ ఏవియేషన్‌, తంబి ఏవియేషన్‌, ఫ్లై బ్లేడ్‌ వంటి కంపెనీల హెలికాప్టర్లు వినియోగిస్తారు. వీటికి తోడు చార్టెడ్‌ ఫ్లైట్‌లు, 7 ఆసనాల డబుల్‌ ఇంజిన్‌ హెలికాప్టర్లనూ అందుబాటులోకి తెచ్చుకుంటున్నారు. మైసూరు, మంగళూరు, కలబురగి, బెళగావి, హుబ్బళ్లి, బళ్లారి, విజయపుర, రాయచూరు తదితర ప్రాంతాలకు తప్పనిసరిగా వీటినే వినియోగిస్తారు. వాటి ఛార్జీల వివరాలిలా..

* డబుల్‌ ఇంజిన్‌ హెలికాప్టర్‌ కోసం గంటకు రూ.3 లక్షలు

* డబుల్‌ ఇంజిన్‌ ప్రత్యేక విమానం : బెంగళూరు- దిల్లీ- బెంగళూరు వరకు రూ. 20 లక్షలు

* బెంగళూరు-కలబురగి వరకు : రూ.8 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు..

* బెంగళూరు- హుబ్బళ్లి- బెళగావి, మంగళూరు మార్గంలో : రూ.6.5 లక్షలు.

అప్రమత్తంగా లేకుండా ప్రమాదాల ముప్పు


గిఫ్టుబాక్సులు స్వాధీనం

మండ్య, న్యూస్‌టుడే : బెంగళూరు నుంచి శృంగేరికి తరలిస్తున్న గిఫ్టు బాక్సులను నాగమంగల సమీపంలోని కదబళ్లి టోల్‌గేటు వద్ద మంగళవారం స్వాధీనపరుచున్నారు. కుక్కర్లు, బాండ్లీలు, టీ సెట్లు, ఇతర వస్తువులు ఉన్న 1595 గిఫ్టు బాక్సులను జప్తు చేసుకున్నామని అధికారులు తెలిపారు. ఈ వస్తువులకు సంబంధించి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనపరుచుకున్నారు. శృంగేరి ఎమ్మెల్యే వీటిని తెప్పించుకుంటున్నట్లు గుర్తించారు. బండిగనవిలె ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఓటర్లకు పెద్ద ఎర!

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : యలహంక విధానసభ నియోజకవర్గంలో పరిధిలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఓవిద్యా సంస్థలో నిల్వ చేసిన రూ.3.67 కోట్ల విలువ చేసే వస్తువులను కేంద్ర ఆదాయ పన్నుల శాఖ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పక్కాగా అందిన సమాచారంతో విద్యాసంస్థ గోదాముపై అధికారులు దాడి చేశారు. కుక్కర్లు, వంట సామగ్రి, తదితర వాటిని స్వాధీనం చేసుకుని యలహంక పోలీసుఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని