logo

పథకాలే శ్రీరామరక్ష

విధానసభకు మే 10న జరిగే ఎన్నికలను ఎదుర్కొనేందుకు భాజపా సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పేర్కొన్నారు.

Updated : 30 Mar 2023 06:31 IST

అశోక్‌తో కలిసి విలేకరులతో మాట్లాడుతున్న బొమ్మై

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: విధానసభకు మే 10న జరిగే ఎన్నికలను ఎదుర్కొనేందుకు భాజపా సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పేర్కొన్నారు. అత్యంత బలమైన క్యాడర్‌, ఎక్కువ మంది సభ్యులను కలిగిన తమ పార్టీ ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ సాధనలను ప్రజలకు తెలియజేసిందన్నారు. బుధవారం మధ్యాహ్నం తన అధికారిక నివాస కార్యాలయం వద్ద మంత్రి ఆర్‌.అశోక్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. బూత్‌ స్థాయి కార్యక్రమాలు, మోర్చాల సమ్మేళనాలు, విజయ సంకల్ప యాత్ర, సంకల్ప యాత్ర, రథయాత్రలతో ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించినప్పుడు ప్రజల నుంచి చక్కని స్పందన లభించిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన పథకాలే తమకు శ్రీరామరక్ష అని అన్నారు. జనతా జనార్ధనుడు భాజపాకు అండగా నిలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. విపక్ష నాయకుల ఆరోపణలు, కుట్రలు, వారు ఇస్తున్న హామీలతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. అవినీతితో పాటు వారు చేస్తున్న ఇతర అన్ని ప్రయత్నాలు వారికి తిరుగుబాణాలయ్యాయని పేర్కొన్నారు. లోకాయుక్తను బలోపేతం చేశామని, అవినీతిని అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి సంప్రదాయకంగా ఉన్న ఓటు బ్యాంకు పూర్తిగా ఛిద్రమైందన్నారు. ఈ విషయాన్ని గుర్తించే వారు తమపై ఆధార రహిత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాల ప్రచారంతో పార్టీ శ్రేణులలో రెట్టింపు ఉత్సాహం వచ్చిందన్నారు. భాజపా నుంచి కాంగ్రెస్‌ పార్టీకి ఎవరూ వలస వెళ్లరని ధీమా వ్యక్తం చేశారు. భాజపా ఎమ్మెల్యేలు కొందరికి టిక్కెట్లు ఇస్తామని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ చేస్తున్న విఫల యత్నాలను గుర్తించామన్నారు. వారి పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు లేకపోవడంతో భాజపా అభ్యర్థులకు ఫోన్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. రిజర్వేషన్ల వర్గీకరణతో అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ జాబితా నుంచి ఎవరినీ తొలగించే ప్రశ్న లేదన్నారు. కొన్ని వర్గాలను రిజర్వేషన్ల జాబితా నుంచి తొలగించారని కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు ప్రచారాన్ని చేస్తోందని దుయ్యబట్టారు. బంజార, బోవి, కొరచ తదితరులను ఎస్సీ జాబితాలోనే ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ విషయమై ఇప్పటికే తాము కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించామన్నారు. తనకు భాజపా, కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం నుంచి ఆఫర్‌ వచ్చిందని దళపతి హెచ్‌డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, వారికి ఎవరి నుంచి ఎప్పుడు ఆఫర్లు వస్తాయో, ఆయన వాటిలో దేన్ని స్వీకరిస్తారో అది ఆయన ఒక్కరికే తెలుసని అన్నారు. ఎన్నికల ప్రచారానికి పార్టీ అగ్రనేతలు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారని చెప్పారు. ఏప్రిల్‌ 9న మైసూరులో నిర్వహించే పులుల సంరక్షణ కార్యక్రమానికి ప్రధాని మోదీ వస్తారని సీఎం వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని