logo

Siddaramaiah - DK Shivakumar: పట్టు వీడరు..మెట్టు దిగరు

కన్నడ నాట తాజా రాజకీయం రంగుల రాట్నంలా తిరుగుతోంది. అంతా అయిపోయిందనుకున్న తరుణంలో పదవీ పంపకాల క్రతువు ఇద్దరి సమ ఉజ్జీల మధ్య ఎడతెగని చిక్కుముడిగా ఉండిపోయింది

Updated : 17 May 2023 07:40 IST

ఇలా అయితే ఎలా?
ముందు కనిపించిన సమష్టి నాయకత్వం ఇప్పుడేదీ?

ఈనాడు, బెంగళూరు

కన్నడ నాట తాజా రాజకీయం రంగుల రాట్నంలా తిరుగుతోంది. అంతా అయిపోయిందనుకున్న తరుణంలో పదవీ పంపకాల క్రతువు ఇద్దరి సమ ఉజ్జీల మధ్య ఎడతెగని చిక్కుముడిగా ఉండిపోయింది. అధిష్ఠానం వద్ద పంచాయితీ ఇంకా తెగలేదు. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అధికార హస్తగతం చేసుకున్న కాంగ్రెస్‌కు ఈ పరిణామం తలనొప్పులు తెచ్చిపెడుతోంది. పాలనపై ఈ ప్రభావం తప్పదని విశ్లేషకులు సైతం పెదవి విరుస్తున్నారు.

కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తుందని భాజపాను ఎవరైనా అడిగితే..అంత సీను లేదని భాజపా నేతలు బదులిచ్చేవారు. అందుకు కారణం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య వర్గపోరాటం ఆ పార్టీని రెండు చీల్చుతుందని ప్రత్యర్థులు ఆరోపించేవారు. ఎన్నికల ముందు వరకు అలాంటిదేమీ మా మధ్య లేదని ప్రకటిస్తూ వచ్చిన ఆ ఇద్దరూ తీరా ఎన్నికల ఫలితాలు వచ్చాక వారి నిజస్వరూపాలు బయటపెట్టారు. ఇద్దరి మధ్యా ఇంత విభేదాలు ఉండి అంతలా ఎలా నటించారని ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తున్నారు. ఇచ్చిన హామీలు, భాజపా పాలనపై వచ్చిన వ్యతిరేకతను ప్రజల నుంచి చెరిపే ప్రయత్నాలు పక్కనబెట్టి..అధికారం కోసం జాతీయ స్థాయిలో రచ్చ చేయటం ఆ పార్టీ వాస్తవ రూపాన్ని నిలువునా బయటపెట్టింది.

నల్లేరుపై నడక కాదేమో?

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో నేడో, రేపో తేలిపోతుంది. ఆపై పరిణామాలను తట్టుకోవటం పార్టీకి అంత సులువైతే కాబోదు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లో ఏ ఒక్కరిని తగ్గించినా వారి అసమ్మతి ప్రభావం పార్టీని కుదిపేయక మానదు. వీరిద్దరూ అధిష్ఠానాన్ని కూడా శాసించగల నేతలన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా రాష్ట్రంలోని అత్యంత బలమైన సామాజిక వర్గాలకు వీరిద్దరూ ప్రతినిధులు కూడా. సిద్ధరామయ్యను కాదనుకుంటే రాష్ట్రంలో అత్యధిక శాతం ఓట్లున్న అహిందలు, సీనియర్‌ నాయకుల సహకారం కాదనుకున్నట్లే. డీకేకు ప్రాధాన్యం తగ్గిస్తే ఒక్కలిగలు, కొత్తతరం నాయకత్వం, రాష్ట్రానికి, జాతీయ స్థాయిలో పార్టీకి అపారమైన వనరులకు గండిపడ్డట్లే. రెండు కత్తులను ఒకే ఒరలో చొప్పించటమంటే ఏఐసీసీకి ఓ యుద్ధం చేసినట్లే.

పాలన సజావుగా సాగేనా

ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తే, రెండో నేత సూచించిన వారికి కీలకమైన శాఖలు ఇచ్చి తీరాల్సిందే. అసలే ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన అక్కసుతో ఉన్న బాధిత నేత పాలనపై తనదైన ప్రభావాన్ని చూపకమానరు. సరిగ్గా 2019లోనూ సంకీర్ణ ప్రభుత్వం చేతులు కాల్చుకుంది ఈ అంతర్గత రాజకీయాల వల్లనే. 37 సీట్లొచ్చినా ముఖ్యమంత్రిని చేశామని పదేపదే దెప్పిపొడిచిన సిద్ధరామయ్య..కుమారస్వామిని సజావుగా పని చేయనివ్వలేదు. ఈసారి తనను కాదని డీకేను ముఖ్యమంత్రిని చేసినా సిద్ధరామయ్య అదే రాజకీయాన్ని పునరావృతం చేయరని చెప్పలేం. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయినా డీకే అంతే స్థాయిలో రాజకీయం చేయగలరు. ఇప్పటికే తన వద్ద సిద్ధరామయ్య తాలూకూ రాజకీయ భాగోతాలు దండిగా ఉన్నాయని హెచ్చరిస్తున్న డీకే..తనకు ప్రాధాన్యం దక్కని సమయాల్లో వాటిని బహిరంగపరచి పాలన వేగానికి కళ్లెం వేయగలరు.

పెరుగుతున్న ఆశావహులు

రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీకి ఘనమైన స్థాయిలో సీట్లు వచ్చాయి. పార్టీ వైపు మళ్లిన సానుకూల పవనాలు ఎందరో సీనియర్లను గెలిపించాయి. ఈసారి గెలిచి వచ్చిన వారిలో డీకే శివకుమార్‌ను ఏకవాక్యంతో పిలిచేంత సత్తా ఉన్నవారు. ఆర్‌.వి.దేశ్‌పాండే, శ్యామనూరు శివశంకరప్ప, రాజణ్ణ, హెచ్‌.కే.పాటిల్‌, శివానంద పాటిల్‌, రామలింగారెడ్డి, డా.జి.పరమేశ్వర్‌,  కేపీసీసీ మాజీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావ్‌, సతీశ్‌ జార్ఖిహొళి ఇలా చెప్పుకొంటూ పోతే కనీసం 50మంది సీనియర్లు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టేలా చెప్పగలరు. వీరికి మంత్రివర్గంలో చోటు లేకున్నా, ఆశించిన శాఖలు దక్కకున్నా పార్టీని ఇరుకున పడవేయగలరు. రెండో తరం నాయకులైన లక్ష్మీ హెబ్బాళ్కర్‌, ఇటీవలే కాంగ్రెస్‌లో చేరి లింగాయత్‌ల ప్రతినిధిని అని ప్రచారం చేసుకునే లక్ష్మణ సవది, వినయ్‌ కులకర్ణి, ప్రియాంక ఖర్గే, జమీర్‌ అహ్మద్‌, అజయ్‌ ధరమ్‌సింగ్‌, ఈశ్వర ఖండ్రేలు వారి సముదాయాలకు తామే ప్రతినిధులమని ప్రకటించేసుకుంటున్నారు. అసలే పార్టీలో సిద్ధరామయ్య, డీకేల వర్గాలుగా మారిన నేపథ్యంలో ఇంతమంది సీనియర్లను నియంత్రించేందుకు స్వయంగా మల్లికార్జున ఖర్గే రంగంలో దిగినా కష్టమేమో.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని