logo

మండ్యలో కొత్త ఊపు

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం బుధవారం నుంచి కొత్త హంగులు అద్దుకోనుంది. ఇప్పటి వరకు జాతీయ పార్టీల తారా ప్రచారంలో భాజపా నేతల దండే సందడి చేసింది. ఆ పార్టీ భాగస్వామిగా ఉన్న జేడీఎస్‌కు హెచ్‌.డి.దేవేగౌడ సహకారం ఎలాగూ ఉండనే ఉంది.

Published : 17 Apr 2024 05:02 IST

నేడే కాంగ్రెస్‌ సభ
రాహుల్‌గాంధీ రాక

 రాహుల్‌గాంధీ

ఈనాడు, బెంగళూరు : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం బుధవారం నుంచి కొత్త హంగులు అద్దుకోనుంది. ఇప్పటి వరకు జాతీయ పార్టీల తారా ప్రచారంలో భాజపా నేతల దండే సందడి చేసింది. ఆ పార్టీ భాగస్వామిగా ఉన్న జేడీఎస్‌కు హెచ్‌.డి.దేవేగౌడ సహకారం ఎలాగూ ఉండనే ఉంది. కాంగ్రెస్‌ తరఫున ఇప్పటి వరకు రాష్ట్ర నేతల నేతృత్వంలోనే ప్రచారం కొనసాగుతుంది. బుధవారం నుంచి కాంగ్రెస్‌కు తారా ప్రచారకుల ఆగమనం ప్రారంభం కానుంది. ఆ పార్టీ దిగ్గజ నేత రాహుల్‌గాంధీ రానుండటంతో శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇప్పటికే కలబురగి బహిరంగ సభలో ప్రసంగించినా ఆయన ప్రచారం రానున్న రోజుల్లో ఉత్తర కర్ణాటకలో విస్తృతం కానుందని పార్టీ వెల్లడించింది.

  • రాహుల్‌గాంధీ ఓ వైపు కేరళలో ఎంపీగా పోటీ చేస్తుండగా ఆయన ప్రచారాన్ని వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని పార్టీ యోచిస్తోంది. తొలివిడత ఎన్నికలకు కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ కొద్ది సమయంలోనూ రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక వాద్రేలతో ప్రచారాన్ని చేయించాలని పార్టీ యోచించింది. ఇందులో భాగంగానే కీలకమైన మండ్య, కోలారుల్లో రాహుల్‌గాంధీ ప్రచారం చేస్తారు. బెంగళూరు నుంచి మధ్యాహ్నమే నేరుగా మండ్యకు వెళ్లే రాహుల్‌గాంధీ అక్కడ రెండు గంటల పాటు బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రత్యేక హెలీకాప్టర్‌లో కోలారుకు సాయంత్రం నాలుగు గంటలకు చేరుకుని.. సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయానికి చేరుకుని దిల్లీకి బయలుదేరుతారు. ఆయన సమావేశాలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో పాటు ఆయా స్థానాల అభ్యర్థులు, స్థానిక నేతలు పాల్గొంటారు.
  • భాజపా, జేడీఎస్‌ కూటమి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే స్థానం మండ్య. ఇక్కడ ఎన్‌డీఏ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ తరఫున స్టార్‌ చంద్రు పోటీ చేస్తున్నారు. ఒక్కలిగల అడ్డాగా ఉన్న మండ్యలో అటు హెచ్‌డీ దేవేగౌడ, డీకే శివకుమార్‌ ఆధిపత్యానికి కూడా ఓ పరీక్షే. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హెచ్‌డీ దేవేగౌడ సంయుక్తంగా ఎన్‌డీఏ ప్రచారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ, దేవేగౌడ చేసిన ఆరోపణలకు రాహుల్‌గాంధీ ఎలా స్పందిస్తారో చూడాలి. కాంగ్రెస్‌ను తుక్డే గ్యాంగ్‌గా ప్రధాని అభివర్ణించగా, దేవేగౌడ మాత్రం రాష్ట్ర ప్రజల సొమ్మును దిల్లీకి దోచు పెడుతున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లపై విరుచుకుపడ్డారు. ఓ వైపు భారత్‌జోడో యాత్రతో దేశాన్ని సమైక్య పరచాలని ప్రయత్నిస్తున్న రాహుల్‌గాంధీ ఈ సమావేశంలో మోదీ, దేవేగౌడ ఆరోపణలకు బదులిచ్చేందుకు ప్రయత్నిస్తారు.
  • ఇంటి పోరు రచ్చకు చేరిన కోలారు నియోజకవర్గం కాంగ్రెస్‌కు ఎంతో కీలకం. అక్కడ పొరుగు జిల్లా నుంచి రప్పించిన అభ్యర్థి (గౌతమ్‌)ని బరిలో దింపిన కాంగ్రెస్‌కు స్థానిక నేత మునియప్ప నుంచి ముప్పు పొంచి ఉంది. జేడీఎస్‌ అభ్యర్థి మల్లేష్‌బాబు ఇక్కడ బరిలో ఉన్నారు. స్థానిక, స్థానికేతర అభ్యర్థిత్వంతో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రమేశ్‌కుమార్‌, మునియప్ప వర్గపోరాటం కాంగ్రెస్‌కు సవాలే. కోలారు నుంచి ప్రచారం చేయటం పార్టీకి అచ్చిరావటంతో రాహుల్‌తో ఇక్కడ అడుగు పెట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. త్వరలోనే సోనియాగాంధీ, ప్రియాంక వాద్రే ఒకసారి మాత్రమే ప్రచారానికి వస్తారని సమాచారం. వీరంతా దేశవ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉండటంతో తొలి విడతలో ఓసారి, మలి విడతలో ఓసారి మాత్రమే వీరి నుంచి ప్రచారం చేయించే అవకాశం ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని